డయాబెటిస్ ఉన్నవాళ్లు ఏం తినాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. పిండిపదార్థం తక్కువ ఉండే ఆహారం తినేందుకు ప్రాధాన్యం ఇస్తారు. అయితే ఈ రైస్ కుక్కర్ ఉంటే పిండిపదార్థం ఎక్కువ తింటున్నామనే సమస్యే ఉండదు. అవును.. డయాబెటీస్ వాళ్లకోసం ప్రత్యేకంగా ఐదుగురు కాశ్మీర్ యూనివర్సిటీ విద్యార్థులు స్టార్చ్ రైస్ కుక్కర్‌ని తయారుచేశారు. తాము తయారుచేసిన ఈ కుక్కర్‌కు ఆదివారం పేటెంట్ హక్కులు కూడా తీసుకున్నారు.
కాశ్మీర్ యూనివర్సిటీలో చదువుతున్న సాజిద్ నూర్, జహంగీర్ హమిద్ లోనె, ఇమ్రాన్ నజీర్, అజుర్ హుస్సేన్ అనే నలుగురు విద్యార్థులు, బిలాల్ అహ్మద్ మాలిక్ అనే రీసెర్చ్ టీచర్ ఈ కుక్కర్‌ని డిజైన్ చేశారు. డయాబెటిస్తో బాధపడేవాళ్ల కోసం వీళ్లు ఈ కొత్తరకం కుక్కర్‌ని ఈ ఏడాది జనవరిలో తయారుచేశారు. వీళ్ల ఆవిష్కరణని మెచ్చుకున్న జమ్యూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా వీళ్లకు ఈమధ్యే అవార్డు అందజేశారు.
ఒక్క మెసేజ్‌తో అన్నం వండుతుంది
ఈ స్టార్చ్ రైస్ కుక్కర్ ప్రత్యేకత ఏంటంటే… ఇది మెసేజ్ సంకేతం ద్వారా అన్నం వండుతుంది. ఉడుకుతున్న సమయంలో పిండిపదార్థం ఎంత ఉంది? అనేది కూడా ఎప్పటికప్పుడు మెసేజ్ ద్వారా చెప్తుంది. ‘ఈ రైస్ కుక్కర్లో నీళ్లు, బియ్యం కోసం రెండు వేర్వేరు గదులు ఉంటాయి. ఫోన్ నుంచి మెసేజ్ పంపించగానే కుక్కర్ ఆటోమెటిక్‌గా సరిపడా నీళ్లు, బియ్యం తీసుకుంటుంది. అంతేకాదు అన్నం వండడం పూర్తి అయిన వెంటనే యూజర్లకు మెసేజ్ పంపిస్తుంది. ఈ కుక్కర్ గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో కాకుండా మంబీ అనే సాఫ్ట్వేర్ సాయంతో పనిచేస్తుంది’ అని ఈ కుక్కర్ తయారుచేసినవారిలో ఒకరైన సాజిద్ చెప్పాడు.