పేగుతో ముడిపడిన సమస్యలను నిర్లక్ష్యం చేయలేం. ప్రారంభంలో చిన్నగానే కనిపించినా, తట్టుకోగలమని అనిపించినా మలిదశకు చేరుకునేసరికి ఇబ్బందికరంగా మారుతాయి. ప్రాణాంతకమూ అవుతాయి. అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ప్రభావవంతమైన చికిత్సలు, జీవనశైలి దిద్దుబాట్లు.. ఈ మూడూ తోడైతే పేగు రుగ్మతలను అరికట్టవచ్చు.
గుండె, మూత్రపిండాలు, కాలేయం తదితర ప్రధాన అవయవాల గురించి, వాటికి దాపురించే వ్యాధుల గురించి ప్రజలకు ఎంతోకొంత అవగాహన ఉంది. కానీ, పొట్టలో కీలక పాత్ర పోషిస్తూ, ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు శరీరంలోని అవయవాలకు శక్తిని అందించే పేగుల విషయంలో మాత్రం కనీస పరిజ్ఞానం కరువవుతున్నది. ఫలితంగా పేగులకు సంబంధించిన వ్యాధులు (ఇన్ఫ్లమెటరీ బోవెల్ డిసీ జ్స్-ఐబీడీ) పెరిగిపోతున్నాయి.
ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరికలు జారీ చేసింది. ఒకప్పుడు యూరప్ దేశాల్లో అధికంగా కనిపించిన పేగు వ్యాధులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేట్రేగిపోతున్నాయి. బాధితుల సంఖ్య ఏటా ఆరు నుంచి ఏడు శాతం పెరుగుతున్నదని, మనదేశంలో పంజాబ్ అగ్రస్థానంలో ఉన్నదనీ గణాంకాలు చెబుతున్నాయి. ఈ రుగ్మత గ్రామాలతో పోలిస్తే.. నగరాల్లోనే ఎక్కువ. సకాలంలో గుర్తించి, సరైన చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. మోటరైజ్డ్ ఎంటరోస్కోపీ తదితర పద్ధతులు పేగు వ్యాధుల నిర్ధారణలో వరంగా మారాయి.
పేగుల్లో రకాలు
పేగుల్లో.. చిన్నపేగు, పెద్దపేగు అని రెండు రకాలు. చిన్న పేగును మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటి భాగాన్ని డియోడినమ్, మధ్య భాగాన్ని జెజునమ్, చివరి భాగాన్ని ఐలియంగా వ్యవహరిస్తారు. వీటిలో సమస్య ఎక్కడి నుంచి అయినా ప్రారంభం కావచ్చు. పెద్దపేగు వ్యాధులతో పోలిస్తే చిన్నపేగు రుగ్మతలను గుర్తించడం క్లిష్టమైన పని. సాధారణంగా పెద్దపేగుతో ముడిపడిన వ్యాధులను కొలనోస్కోపీ, సీటీ స్కాన్ తదితర పద్ధతులతో నిర్ధారించవచ్చు.
అదే చిన్నపేగుకు సంబంధించిన సమస్యలను గుర్తించాలంటే ఎంటరోస్కోపీ చేయాల్సిందే. రక్తస్రావం, ఉదర కుహర వ్యాధి, క్రోన్ ఎస్ వ్యాధి, గ్యాంగ్రిన్, క్యాన్సర్, పెప్టిక్ అల్సర్లు చిన్నపేగును ఇబ్బందిపెడతాయి. ధూమపానం, మద్యపానం, గాఢమైన వేపుళ్లు, కాల్చిన ఆహారం, ఉప్పు, కొవ్వు అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం, ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడటం, ఫైబర్ కొరత పేగు సమస్యలకు ప్రధాన కారణాలు. ఊబకాయం కూడా ప్రధాన శత్రువే. ఈమధ్యకాలంలో, పేగు క్యాన్సర్ కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయి.
దీర్ఘకాలం పాటు మలంలో రక్తం పడినా, రోజుల తరబడి మలబద్ధకం, విరేచనాలు వేధించినా, పొట్ట కిందిభాగంలో నొప్పిగా అనిపించినా, పొట్ట నిండుగా, ఉబ్బరంగా ఉన్నా .. ఆ లక్షణాల్ని విస్మరించలేం. హఠాత్తుగా బరువు కోల్పోవడమూ పేగు క్యాన్సర్ లక్షణమే కావచ్చు. మల విసర్జన తర్వాత కూడా పొట్ట బరువుగా ఉన్న భావన కలగడమూ ఓ ప్రమాద సంకేతమే. కొన్నిసార్లు తీవ్రమైన అలసటను సైతం సాధారణ బలహీనతగా భావించలేం. వైద్యానికి భయపడి పైల్స్ లాంటి సమస్యలను బలవంతంగా భరిస్తుంటారు కొందరు. ఇదీ మంచి పద్ధతి కాదు. దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీయవచ్చు.
Patients
వ్యాధుల నిర్ధారణ
పెద్దపేగు సుమారు ఐదు అడుగుల పొడవు ఉంటుంది. పెద్దపేగు వ్యాధులను కొలనోస్కోపీ, సీటీస్కాన్ తదితర పద్ధతుల ద్వారా తెలుసుకోగలుగుతాం కానీ, చిన్నపేగు 20 అడుగుల పొడవు ఉండటంతో వ్యాధుల నిర్ధారణ అంత సులభం కాదు. ముఖ్యంగా చిన్నపేగులో రక్తస్రావం, అల్సర్లు, బ్లాకేజ్‌లు మొదలైన వాటిని గుర్తించేందుకు ఎంటరోస్కోపీ ఉపయోగపడుతుంది. ఇవి రెండు రకాలు.
1.పుష్ ఎంటరోస్కోపీ లేదా మోటరైజ్డ్ ఎంటరోస్కోపీ.
2. క్యాప్సూల్ ఎంటరోస్కోపీ.
పుష్ ఎంటరోస్కోపీ పరికరం చిన్నపేగును నిశితంగా పరీక్షించేందుకు వీలుగా చాలా మృదువుగా ఉంటుంది. వేగవంతంగా, సున్నితంగా పేగు లోపలికి వెళ్లి, తక్కువ సమయంలో సమస్యను నిర్ధారించగలదు. దీని ద్వారా మొత్తం పేగు వ్యవస్థను స్పష్టంగా చూడవచ్చు. పేగు లోపల ఏర్పడిన బ్లాకేజ్‌లను కని పెట్టవచ్చు. రక్తస్రావాన్ని గుర్తించవచ్చు. చిన్నపేగు క్యాన్సర్లను కూడా ఎంటరోస్కోపీ ద్వారా నిర్ధారించవచ్చు. దీని ద్వారా బయాప్సీ కూడా చేయవచ్చు. క్యాప్సూల్ ఎంటరోస్కోపీలో గొట్టం మాత్ర పరిమాణంలోని ఓ కెమెరాను లోపలికి పంపి పేగు పరిస్థితిని బేరీజు వేస్తారు. ఇది వేలాది చిత్రాలను తీసి.. అనుసంధానించిన కంప్యూటర్‌కు పంపుతుంది. వాటి సాయంతో నిపుణులు ఓ అంచనాకు వస్తారు. తక్షణ చికిత్స ప్రారంభిస్తారు.
సకాలంలో గుర్తిస్తేనే..
పేగు వ్యాధులను సకాలంలో గుర్తించి, సరైన చికిత్స అందిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాధి ముదిరేకొద్దీ చికిత్స సంక్లిష్టంగా మారుతుంది. అందులోనూ క్యాన్సర్లు, అల్సర్లు, బ్లీడింగ్ మొదలైనవి తొలిదశలో గుర్తిస్తేనే రోగి త్వరగా కోలుకుంటాడు. మలంలో రక్తం పడటం, తీవ్రమైన కడుపు నొప్పి, అజీర్తి, కడుపు ఉబ్బరం తదితర లక్షణాలను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మేలు. ఆహార నియమాలు, ఆరోగ్యకరమైన జీవన శైలి పేగు సంబంధమైన వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయి.
చిన్నపేగుకు పెద్ద బలం
Inflammatory Bowel Disease
డాక్టర్ బీరప్ప, డైరెక్టర్
నిజామ్స్ ఇన్స్టిట్యూట్
ఆఫ్ మెడికల్ సైన్సెస్,హైదరాబాద్
…?మహేశ్వర్‌రావు బండారి