Tuberculosis | టెక్నాలజీ, వైద్యం, విజ్ఞాన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నా క్షయవ్యాధి (Tuberculosis) ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సంక్రమణ వ్యాధుల్లో ఒకటిగా మారింది. చికిత్సలో పురోగతి ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది, ముఖ్యంగా పేదరికంలో జీవిస్తున్నవారు లేదా సరైన వైద్య సదుపాయాలు లేని వారు ఇంకా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. క్షయవ్యాధి నుంచి కోలుకోవడానికి మందులు మాత్రమే సరిపోవని, సరైన పోషకాహారం కూడా అంతే కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాల ప్రకారం తక్కువ పోషకాహారం (Under nutrition) క్షయవ్యాధి తీవ్రతను పెంచే ప్రధాన కారణంగా మారింది. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరచి వ్యాధి తీవ్రత, మళ్లీ రావడం (relapse), మరణాల రేటును పెంచుతుందని తేలింది. అందువల్ల TB రోగులకు మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు కూడా పోషకాహార మూల్యాంకనం, సలహాలు, ఆహార మద్దతు తప్పనిసరి చేయాలని WHO సూచిస్తోంది. వైద్య అధ్యయనాలు కూడా ఈ మార్పును సూచిస్తున్నాయి.
పోషకాహారం తక్కువగా తీసుకునే రోగులు నెమ్మదిగా కోలుకుంటారు, ఫలితాలు కూడా తక్కువగా ఉంటాయి. చికిత్స ప్రారంభ దశలో బరువు పెరగడం, మరణ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. క్షయవ్యాధి రోగుల ఆహారంలో ముఖ్యంగా అధిక కాలరీలు, అధిక ప్రోటీన్ ఉండాలి. ఈ వ్యాధి శరీరంపై ఒత్తిడిని పెంచి, ఆకలిని తగ్గిస్తుంది. అందువల్ల శరీర బలాన్ని తిరిగి పొందడానికి, కండరాలను పునర్నిర్మించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి పోషకాహారం అవసరం. మిల్లెట్లు, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి సంపూర్ణ ధాన్యాలు, పప్పులు, గుడ్లు, చికెన్, చేపలు, పాలు, పెరుగు, పనీర్ వంటి పదార్థాలు ఆహారంలో ఉండాలి. అలాగే సూక్ష్మ పోషకాలు (Micro nutrients) కూడా ముఖ్యమే. విటమిన్లు, ఖనిజాలు తక్కువ పరిమాణంలో అవసరమైనప్పటికీ, శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఆకుకూరలు, క్యారెట్, టమాటా, సిట్రస్ పండ్లు, నట్స్, గింజలు, ఫోర్టిఫైడ్ సిరియల్స్ వంటి పదార్థాలు రోజువారీ ఆహారంలో ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కోలుకోవడంలో సహాయపడతాయి. చాలా మంది TB రోగులకు ఆకలి తగ్గడం, బరువు తగ్గడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అవకాడో, నట్స్, నట్ బటర్స్, ఆలివ్ ఆయిల్, సర్సన్ (మస్టర్డ్) ఆయిల్ వంటి మంచి కొవ్వులు శక్తిని అందిస్తాయి. ఇక హైడ్రేషన్ కూడా చాలా ముఖ్యం. సరిపడా నీరు తాగడం ద్వారా శరీరం మందులను సరిగ్గా గ్రహిస్తుంది, మెటబాలిజం మెరుగుపడుతుంది, జీర్ణక్రియ సులభమవుతుంది. నీరు, కొబ్బరి నీరు, సూప్స్, పెరుగు వంటి ప్రోబయోటిక్ ఆహారాలు గట్ (జీర్ణ వ్యవస్థ) ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కొన్ని ఆహారాలను పరిమితం చేయడం అవసరం. ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక కెఫీన్, చక్కెర పదార్థాలు, మద్యం వంటివి రోగనిరోధక శక్తిని తగ్గించి, మందుల ప్రభావాన్ని కూడా దెబ్బతీస్తాయి. ముఖ్యంగా మద్యం లివర్‌పై ప్రతికూల ప్రభావం చూపి చికిత్సను కష్టతరం చేస్తుంది.
తాజా WHO విధాన మార్పులు క్షయవ్యాధి చికిత్సలో పోషకాహారాన్ని ప్రధాన భాగంగా గుర్తిస్తున్నాయి. RATIONS ట్రయల్ వంటి అధ్యయనాలు కూడా రోగులకు, వారి కుటుంబాలకు ఆహారం అందించడం ద్వారా కొత్త ఇన్ఫెక్షన్లు తగ్గి, జీవన రేటు పెరిగిందని వెల్లడించాయి. సరైన అవగాహన, పోషకాహారం, వైద్య చికిత్స వంటివన్ని కలిసి పనిచేస్తే, క్షయవ్యాధి రహిత ప్రపంచం లక్ష్యం సాధ్యమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.