చాలామంది బాలింతలు శిశువుకు తల్లిపాలను కాకుండా సీసాపాలు పడుతుంటారు. కనీసం బిడ్డకు పట్టే పాలప్యాకెట్‌పై గడువు తేదీనైనా చూడకుండా గుడ్డిగా కొనేస్తున్నారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ప్రముఖ ఫుడ్ సంస్థ అయిన ‘నెస్లే’ తమ బేబీ ఫార్ములా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. ఈ ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియల్ టాక్సిన్ ఉందన్న అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వార్తలపై నెస్లే ఇండియా స్పందిస్తూ.. భారత్‌లో విక్రయించే తమ ఉత్పత్తులన్నీ స్థానికంగా తయారైనవేనని, విదేశాల్లో రీకాల్ చేసిన బ్యాచ్‌లతో ఇక్కడి ఉత్పత్తులకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇక్కడి ఉత్పత్తులు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని భరోసా ఇచ్చింది. ఏది ఏమైనా సీసా పాలు బిడ్డ ప్రాణానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తుండటం గమనార్హం. శిశువు ఆరోగ్యాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్యాకెట్ పాలపై పలువురు వైద్యులు స్పందిస్తూ.. ‘ప్యాకెట్ పాలలో చేరిన ‘సెరూలైడ్’ అనే టాక్సిన్ ఎంత వేడి చేసి మరిగించినా నాశనం కాదు.
ఇది నేరుగా శిశువుల కణాల్లోని శక్తి కేంద్రాలైన మైటోకాండ్రియాను దెబ్బతీస్తుంది. దీంతో పాలు తాగిన 30 నిమిషాలకు వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి వంటి లక్షణాలతో చిన్నారులు ఇబ్బందిపడతారు. ఎరువులు, పారిశ్రామిక వ్యర్థాల వల్ల నేల, నీరు కలుషితమై.. పశువుల ద్వారా పాలల్లోకి ఆర్సెనిక్, కాడ్మియం, సీసం వంటి భారలోహాలు చేరుతున్నాయి. ప్యాకేజింగ్ సమయంలో కలిసే ‘ఫరెవర్ కెమికల్స్’ కూడా శిశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఫార్ములా పాలు వాడేవారు గడువు తేదీతోపాటు ప్యాకేజింగ్ నాణ్యతనూ తనిఖీ చేయాలి. కలిపిన పాలను ఎక్కువసేపు నిల్వ ఉంచకుండా వెంటనే వాడాలి. బిడ్డలో ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి’ అని సూచిస్తున్నారు. శిశువు మెదడు 85-90% మొదటి రెండేళ్లలోనే అభివృద్ధి చెందుతుంది. ఈ కీలక సమయంలో కలుషితమైన కృత్రిమ పాలను ఇవ్వడం కంటే, అత్యంత సురక్షితమైన తల్లిపాలను ఇవ్వడం ఎంతో అవసరం. ప్రకృతి సిద్ధమైన తల్లిపాలు బిడ్డను రసాయనాలు, బ్యాక్టీరియా నుంచి రక్షిస్తాయి. శిశువు ఎదుగుదలకు ఎంతగానో తోడ్పాటునందిస్తాయి.