Lips Beauty | చర్మం, శిరోజాల తరువాత చాలా మంది అందంగా కనిపించాలని కోరుకునే అవయవాల్లో పెదవులు మూడో స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు. మహిళలు ఎక్కువగా పెదవుల అందానికి ప్రాధాన్యతను ఇస్తుంటారు. పెదవులు అందవిహీనంగా కనిపిస్తే ఎవరికీ మనశ్శాంతిగా ఉండదు. పెదవులు పొడిబారడం లేదా నల్లగా మారడం, కాంతిని కోల్పోవడం వంటివి జరుగుతుంటాయి. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే పెదవుల అందానికి ఖరీదైన బ్యూటీ పార్లర్ చికిత్సలు అవసరం లేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే అత్యంత సహజసిద్ధంగా పెదవులను అందంగా మార్చుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెదవులను అందంగా మార్చడంలో చక్కెర, తేనె ఎంతగానో ఉపయోగపడతాయి. రెండింటినీ కలిపి పేస్ట్‌లా చేసి పెదవులపై మసాజ్ చేసినట్లు రాయాలి. దీంతో మృత చర్మ కణాలు పోతాయి. పెదవులు కాంతివంతంగా మారి అందంగా కనిపిస్తాయి. ఈ చిట్కాను వారంలో 2 సార్లు పాటించాలి.
పెదవులను అందంగా మార్చడంలో కొబ్బరినూనె కూడా పనిచేస్తుంది. ఈ నూనెను చాలా మంది శిరోజాల సంరక్షణకు ఉపయోగిస్తుంటారు. కానీ కొబ్బరినూనెను రాయడం వల్ల పెదవులు కూడా అందంగా మారి రక్షించబడతాయి. రాత్రి పూట నిద్రకు ముందు కొద్దిగా కొబ్బరినూనెను పెదవులకు మసాజ్ చేసినట్లు రాయాలి. ఉదయం కడిగేయాలి. ఇలా చేస్తుంటే పెదవులు మృదువుగా మారుతాయి. సహజసిద్ధమైన నిగారింపును పొందుతాయి. పెదవులు పొడిబారడం తగ్గుతుంది. తేనె పెదవులకు తేమను అందిస్తుంది. తేనెను కొద్దిగా తీసుకుని పెదవులకు రాసి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. రోజూ ఇలా చేస్తుంటే పెదవులు అందంగా మారుతాయి. పెదవులపై ఉండే నలుపు దనం పోతుంది. మృత చర్మ కణాలు తొలగిపోయి పెదవులు కాంతివంతంగా కనిపిస్తాయి.
పెదవులపై బీట్రూట్ జ్యూస్‌ను అప్లై చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. కొద్దిగా బీట్ రూట్ జ్యూస్‌లో ముల్లంగి రసం కలిపి పెదవులపై రాసి 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. రోజూ ఇలా చేస్తుంటే మీ పెదవులపై ఉండే నలుపుదనం తగ్గిపోతుంది. మీ పెదవులు సహజసిద్ధంగా పింక్ రంగులోకి మారుతాయి. కలబంద గుజ్జును కొద్దిగా తీసుకుని పెదవులపై రాసి 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. కలబందలో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు పెదవుల వాపులను తగ్గించి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. దీంతో పెదవులు సహజసిద్ధమైన నిగారింపును పొందుతాయి. రాత్రి పూట పెదవులపై కాస్త నెయ్యిని రాసి ఉదయం కడిగేస్తున్నా కూడా ఫలితం ఉంటుంది. అయితే నెయ్యిని ఉపయోగించే ముందు కాస్త వేడి చేస్తే మంచిది.
రాత్రంతా గులాబీ పువ్వుల రెక్కలను పాలలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్‌లా చేయాలి. దాన్ని పెదవులపై రాయాలి. 15 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే పెదవులు పింక్ రంగులోకి సహజసిద్ధంగా మారిపోతాయి. రాత్రి పూట నిద్రకు ముందు పెదవులపై బాదంనూనెను రాస్తున్నా ప్రయోజనం ఉంటుంది. పెదవులు సురక్షితంగా ఉంటాయి. ఈ విధంగా పలు చిట్కాలను పాటించడం వల్ల పెదవులపై ఉండే మృత చర్మ కణాలను తొలగించడంతోపాటు పెదవులను సహజసిద్ధంగా అందంగా మారేలా చేయవచ్చు. పెదవులపై ఉండే నలుపుదనం పోయి పింక్ రంగులోకి మారుతాయి. అయితే పెదవులు ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని పోషకాలు ఉండే ఆహారాలను తీసుకోవడంతోపాటు రోజూ తగిన మోతాదులో నీళ్లను కూడా తాగుతుండాలి. దీంతో పెదవులు సురక్షితంగా ఉంటాయి.