Kalonji Seeds Benefits | కాలోంజి విత్తనాలు.. వీటినే బ్లాక్ సీడ్స్ అంటారు. ఇవి మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో అనేక విటమిన్లు, ఫైబర్, అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. కాలోంజి విత్తనాలు పలు వ్యాధులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే కాలోంజి విత్తనాలను నేరుగా తినలేరు. కనుక వీటితో కషాయం తయారు చేసి తాగవచ్చు. ఈ విత్తనాలను నీళ్లలో మరిగించి తాగడం వల్ల అనేక లాభాలు పొందవచ్చు. కాలోంజి విత్తనాల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ పారాసైటిక్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ సమస్యల నుంచి బయట పడేలా చేస్తాయి.
అధ్యయనాలు చెబుతున్న ప్రకారం కాలోంజి విత్తనాలతో తయారు చేసే నీళ్లను తాగడం వల్ల సోరియాసిస్, మొటిమలు వంటి చర్మ సమస్యల నుంచి బయట పడవచ్చని తేలింది. కాలోంజి విత్తనాల వల్ల ముఖంపై ఉండే ముడతలు పోతాయి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. మీరు అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తుంటే అందుకు కాలోంజి విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయని చెప్పవచ్చు. ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల పొట్ట దగ్గరి కొవ్వు కరిగిపోతుంది. రోజుకు ఒక కప్పు కాలోంజి విత్తనాల నీళ్లను తాగితే కొవ్వు త్వరగా కరుగుతుందని సైంటిస్టుల పరిశోధనలు చెబుతున్నాయి. అయితే కొవ్వును కరిగించుకోవాలంటే ఈ నీళ్లను రాత్రి నిద్రకు ముందు తాగితే మంచిదని చెబుతున్నారు.
కాలోంజి నీళ్లను తాగితే కొవ్వు కరగడంతోపాటు అధిక బరువు తగ్గుతారు. అలాగే థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కాలోంజి విత్తనాలతో నీళ్లను తయారు చేసి రోజూ తాగుతుంటే థైరాయిడ్ అదుపులో ఉంటుంది. ఈ విత్తనాల నీళ్లను తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) కరిగిపోతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. దీంతో రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే లివర్ శుభ్రంగా మారుతుంది. లివర్‌లోని కొవ్వు సైతం కరిగిపోతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయట పడవచ్చు.
కాలోంజి నీళ్లను తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఫార్మాసూటికల్ రీసెర్చిలో చెప్పారు. అందువల్ల ఈ నీళ్లను రోజూ తాగుతుంటే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్న వారికి ఈ నీళ్లు గొప్ప వరమనే చెప్పవచ్చు. ఇవి షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంతోపాటు చక్కెర తినాలనే కోరికను తగ్గిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఈ నీళ్లను తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగు పడుతుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇలా కాలోంజి విత్తనాల నీళ్లు మనకు ఎంతో మేలు చేస్తాయి.