Mushrooms For Beauty | గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు పుట్టగొడుగులు ఈ సీజన్లో ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే పుట్టగొడుగులను ఇప్పుడు చాలా మంది పండిస్తున్నారు. కనుక మనకు ఇవి ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. పుట్టగొడుగులు ఫంగస్ జాతికి చెందినవి. వీటిని శాకాహారంగా చెప్పవచ్చు. పుట్టగొడుగులతో చేసే ఏ వంటకం అయినా సరే ఎంతో రుచిగా ఉంటుంది. అందుకనే రెస్టారెంట్లలో చాలా మంది వెజిటేరియన్లు పుట్టగొడుగులను తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల పలు అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
పుట్టగొడుగుల్లో బీటా గ్లూకన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి సాల్యుబుల్ ఫైబర్ జాతికి చెందినవి. హానికర బాక్టీరియాను ఇవి నిర్మూలిస్తాయి. దీంతో చర్మ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. అలాగే మొటిమలు, మచ్చల నుంచి విముక్తి లభిస్తుంది. కనుక పుట్టగొడుగులను తరచూ తింటుండాలి. వీటిలో ఎర్గోథియోనెయిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒక అమైనో ఆమ్లం. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది డీఎన్ఏకు మరమ్మత్తులు చేస్తుంది. సూర్యకాంతి వల్ల డ్యామేజ్ అయిన కణాలను తిరిగి పునరుద్ధరిస్తుంది. సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వయోలెట్ కిరణాల నుంచి, కాలుష్య కారకాల నుంచి రక్షణను అందిస్తుంది. దీని వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది.
పలు రకాల పుట్టగొడుగుల్లో పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల జాబితాకు చెందుతాయి. వీటిల్లో పాలిశాకరైడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. తేమగా ఉండేలా చూస్తాయి. పుట్టగొడుగులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. దీంతో కణాల నిర్మాణం సరిగ్గా ఉంటుంది. అలాగే వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. దీంతో వయస్సు మీద పడుతున్నప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు.
పుట్టగొడుగులలో మెలనిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని హానికర కిరణాల నుంచి రక్షిస్తుంది. వీటిలో కోజిక్ యాసిడ్ ఉంటుంది. ఇది సహజసిద్ధమైన సమ్మేళనం. ఇది చర్మానికి కాంతినిస్తుంది. డార్క్ స్పాట్స్‌ను తొలగిస్తుంది. దీంతో స్కిన్ టోన్ మెరుగు పడుతుంది.
పుట్టగొడుగులు అన్నీ కూడా తినేవి కావు, వీటిల్లో తినే పుట్టగొడుగులు వేరే ఉంటాయి. అయితే మార్కెట్లో మాత్రం తినే పుట్టగొడుగులనే విక్రయిస్తుంటారు. ఇక ప్రపంచవ్యాప్తంగా చాలా పుట్టగొడుగు వెరైటీలు ఉన్నప్పటికీ మనం తినే పుట్టగొడుగులు మాత్రం 13 రకాలు మాత్రమే ఉన్నాయి. ఇవి చర్మాన్ని సంరక్షించడంతోపాటు అందాన్ని కూడా ఇస్తాయి. అందువల్ల పుట్టగొడుగులను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి.