Lemon Grass | నిమ్మకాయల గురించి అందరికీ తెలిసిందే. నిమ్మకాయల నుంచి వచ్చే రసాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. దీన్ని వంటల్లో వేస్తారు. లేదా ఏవైనా పానీయాల్లో కలిపి తాగుతారు. కొందరు నేరుగా నోట్లో నిమ్మరసం పిండి మరీ తాగుతారు. అయితే నిమ్మగడ్డి అనే మాట కూడా మనకు ఎక్కువగా వినిపిస్తుంది. చాలా మంది దీని గురించి వినే ఉంటారు. ఇది ఉల్లికాడల మాదిరిగా ఉంటుంది. కానీ నిమ్మకాయల వాసన వస్తుంది. కనుకనే నిమ్మగడ్డి అని పేరు పెట్టారు. అయితే నిమ్మ గుణాలు నిమ్మగడ్డిలో ఉంటాయి కానీ ఈ రెండింటికీ అసలు సంబంధం లేదు. కానీ నిమ్మ లాగే నిమ్మ గడ్డి కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజాలను అందిస్తుంది. దీన్ని మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం పండిస్తున్నారు. నిమ్మగడ్డిని అనేక ఔషధాలతోపాటు సౌందర్య సాధన ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. నిమ్మగడ్డిని ఉపయోగించి మనం అనేక లాభాలు పొందవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
నిమ్మగడ్డి ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగాలి. ఆ నీళ్లను రోజుకు ఒక కప్పు మోతాదులో ఉదయం లేదా సాయంత్రం సేవిస్తే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మగడ్డి టీని పలు సంప్రదాయ వైద్య విధానాల్లోనూ ఔషధంగా ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి టీని సేవించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. నిమ్మగడ్డిలో కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. కనుక నిమ్మ గడ్డి టీని సేవిస్తుంటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. గ్యాస్, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. జీర్ణ వ్యవస్థలో ఉండే అసౌకర్యం తొలగిపోతుంది. నిమ్మగడ్డిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగించడంలో సహాయం చేస్తాయి. దీని వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి తీవ్రమైన వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
నిమ్మగడ్డిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. కనుక ఈ టీని సేవిస్తుంటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి బయట పడవచ్చు. నిమ్మగడ్డిలో అధికంగా ఉండే పొటాషియం కారణంగా బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి నిమ్మగడ్డి టీ ఎంతో మేలు చేస్తుంది. ఈ టీలో డై యురెటిక్ గుణాలు కూడా ఉంటాయి. దీని వల్ల శరీరంలో అధికంగా ఉండే ద్రవాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో కిడ్నీలపై పడే భారం తగ్గుతుంది. పాదాలు, చేతుల్లో ఉండే వాపులు తగ్గిపోతాయి. నిమ్మగడ్డిలో యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి కనుక దీని టీ ని సేవిస్తుంటే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది. దీంతో ఇన్ ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.
నిమ్మగడ్డి టీని సేవిస్తుంటే అనేక అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. దీన్ని తాగితే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. గొంతు ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి, మంట తగ్గుతాయి. ముక్కు దిబ్బడ నుంచి బయట పడవచ్చు. నిమ్మగడ్డి సహజసిద్ధమైన డిటాక్సిఫయర్‌గా పనిచేస్తుంది. దీని టీని తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ముఖ్యంగా లివర్, కిడ్నీల్లో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్లి ఆయా భాగాలు ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటాయి. నిమ్మగడ్డి ఆకుల పేస్ట్‌ను ముఖానికి ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగించవచ్చు. దీంతో ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ఇలా నిమ్మగడ్డితో అనేక లాభాలను పొందవచ్చు. కనుక మార్కెట్లో ఇది కనిపిస్తే విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకుని ఉపయోగించండి.