Nocturnal Leg Cramps | వ్యాయామం లేదా శారీరక శ్రమ చేసినప్పుడు, ఆటలు ఆడే సమయంలో, ఇంకా ఇతర సందర్భాల్లో కొందరికి అప్పుడప్పుడు కాలి పిక్కలు పట్టుకుపోతుంటాయి. కండరాల్లో అనూహ్యంగా వచ్చే కదలికల వల్ల ఇలా జరుగుతుంది. అయితే కాసేపటికి సమస్య తగ్గుతుంది. కానీ కొందరికి నిద్రలో ఇలా జరుగుతుంది. ఈ సమస్య అంత సులభంగా తగ్గేది కాదు. ఇలా కొందరికి రోజూ జరుగుతుంది. దీంతో బాధతో విలవిలలాడిపోతారు. అయితే ఇలా రాత్రి పూట నిద్రలో కాలి పిక్కలు పట్టుకుపోవడాన్ని వైద్య పరిభాషలో Nocturnal Leg Cramps అంటారు. ఇలా రాత్రి పూట జరగడం వల్ల చాలా మందికి నిద్రకు ఆటంకం కలుగుతుంది. కాసేపు నొప్పి తీవ్రంగా ఉండి మళ్లీ దానంతట అదే తగ్గిపోతుంది. అయితే కొందరికి కాలి పిక్కలు మాత్రమే కాకుండా పాదాలు, తొడల్లోనూ ఇలా జరుగుతుంది. ఇక ఈ సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
కాలి పిక్కలు పట్టుకుపోయినప్పుడు సాధారణంగా ఆ ప్రదేశంలో ఉండే కండరాలు ముడుచుకుపోతాయి. దీంతో కాసేపు నొప్పి తీవ్రంగా ఉంటుంది. రక్త సరఫరా మెరుగు పడగానే నొప్పి తగ్గుతుంది. అలాగే ఈ నొప్పి వచ్చినప్పుడు కొన్ని సార్లు పాదాలు లేదా కాళ్లు, వేళ్లు వంకర తిరిగినట్లు అవుతాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు గురవుతారు. కొందరికి కేవలం కాలి వేళ్లకు మాత్రమే ఇలా జరుగుతుంది. కండరాలు పట్టేసినప్పుడు సహజంగానే నొప్పి సుమారుగా 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంటుంది. తరువాత దానంతట అదే తగ్గుతుంది. కానీ కొందరికి ఈ సమస్య రోజూ రాత్రి ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. అలాగే కొందరికి పగటి పూట కూడా ఇలా జరుగుతుంది. అయితే ఈ సమస్య ఒకప్పుడు కేవలం వయస్సు మీద పడిన వారిలోనే ఎక్కువగా వచ్చేది. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు కూడా ఈ సమస్యతో సతమతం అవుతున్నారు.
ఫెరిఫెరల్ న్యూరోపతి, పార్కిన్సన్స్, లివర్ వ్యాధులు, కిడ్నీ జబ్బులు, రక్త నాళాల్లో క్లాట్స్ ఏర్పడడం, వెరికోస్ వీన్స్ ఉన్నవారికి సాధారణంగా ఈ సమస్య వస్తుంది. వారికి తరచూ కండరాలు పట్టేస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి పూట ఇలా ఎక్కువగా జరుగుతుంది. రాత్రి పూట కాలి పిక్కలు ఎక్కువగా పట్టుకుపోతుంటాయి. రక్త నాళాల్లో రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం, కండరాలు కుచించుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే ఆయా వ్యాధులు ఉన్నవారితోపాటు థైరాయిడ్ సమస్య ఉన్నవారిలో, మెగ్నిషియం లోపం ఉన్నవారిలోనూ ఇలాగే జరుగుతుంది. కనుక ఎవరికైనా ఇలా జరుగుతుంటే డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకోవడం మంచిది. వారు మీకున్న సమస్యను బట్టి వ్యాధిని నిర్దారిస్తారు. కాలి పిక్కలు ఎందుకు పట్టుకుపోతున్నాయో కారణం అన్వేషిస్తారు. దీంతో అందుకు అనుగుణంగా చికిత్సను అందిస్తారు.
అయితే ఆయా వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు చికిత్స తీసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది. కానీ మెగ్నిషియం లోపం ఉన్నవారు మాత్రం ఆ పోషక పదార్థం ఉండే ఆహారాలను తినాల్సి ఉంటుంది. పెరుగు, అరటి పండ్లు, తర్బూజా, క్యారెట్లు, నారింజ పండ్లు, పాలు, చేపలు, పాలకూర, టమాటాలు, చిలగడ దుంపలు, బాదంపప్పు, పచ్చికొబ్బరి, అవకాడోలు, జీడిపప్పు, చింతపండు వంటి ఆహారాలను తీసుకోవడం వల్ల మెగ్నిషియం లభిస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడి కండరాలు పట్టేయడం తగ్గుతుంది. రాత్రి పూట నిద్రలోనూ కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. అలాగే రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, వేళకు నిద్రించడం, అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను రోజూ తీసుకోవడం, విటమిన్ బి12 ఉండే ఆహారాలను తీసుకోవడం వంటివి చేస్తున్నా కూడా ఈ సమస్య తగ్గుతుంది.