మనం వాడే అన్ని టూత్‌పేస్టులూ సురక్షితమే అనుకుంటాం. కానీ ఈ విషయంలో కొంచెం ఆలోచించాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అన్ని టూత్పేస్టుల్లోనూ సోడియం లారైల్ సల్ఫేట్ (ఎస్ఎల్ఎస్) అనే ఒకే రకమైన ఉమ్మడి పదార్థం ఉంటుంది. ఇది మనకు మంచి కంటే చెడు ఎక్కువగా చేస్తుందట. కాబట్టి ఎస్ఎల్ఎస్ ఉండే టూత్‌పేస్టులను అస్సలే వాడకూడదని సూచిస్తున్నారు. లేబుల్ సరిగ్గా చూసి మరీ టూత్‌పేస్ట్ కొనాలని అంటున్నారు.
సోడియం లారైల్ సల్ఫేట్ అనేది మురికిని వదలగొట్టే డిటర్జెంట్, సర్ఫెక్టెంట్. దీన్ని ఎన్నో రకాలైన వ్యక్తిగత రక్షణ, పారిశుద్ధ్య ఉత్పత్తుల్లో వాడతారు. ఎంతటి మురికినైనా శుద్ధి చేయడం, బాగా నురగనిచ్చే గుణాలకు ఎస్ఎల్ఎస్ ప్రసిద్ధిచెందింది. అందుకే శుభ్రతకు సంబంధించిన వస్తువుల్లో దీన్ని ఎక్కువగా వాడతారు. పైగా దంతాలు, చిగుళ్ల మీద ఉన్న పాచి, ఇతర చెత్తను కూడా ఇది శుభ్రం చేసేస్తుంది. కానీ, కొంతమందిలో మాత్రం ఇది నోట్లో చర్మం మంటకు దారితీస్తుంది. కురుపులు, పుండ్లు, నోరు పొడిబారడానికి కారణం కూడా కావొచ్చు. నోరు పొడిబారిపోతే సెన్సిటివిటీ, అసౌకర్యం మరింత పెరుగుతాయి.
కొన్ని అరుదైన సందర్భాల్లో నోటి లోపల వాపు, దురద లాంటి అలర్జీ లక్షణాలు కూడా కనిపించవచ్చు. కొన్ని పరిశోధనల ప్రకారం సోడియం లారైల్ సల్ఫేట్ క్యాన్సర్ అభివృద్ధికి కారణం కూడా కావచ్చు. కాకపోతే దీనికి తగినన్ని శాస్త్రీయమైన ఆధారాలైతే అందుబాటులో లేవు. కొంతమంది నిపుణులు మాత్రం ఓరల్ కేర్ (నోటికి సంబంధించిన) ఉత్పత్తుల్లో సోడియం లారైల్ సల్ఫేట్ స్థాయులు భద్రతా ప్రమాణాల పరిమితిలోనే ఉంటాయి. కాబట్టి క్యాన్సర్ ముప్పు ఏమీ ఉండకపోవచ్చని అంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఈసారి మార్కెట్‌కు వెళ్లినప్పుడు టూత్‌పేస్ట్ డబ్బా మీద లేబుల్ తప్పకుండా గమనించండి. సోడియం లారైల్ సల్ఫేట్ (ఎస్ఎల్ఎస్) ఫ్రీ అని ఉన్న పేస్టును ఎంచుకోండి. ఇక నోట్లో సెన్సిటివిటీ, మంటగా అనిపిస్తుంటే దంత వైద్యుణ్ని సంప్రదించాలి. మీ అవసరాలకు తగిన టూత్‌పేస్టును వాళ్లు సూచిస్తారు. నోటి ఆరోగ్యం కోసం సున్నితమైన బ్రష్ ఉపయోగించాలి. ఫ్లాసింగ్ చేసుకోవాలి.