ఆలస్యంగా తినడం అందరి సమస్యే. ఒక్కోసారి సమయం కలిసొచ్చి.. తినాల్సిన సమయం కంటే ముందే తింటారు. ఆలస్యంగా నిద్రపోవడం, రాత్రి పని చేసేవాళ్లకు అర్ధరాత్రి మళ్లీ ఆకలవుతుంది. రాత్రి రెండో డిన్నర్ లాగించేస్తారు. తరచుగా డబుల్ డిన్నర్ తినేవాళ్లకు ఆకలి సమస్యలు ఉంటాయి. నిద్రలేమి, అధిక బరువు అదనపు సమస్యలు తప్పవని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఓటీటీలో షోలు చూస్తూ, థియేటర్లో సినిమాలు, క్రికెట్ మ్యాచ్‌లు, మ్యూజిక్ కాన్సర్ట్, ట్రావెల్, రాత్రి వేళ ఉద్యోగ విధులు చేసేవాళ్లలో చాలామంది డబుల్ డిన్నర్ సమస్య ఎదుర్కొంటున్నారు. డిన్నర్ సరైన సమయానికే చేసినా.. రాత్రి ఎక్కువ సమయం మేల్కొని ఉండటం వల్ల వీళ్లకు మళ్లీ ఆకలవుతుంది. అప్పుడు భోజనం, లేకపోతే ఇష్టమైన స్నాక్స్‌ని కడుపునిండా ఆరగిస్తారు. అప్పటికే మొదటి డిన్నర్ ద్వారా శరీరానికి కావాల్సినంత ఎనర్జీ అందుతుంది.
(సెకండ్) డిన్నర్‌కి నిద్ర పోవడానికి మధ్య తక్కువ సవయం ఉంటే తిన్నది జీర్ణం కాదు. ఫలితంగా నిద్ర సరిగ్గా పట్టదు. రెండోసారి తిన్నది శరీర అవసరాలకు ఉపయోగపడదు. అప్పటికే మొదటి డిన్నర్ నుంచి తయారైన గ్లూకోస్ శరీరానికి కావాల్సిన శక్తినిస్తుంది. సెకండ్ డిన్నర్లో తిన్న ఆహారం జీర్ణమైన తర్వాత కొవ్వుగా మారి, శరీర బరువును పెంచుతుంది. పార్టీలు, స్నేహితులతో షికార్లు చేస్తూ డాబా హోటళ్లు, రెస్టారెంట్లలో అర్ధరాత్రి తినేవాళ్లలో చాలామంది డబుల్ డిన్నర్ ఆరగించేవాళ్లే! ఇలా తినడం సరదాగా ఉంటుంది. కానీ, ఆరోగ్యానికి మాత్రం తీవ్రంగా హాని చేస్తుంది.