Papaya In Monsoon | బొప్పాయి పండ్లు మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. కానీ బొప్పాయి పండ్లను మనం వర్షాకాలంలో ఎక్కువగా తినాల్సి ఉంటుంది. బొప్పాయి పండ్లను తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. వర్షాకాలంలో ఈ పండ్లను తినాలా, వద్దా అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ ఈ పండ్లను ఈ సీజన్లోనే కచ్చితంగా తినాలని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి పండ్లలో అనేక ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. బొప్పాయి పండ్లలో పపైన్, కైమో పపైన్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి జీర్ణ రసాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. మనం తిన్న ఆహారంలో ఉండే ప్రోటీన్లు, కొవ్వులను జీర్ణం చేయడంలో ఇవి సహాయం చేస్తాయి. వర్షాకాలంలో మన జీర్ణ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది. కానీ బొప్పాయి పండ్లను తింటే జీర్ణ వ్యవస్థను యాక్టివ్‌గా ఉండేలా చేయవచ్చు. దీంతో ఆహారం సులభంగా జీర్ణం అవడమే కాదు, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
వర్షాకాలంలో ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ బొప్పాయి పండును తింటే ఫుడ్ పాయిజనింగ్‌ను నివారిస్తుంది. ఇందుకు కారణం అయ్యే బ్యాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేసే గుణాలు బొప్పాయి పండ్లలో ఉంటాయి. ఈ పండ్లను తింటే విరేచనాలు తగ్గుతాయి. పొట్టలో ఉండే నులి పురుగులు సైతం నశిస్తాయి. మలబద్దకం ఉన్నవారు బొప్పాయి పండ్లను తింటుంటే ఫలితం ఉంటుంది. విరేచనం సాఫీగా అవుతుంది. పేగుల్లో ఉండే మలం పూర్తిగా బయటకు వస్తుంది. బొప్పాయి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ ఎ, విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్ తదితర యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ పండులో అధికంగా ఉంటాయి. ఇవి వర్షాకాలంలో సహజంగానే మనకు వచ్చే ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఈ సీజన్లో వచ్చే ఫ్లూ, దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్లను తగ్గేలా చేస్తాయి. ఈ పండులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులను తగ్గేలా చేస్తాయి. కనుక ఈ సీజన్లో బొప్పాయి పండ్లను విడిచిపెట్టకుండా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
బొప్పాయి పండ్లను తినడం వల్ల శరీరంలోని వాపులు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పండ్లలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి బొప్పాయి పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్లు ఎ, సి, ఇ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తాయి. వర్షాకాలం కారణంగా గాలిలో తేమ అధికంగా ఉంటుంది. దీంతో చర్మం డల్‌గా మారుతుంది. కొందరికి దురదలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు బొప్పాయి పండ్లను తింటుండాలి. లేదా వీటిని గుజ్జుగా చేసి ఫేస్ ప్యాక్‌లా కూడా ఉపయోగించవచ్చు. బొప్పాయి పండు ఫేస్ ప్యాక్‌ను వాడితే ముఖం కాంతివంతంగా మారి మెరుస్తుంది. యవ్వనంగా కనిపిస్తారు. మొటిమలు, మచ్చలు సైతం పోతాయి.
వర్షాకాలంలో తలెత్తే విరేచనాల సమస్య వంటి వాటి కారణంగా కొందరికి శరీరంలో ద్రవాలు త్వరగా బయటకు పోతాయి. అలాంటి వారు బొప్పాయి పండ్లను తింటుంటే ఫలితం ఉంటుంది. ఈ పండ్లలో ఉండే ఎంజైమ్‌లు జీవక్రియలను సరిగ్గా నిర్వహించడంలో సహాయం చేస్తాయి. దీంతో క్యాలరీలు సులభంగా ఖర్చవుతాయి. బరువు తగ్గుతారు. బరువు తగ్గాలనే డైట్లో ఉన్నవారు బొప్పాయి పండ్లను రోజూ తింటుంటే ఫలితం ఉంటుంది. ఈ పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లను రక్షిస్తుంది. వయస్సు మీద పడడం వల్ల వచ్చే శుక్లాల సమస్య రాకుండా చూస్తుంది. బొప్పాయి పండ్ల గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల షుగర్ ఉన్నవారు ఈ పండ్లను తిన్నా షుగర్ లెవల్స్ పెరగవు. పైగా ఈ పండ్లలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్‌ను తగ్గించేందుకు సహాయం చేస్తాయి. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇలా బొప్పాయి పండ్లను వర్షాకాలంలో ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.