Moringa Leaves Powder Benefits | మునగ కాయలతో చాలా మంది అనేక రకాల వంటలను చేస్తుంటారు. మునగకాయల కూర, టమాటా కూర, పచ్చడి ఇలా అనేక వంటలను చేసి తింటుంటారు. అలాగే సాంబార్లోనూ వీటిని వేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే వాస్తవానికి మునక్కాయల కన్నా మునగాకుల్లో అధికంగా పోషకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. మునగ ఆకులను కూడా మనం కూర రూపంలో వండి తినవచ్చు. పచ్చడి లేదా పప్పులోనూ పెట్టుకోవచ్చు. అయితే మునగాకును ఇలా తినడం ఇష్టం లేకపోతే దాన్ని ఎండబెట్టి పొడి చేసి కూడా తినవచ్చు. మునగాకు పొడిని రోజూ ఒక టీస్పూన్ మోతాదులో తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.
మునగ ఆకు పొడిని వాడడం వల్ల చర్మంపై ముడతలు తగ్గిపోతాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. మునగాకుల పొడిలో కాస్త రోజ్ వాటర్ కలిపి నల్లని మచ్చలు, మొటిమలు ఉన్న చోట రాస్తుండాలి. ఆరిన తరువాత కడిగేయాలి. ఇలా చేస్తుంటే ఆయా సమస్యలు తగ్గుతాయి. మొటిమలు, మచ్చల నుంచి విముక్తి పొందవచ్చు. అర టీస్పూన్ మునగాకు పొడి, టేబుల్ స్పూన్ తేనె, రోజ్ వాటర్ సగం టేబుల్ స్పూన్, తగినన్ని నీళ్లు కలిపి మిశ్రమం తయారు చేయాలి. దీన్ని ముఖానికి రాసి 10 నిమిషాలు అయ్యాక గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. తరువాత శుభ్రమైన టవల్లో తుడిచి కొద్దిగా మాయిశ్చరైజర్ రాయాలి. దీంతో చర్మానికి మృదుత్వం లభిస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
మునగాకుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. అందువల్ల ఈ పొడిని రోజూ తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి బయట పడవచ్చు. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది. మునగాకుల్లో మెగ్నిషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల రక్తం తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
మునగాకుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. దీంతో గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మునగాకు పొడిని తినడం వల్ల రక్తంలోని చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిపోతాయి. బీపీ అదుపులోకి వస్తుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది.
చిన్నారులకు సైతం మునగాకు పొడిని ఇవ్వవచ్చు. మునగాకు పొడిని తినడం కూడా కష్టంగా ఉంటే దాన్ని ఏదైనా ఇతర పదార్థంతో కలిపి తినవచ్చు. లేదా రోజూ అన్నంలో మొదటి ముద్దలో తినవచ్చు. చిన్నారులకు పావు టీస్పూన్ మోతాదులో ఈ పొడిని ఇవ్వవచ్చు. అయితే ఈ పొడి అందరికీ పడకపోవచ్చు. అలర్జీలు రావడం, విరేచనాలు అవడం వంటి సమస్యలు తలెత్తితే మాత్రం వెంటనే ఈ పొడిని తినడం మానేయాలి. ఇలా మునగాకు పొడితో అద్భుతమైన లాభాలను పొందవచ్చు.