Teeth Enamel | మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటా. కొందరు తీపి పదార్థాలను ఇష్టపడితే కొందరు కారం అంటే ఇష్టంగా తింటారు. ఇంకా కొందరు పులుపు ఆహారాలను తింటుంటారు. అయితే ఎవరు ఏ రుచి ఉన్నా ఆహారాలను తిన్నా కూడా కచ్చితంగా దంతాలతోనే ఆహారాలను నమిలి తినాలి. అయితే కొన్ని రకాల ఆహారాలను తెలియకుండానే అధికంగా తింటుంటారు. అలాంటివి దంతాలకు హాని చేస్తాయి. పలు రకాల ఆహారాలను అతిగా తింటే దంతాలు డ్యామేజ్ అవుతాయి. దీంతో దంతాలు పుచ్చిపోయి నొప్పి వస్తుంది. దీర్ఘకాలంలో ఇది దంత క్షయంకు దారి తీసి ఇబ్బందులను కలిగిస్తుంది. ఏయే ఆహారాలను తింటే దంతాలకు డ్యామేజ్ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
పాప్ కార్న్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. ముఖ్యంగా సినిమా థియేటర్‌కు వెళితే పాప్ కార్న్‌ను బకెట్ల కొద్దీ లాగించేస్తుంటారు. అయితే పాప్ కార్న్ ఎంత ఆరోగ్యకరం అయినప్పటికీ ఇది మన దంతాలకు మాత్రం చేటు చేస్తుంది. పాప్ కార్న్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. కనుక పాప్ కార్న్‌ను అధికంగా తింటే దంతాలపై ఉండే ఎనామిల్ పొర తొలగిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇకపై మీరు పాప్ కార్న్ తింటే మరీ అతిగా తినకండి. మీ దంతాలు త్వరగా డ్యామేజ్ అవుతాయి. అలాగే కూల్‌డ్రింక్స్‌ను కూడా అతిగా తాగడం మంచిది కాదు. ఇవి కూడా దంతాలకు హానిని కలగజేస్తాయి. కూల్ డ్రింక్స్‌లో స్ట్రాంగ్ యాసిడ్లు ఉంటాయి. ఇవి మన దంతాలకు ఎక్కువగా తగిలితే దంతాలపై ఉండే ఎనామిల్ పోతుంది. దీంతో దంతాలు బలహీనంగా మారుతాయి. కనుక కూల్ డ్రింక్స్‌ను కూడా మరీ అతిగా సేవించకూడదు.
చాలా మంది టీ లేదా కాఫీలను చాలా పెద్ద మొత్తంలో సేవిస్తుంటారు. రోజూ కప్పుల కొద్దీ టీ లేదా కాఫీలను తాగుతారు. అయితే వీటిలో ఉండే పలు సమ్మేళనాలు దంతాలపై ప్రభావం చూపిస్తాయి. అతిగా వీటిని తాగడం వల్ల దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బ తింటుంది. కనుక రోజూ కప్పుల కొద్దీ టీ, కాఫీ తాగుతున్న వారు ఈ విషయంపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. అలాగే గ్రీన్ టీ లేదా వైన్‌ను అధికంగా సేవిస్తున్నా కూడా దంతాలపై ఉండే ఎనామిల్ పొర దెబ్బ తింటుంది. ఈ రెండింటిలో ఉండే సమ్మేళనాలు కూడా దంతాలకు హాని చేస్తాయి. కొందరు ఐస్ ముక్కలను లేదా చికెన్, మటన్లలో ఉండే ఎముకలను నములుతుంటారు. అప్పటికప్పుడు ఏమీ జరగకపోయినా తరచూ ఇలా చేస్తుంటే కచ్చితంగా దంతాలపై పగుళ్లు ఏర్పడుతాయి. దంతాలపై ఉండే పొర పోయి దంతాలు బలహీనంగా మారుతాయి. కనుక ఈ అలవాట్లను మానుకుంటే మంచిది.
కొందరు గట్టిగా ఉండే క్యాండీల వంటి చాక్లెట్లను తరచూ నోట్లో ఉంచుకుని చప్పరిస్తుంటారు. వీటి వల్ల చక్కెర పదార్థాలు దంతాల్లో ఉండిపోతాయి. దీర్ఘకాలంలో ఇవి దంత క్షయంకు దారి తీస్తాయి. దంతాలు పుచ్చి పోయేలా చేస్తాయి. దీంతో దంతాల నొప్పి వస్తుంది. కాబట్టి వీటిని కూడా తినకూడదు. అలాగే చిప్స్, బిస్కెట్లు కూడా దంతాలకు హాని చేస్తాయి. వాటిల్లో ఉండే చక్కెర, పిండి పదార్థాలు, ఇతర సమ్మేళనాలు దంతాలపై నెగెటివ్ ప్రభావాన్ని చూపిస్తాయి. తరచూ వీటిని తినే అలవాటు ఉంటే దాన్ని మానుకోవడం మంచిది. అదేవిధంగా నిమ్మజాతికి చెందిన నిమ్మ, నారింజలతోపాటు పులుపు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను కూడా తక్కువగా తీసుకోవాలి. వీటిల్లో ఉండే విటమిన్ సి, ఇతర యాసిడ్లు దంతాల ఎనామిల్‌పై ప్రభావం చూపిస్తాయి. ఎనామిల్ దెబ్బ తినేలా చేస్తాయి. కాబట్టి ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.