Jamun Fruit | వేసవి కాలంలో మనకు అనేక రకాల సీజనల్ పండ్లు లభిస్తుంటాయి. వాటిల్లో నేరేడు పండ్లు కూడా ఒకటి. వేసవి కాలం ముగింపు దశకు వచ్చే సరికి ఈ పండ్లు మనకు చాలా ఎక్కువగా లభిస్తాయి. అయితే ఈ పండ్లను తినేందుకు అసలైన సీజన్ ఇదే. నేరేడు పండ్లను తినడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండ్లలో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. నేరేడు పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు. ఆయుర్వేదంలో పలు ఔషధాల తయారీలో నేరేడు పండ్లు, వాటి విత్తనాలను ఉపయోగిస్తారు. అనేక వ్యాధులను నయం చేసేందుకు ఇవి ఎంతగానో దోహదం చేస్తాయి. నేరేడు పండ్లను తింటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
నేరేడు పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తింటుండాలి. లేదా ఈ పండ్లకు చెందిన విత్తనాలను పొడిగా చేసి దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో నీటిలో కలిపి రోజూ ఉదయం, సాయంత్రం భోజానికి 30 నిమిషాల ముందు తాగుతుండాలి. ఇలా చేస్తున్నా కూడా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. నేరేడు పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. నేరేడు పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరిగి శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది.
నేరేడు పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ నియంత్రణలో ఉంటుంది. బీపీ ఉన్నవారు ఈ పండ్లను రోజూ తింటుంటే ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు. నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో పాలిఫినాల్స్ ఇంకా ఆంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులు తగ్గుతాయి. క్యాన్సర్, గుండె జబ్బుల వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
నేరేడు పండ్లలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండ్లు మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ పండ్లను తింటే ఎక్కువ సేపు ఉన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. అంత సులభంగా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఈ పండ్లను తింటే శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దగ్గు, జలుబు ఉన్నవారు నేరేడు పండ్లను తింటే త్వరగా ఈ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే జీర్ణాశయం, పేగుల్లో అల్సర్లు ఉన్నవారు ఈ పండ్లను తింటుంటే పుండ్లు త్వరగా మానిపోతాయి. విరేచనాల సమస్య ఉన్నవారు నేరేడు పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు. శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందుతుంది. ఇలా ఈ పండ్లతో మనం అనేక లాభాలను పొందవచ్చు.