మన జీవితంలో కాంతి విడదీయలేని భాగం. వస్తువులను చూడటానికి ఉపయోగపడే కాంతి ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది. ఇక కాంతి సహజమైనా, కృత్రిమమైనా అది మన శారీరక, మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే, ఆధునిక జీవితాల్లో సహజ కాంతి కంటే కృత్రిమ కాంతి ఆధిపత్యం చెలాయిస్తున్నది. ఫలితంగా నడివయసులోనే ఎందరో రకరకాల సమస్యలను ఎదుర్కొంటు న్నారు. ఆరోగ్యం విషయంలో కాంతి ప్రభావాన్ని అర్థం చేసుకుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికినట్టే!
మన రోజువారీ జీవితాన్ని క్రమబద్ధీకరించడంలో సహజ కాంతిది కీలకపాత్ర. నిద్రించడం, మేల్కొనడం, హార్మోన్ల విడుదల, ఇతర శారీరక విధులను సూర్యకాంతి ప్రభావితం చేస్తుంది. పగటి వేళ సహజ కాంతిలో గడపడం వల్ల రోజువారీ జీవితం ఆరోగ్యకరంగా సాగిపోతుంది. శరీరం మీద తగినంత సూర్యకాంతి పడకపోతే విటమిన్ డి లోపం తలెత్తుతుంది. దీంతో ఆస్టియోపొరోసిస్, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా స్పందించడం, కుంగుబాటు లాంటి సమస్యలు చుట్టుముడతాయి.
సూర్యకాంతి మన శరీరంలో మూడ్ను క్రమబద్ధీకరించి, ఆనందాన్ని అనుభూతి చెందించే సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందుకే సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్ (ఎస్ఏడీ), ఇతర కుంగుబాటు రూపాల చికిత్సలో భాగంగా సహజకాంతిలో గడపాలని డాక్టర్లు సూచిస్తారు. అంతేకాదు సహజకాంతి పిల్లలు, యువతలో హ్రస్వదృష్టి (మయోపియా) ముప్పునుతగ్గిస్తుంది. పైగా సహజకాంతిలో గడిపితే మయోపియా మరింత ముదరకుండా అడ్డుకట్టపడుతుంది.
కృత్రిమ కాంతి
ఆధునిక జీవితాల్లో ఎంతగా అవసరమైనప్పటికీ సుదీర్ఘకాలంపాటు కృత్రిమమైన కాంతిలో గడిపితే ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది. డిజిటల్ తెరల నుంచి వచ్చే బ్లూలైట్, ఎల్ఈడీ బల్బులు, ఇతర బల్బులు కృత్రిమ కాంతి వనరులు. ఇవి మన జీవ గడియార క్రమాన్ని దెబ్బతీస్తాయి. ఇది నిద్రకు కారణమైన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని అణచిపెడుతుంది. దీంతో నిద్ర పట్టకపోవడం, నాణ్యత తగ్గిపోవడం, నిద్రకు సంబంధించిన ఇతర రుగ్మతలు తలెత్తుతాయి. ఎక్కువసేపు కృత్రిమకాంతిలో గడిపితే కండ్ల మీద ఒత్తిడి పడుతుంది. కండ్లలో ఇబ్బందులు వస్తాయి. పొడిబారుతాయి. దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోంగా వ్యవహరిస్తారు. రాత్రివేళల్లో కృత్రిమ కాంతిలో ఎక్కువసేపు గడిపితే దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఊబకాయం, గుండె రక్తనాళాల రుగ్మతలు, కొన్ని రకాలైన క్యాన్సర్ల ముప్పు పెరుగుదలకు కృత్రిమ కాంతికి సంబంధం ఉందని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి. జీవ గడియార క్రమం, నిద్రా చక్రం దెబ్బతినడం వల్ల ఈ ప్రమాదాలు తలెత్తుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. సహజకాంతి పడకపోవడం, ఎక్కువసేపు కృత్రిమకాంతిలో ఉండటం మానసిక ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. భావోద్వేగాల్లో ఇబ్బందులు, ఒత్తిడి స్థాయులు పెరగడం, కుంగుబాటు, ఆందోళనకు కూడా
అవకాశం ఉంది.