Lungs Cleaning Foods | ప్రస్తుతం మనం కాలుష్యభరితమైన వాతావరణంలో నివసిస్తున్నాం. ఒకప్పుడు కేవలం నగరాలకు మాత్రమే పరిమితం అయిన కాలుష్యం ఇప్పుడు గ్రామాలకు కూడా వ్యాపించింది. దీంతో ఎక్కడ చూసినా స్వచ్ఛమైన గాలిని పీల్చలేకపోతున్నాం. గాలిలో ఉండే అనేక కాలుష్య కారకాలు మన ఊపిరితిత్తుల్లోకి చేరి మనకు రోగాలను కలగజేస్తున్నాయి. మానవుడు చేస్తున్న అనేక తప్పుల వల్లే గాలిలో కాలుష్యం పెరుగుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అలాంటి కాలుష్య పూరితమైన వాతావరణంలో నివసిస్తున్నందున ఊపిరితిత్తులు తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నాయి. చాలా మందికి కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా వస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో భాగంగానే ఆహారంలో పలు మార్పులు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు.
కొన్ని రకాల ఆహారాలను మనం నిత్యం తీసుకుంటే దాంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఊపిరితిత్తులు అనారోగ్యాల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. మనం రోజూ పసుపును అనేక వంటల్లో వాడుతుంటాం. ఊపిరితిత్తులను శుభ్రం చేయడమే కాకుండా వాపులను తగ్గించడంలోనూ పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. పసుపును రోజూ పాలలో కలిపి రాత్రి పూట సేవిస్తుండాలి. లేదా పసుపు వేసి మరిగించిన నీళ్లను కూడా తాగవచ్చు. పసుపులో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి, ఇందులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం కాలుష్యం కారణంగా వ్యర్థాలతో నిండిన ఊపిరితిత్తులను బాగు చేస్తుంది. దీంతో ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. అలాగే బెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, చెర్రీలు, రాస్ప్ బెర్రీలను తరచూ తినాలి. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. దీంతో కణాకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీని వల్ల ఊపిరితిత్తులు శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం పాలకూరలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. దీంతో ఊపిరితిత్తుల్లోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోయి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. వెల్లుల్లిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే కాలుష్యం కారణంగా ఏర్పడిన వ్యర్థాలను ఊపిరితిత్తుల నుంచి తొలగిస్తుంది. దీంతో ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. రోజూ 2 వెల్లుల్లి రెబ్బలను పరగడుపునే తింటుంటే మేలు జరుగుతుంది.
అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా కూడా పనిచేస్తుంది. అందువల్ల రోజూ 2 సార్లు ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు కాస్త అల్లం రసం సేవించాలి. లేదా అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించి కూడా తాగవచ్చు. దీంతో కాలుష్యం వల్ల వాపులకు గురైన ఊపిరితిత్తులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఊపిరితిత్తుల్లోని కాలుష్య కారకాలు బయటకు వెళ్లిపోయి ఆయా భాగాలు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే గ్రీన్ టీని రోజూ తాగుతున్నా కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. గ్రీన్ టీలో పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను శుభ్రం చేస్తాయి. గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా పలు రకాల ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు క్లీన్ అయి ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు.