Nerves Weakness | నరాల వీక్నెస్.. దీన్నే న్యూరోపతి అని కూడా అంటారు. లేదా ఫెరిఫెరల్ న్యూరోపతి అని కూడా పిలుస్తారు. మెదడుకు అనుసంధానం అయి ఉన్న లేదా వెన్నెముక వద్ద ఉన్న నాడులు దెబ్బ తింటే ఈ సమస్య వస్తుంది. దీంతో అనేక విధాలుగా మన శరీరంపై ప్రభావం పడుతుంది. నరాల వీక్నెస్ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలంలో షుగర్ కంట్రోల్లో ఉండకపోతే నరాలు డ్యామేజ్ అవుతాయి. దీంతో నరాల వీక్నెస్ వస్తుంది. అలాగే ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నవారికి కూడా నరాల వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పలు రకాల దీర్ఘకాల ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి, జన్యు పరమైన వ్యాధులు వచ్చిన వారికి, ట్యూమర్లు పెరుగుతున్నవారికి, బోన్ మారో వ్యాధులు ఉన్నప్పుడు, కిడ్నీ, లివర్, థైరాయిడ్ వ్యాధులు ఉన్నవారిలోనూ నరాల వీక్నెస్ సంభవిస్తుంది.
మద్యం అధికంగా సేవించే వారు పోషకాహార లోపం బారిన పడతారు. దీంతోనూ నరాల వీక్నెస్ వస్తుంది. అలాగే విషాహారం బారిన పడినా, విషం తీసుకున్నా, దీర్ఘకాలంగా మందులను వాడేవారిలో, పై నుంచి కింద పడడం, యాక్సిడెంట్లు అవడం వంటి సందర్భాల్లోనూ విటమిన్ల లోపం ఏర్పడిన వారిలో నరాల వీక్నెస్ వస్తుంది. అయితే కారణాలు అధికంగా ఉంటాయి కనుక సరిగ్గా దేని వల్ల ఈ వ్యాధి వచ్చింది అన్న విషయం నిర్దారించడం కష్టంగా మారుతుంది. నరాల వీక్నెస్ వచ్చిన వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను బట్టి ఈ వ్యాధి ఉందని ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. దీంతో వ్యాధి మరింత తీవ్రతరం కాకుండా ఉంటుంది. నరాల వీక్నెస్ ఉంటే చేతుల్లో, పాదాల్లో సూదులతో గుచ్చినట్లు ఉంటుంది. ఆయా భాగాల్లో వణుకు కూడా వస్తుంది. నొప్పులు అధికంగా ఉంటాయి. శరీరంలో ఏ భాగంలో టచ్ చేసినా నొప్పిగా అనిపిస్తుంది.
నరాల వీక్నెస్ ఉంటే కండరాలు బలహీనంగా మారి నొప్పులు ఉంటాయి. నడుస్తున్నప్పుడు లేదా పరిగెత్తుతున్నప్పుడు బ్యాలెన్స్ తప్పినట్లు అనిపిస్తుంది. కొందరు పట్టు తప్పి పడిపోతారు కూడా. నడవడం కూడా కొందరికి కష్టంగా ఉంటుంది. వేడిని తట్టుకోలేకపోతుంటారు. చెమటలు విపరీతంగా వస్తుంటాయి. బీపీ అసాధారణ రీతిలో మారుతుంది. వికారం, వాంతికి వచ్చినట్లు ఉండడం, మలబద్దకం ఉంటాయి. మూత్ర విసర్జన చేయడం కష్టంగా మారుతుంది. శృంగారంపై ఆసక్తి ఉండదు. కొందరికి కంటి చూపు మసకగా మారుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత తగ్గుతాయి. తలనొప్పిగా ఉంటుంది. నరాల వీక్నెస్ ఉన్నవారు డాక్టర్ ఇచ్చే మందులతోపాటు ఆహారం విషయంలోనూ పలు మార్పులు చేసుకోవాలి. అన్ని పోషకాలు కలిగే ఉండే ఆహారాలను తినాలి. బి విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలను తింటే నరాల వీక్నెస్ తగ్గుతుంది.
నరాల వీక్నెస్ ఉన్నవారు రోజూ తేలికపాటి వ్యాయామాలను చేయాలి. వేడి నీటితోనే స్నానం చేయాలి. శరీరానికి నువ్వుల నూనెతో మర్దనా చేసి స్నానం చేస్తుండాలి. పొగ తాగేవారు, మద్యం సేవించేవారు ఆ అలవాట్లను మానుకోవాలి. రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించాలి. వేళకు భోజనం చేయాలి. తాజా పండ్లు, కూరగాయలతోపాటు సీజనల్ పండ్లను అధికంగా తినాలి. తృణ ధాన్యాలను, ప్రోటీన్లను అధికంగా తీసుకోవాలి. బీపీ, షుగర్ ఉన్నవారు వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మాంసం, చేపలు, కోడిగుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, ఆకుపచ్చని కూరగాయలు, ఆకుకూరలు, నట్స్, విత్తనాలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇలా డైట్‌ను పాటిస్తూ డాక్టర్లు ఇచ్చిన మందులను వేసుకుంటూ తగిన పోషకాహారం తీసుకుంటే కచ్చితంగా నరాల వీక్నెస్ నుంచి బయట పడవచ్చు.