Vitamin D | మన శరీరంలో ఎముకలు ఆరోగ్యంగా ఉండాలన్నా, రోగ నిరోధక శక్తి పెరగాలన్నా అందుకు విటమిన్ డి ఎంతగానో దోహదం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కేవలం ఇవే కాదు, ఇంకా అనేక రకాల జీవక్రియలకు విటమిన్ డి అవసరం అవుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. దీర్ఘకాలిక రోగాలకు మందులను వాడడం, ఎల్లప్పుడూ సూర్య రశ్మి తగలకుండా ఇంట్లోనే ఉండడం లేదా కార్లు, ఆఫీసుల్లో గడపడం, శారీరక శ్రమ చేయకపోవడం, ఒత్తిడి, ఆందోళన వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి విటమిన్ డి లోపం వస్తోంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి పలు వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే విటమిన్ డి లోపం ఉంటే మన శరీరం మనకు పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది. వాటిని గమనించడం ద్వారా విటమిన్ డి లోపం ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు.
విటమిన్ డి లోపం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. ముఖ్యంగా తరచూ దగ్గు, జలుబు బారిన పడుతుంటారు. ఒక పట్టాన ఇవి తగ్గవు. ఎల్లప్పుడూ నీరసంగా, అలసటగా అనిపిస్తుంది. చిన్న పని చేసినా విపరీతంగా అలసిపోయినట్లు ఫీలవుతారు. ఎముకలు బలహీనంగా మారుతాయి. చేతులు, కాళ్లు, వెన్ను భాగాల్లో ఉండే ఎముకలు నొప్పిగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. కొందరు డిప్రెషన్ బారిన పడతారు. గాయాలు, పుండ్లు త్వరగా మానవు. కొందరికి ఎముకలు మరీ బలహీనంగా మారి చిన్న దెబ్బలకే విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే జుట్టు రాలుతుంది. శిరోజాలు అంద విహీనంగా మారుతాయి. కండరాల నొప్పులు ఉంటాయి. ఎవరిలో అయినా ఈ లక్షణాలు అన్నీ కనిపిస్తుంటే వారిలో విటమిన్ డి లోపం ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. వెంటనే డాక్టర్ను కలిసి పరీక్షలు చేయించుకుని అవసరం అయితే చికిత్స తీసుకోవాలి. విటమిన్ డి లోపం ఉన్నవారికి వైద్యులు ట్యాబ్లెట్లను ఇస్తారు. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకుంటే ఈ లోపం నుంచి సులభంగా బయట పడవచ్చు.
విటమిన్ డి రోజువారి అవసరం సాధారణంగా వయస్సును బట్టి మారుతుంది. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఏడాది వయస్సు ఉన్నవారికి రోజుకు 400 ఐయూ వరకు విటమిన్ డి అవసరం అవుతుంది. 1 ఏడాది నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి రోజుకు 600 ఐయూ మోతాదులో విటమిన్ డి కావాలి. 19 ఏళ్లకు పైబడిన వారికి, 70 ఏళ్ల లోపు ఉన్నవారికి రోజుకు 600 ఐయూ, 70 ఏళ్లకు పైబడిన వారికి రోజుకు 800 ఐయూ మోతాదులో విటమిన్ డి కావల్సి ఉంటుంది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు రోజుకు 800 ఐయూ మోతాదులో విటమిన్ డి లభించేలా చూసుకోవాలి. దీని వల్ల విటమిన్ డి లోపం రాకుండా చూసుకోవచ్చు. అయితే విటమిన్ డి లోపం ఉన్నవారికి రోజుకు కావల్సిన మోతాదు కన్నా ఎక్కువగానే తీసుకోవాలని వైద్యులు ట్యాబ్లెట్లను ఇస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది.
విటమిన్ డి మనకు సాధారణంగా సూర్య రశ్మి ద్వారా లభిస్తుంది. రోజు ఉదయం 8 గంటల లోపు సూర్య రశ్మిలో కనీసం 20 నిమిషాల పాటు గడిపితే దాని వల్ల చర్మం కింద భాగంలో విటమిన్ డి దానంతట అదే తయారవుతుంది. ఇది శరీర అవసరాలకు సరిపోతుంది. విటమిన్ డి లోపం ఉన్న వారు పలు ఆహారాలను కూడా తీసుకోవచ్చు. ఇది మనకు ఎక్కువగా పాలు, పెరుగు, చీజ్, కోడిగుడ్లు, చేపలు, రొయ్యలు, పుట్ట గొడుగులు, పచ్చి బఠానీలు, పాలకూర వంటి వాటిల్లో లభిస్తుంది. ఈ ఆహారాలను రోజూ తీసుకుంటే విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. దీంతో విటమిన్ డి లోపం నుంచి సులభంగా బయట పడవచ్చు.