Nasal Congestion | సీజన్లు మారినప్పుడు లేదా వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా సహజంగానే చాలా మందికి తరచూ దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. ముక్కు దిబ్బడ కూడా ఉంటుంది. అయితే కొందరికి తరచూ ఈ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు లేకపోయినప్పటికీ ముక్కు దిబ్బడ తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. వాతావరణం చల్లగా మారినప్పుడు లేదా చల్లని పదార్థాలను తీసుకున్నప్పుడు, చల్లని గాలి పీల్చినా ముక్కు దిబ్బడ వస్తుంది. దీంతో రాత్రి పూట నిద్ర సరిగ్గా పట్టదు. ఈ క్రమంలో చాలా మంది పలు రకాల స్ప్రేలను ఉపయోగిస్తుంటారు. దీని వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. కానీ సమస్య మాత్రం పూర్తిగా తగ్గదు. మళ్లీ అలాంటి పరిస్థితులు ఏర్పడితే తిరిగి ముక్కు దిబ్బడ ఇబ్బందులకు గురి చేస్తుంది. అయితే పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల ఈ సమస్యకు దీర్ఘకాలికంగా చెక్ పెట్టవచ్చు. ఇంగ్లిష్ మెడిసిన్లను వాడాల్సిన పని ఉండదు. ఈ చిట్కాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి.
ముక్కు దిబ్బడ సమస్య ఉన్నవారు తరచూ పెప్పర్మింట్ ఆయిల్‌తో ఆవిరి పడుతుంటే ఎంతగానో ఉపశమనం లభిస్తుంది. బాగా మరుగుతున్న నీటిలో కొద్దిగా పెప్పర్మింట్ ఆయిల్‌ను వేసి అనంతరం వచ్చే ఆవిరిని బాగా పీల్చాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తుండాలి. దీని వల్ల సమస్య శాశ్వతంగా తగ్గే అవకాశాలు ఉంటాయి. శ్వాసకోశ వ్యవస్థ పనితీరు సైతం మెరుగు పడుతుంది. ఊపిరితిత్తులు, గొంతులో ఉండే కఫం కరిగిపోతుంది. దీంతోపాటు దగ్గు, జలుబు నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. సోంపు గింజలతో తయారు చేసిన డికాషన్ ను రోజుకు 2 సార్లు కప్పు మోతాదులో తాగుతున్నా ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే కమోమిల్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ వంటి టీలను తాగుతున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఈ టీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీని వల్ల వాపులు తగ్గిపోతాయి. ముక్కు రంధ్రాల్లో ఉండే రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీంతో ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ముక్కు దిబ్బడ సమస్య ఉన్నవారు చికెన్ సూప్‌ను తాగుతుంటే ఉపశమనం లభిస్తుంది. చికెన్ సూప్ వల్ల కఫం కరిగిపోతుంది. దీంతో శ్వాస నాళాలు క్లియర్‌గా మారుతాయి. గాలి సరిగ్గా లభిస్తుంది. ఊపిరి సరిగ్గా పీల్చుకోగలుగుతారు. అలాగే దగ్గు, జలుబు నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. అయితే శాకాహారులు వెజిటబుల్ సూప్‌ను తాగితే ఉపశమనం పొందవచ్చు. ఇక రోజు వారి ఆహారాల్లో కారంను కాస్త ఎక్కువగా తీసుకోవాలి. కనీసం ఒక పూట కారం ఉండే ఆహారాలను తినాలి. దీని వల్ల కూడా కఫం కరిగిపోతుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే నారింజ పండ్ల రసాన్ని తాగుతున్నా లేదా ఆ పండ్లను రోజూ తింటున్నా కూడా శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. నారింజ పండ్లలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీంతో సమస్య తగ్గుతుంది. అలాగే పైనాపిల్, నిమ్మరసం వంటి వాటిని తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది.
ముక్కు దిబ్బడ సమస్య ఉన్నవారు పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి. ముఖ్యంగా రాత్రి పూట వీటిని తీసుకోకూడదు. పాల ఉత్పత్తుల వల్ల ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో కఫం తయారవుతుంది. ఇది శ్వాస నాళాలకు అడ్డుపడుతుంది. దీంతో ముక్కు దిబ్బడ వస్తుంది. కనుక సమస్య తగ్గే వరకు అయినా కొన్ని రోజుల వరకు ఈ ఆహారాలను తీసుకోవడం మానేస్తే మంచిది. అలాగే ధూమపానం చేయకూడదు. దీని వల్ల సమస్య మరింత ఎక్కువవుతుంది తప్ప తగ్గదు. ధూమపానం వల్ల శ్వాస తీసుకోవడం మరింత ఇబ్బందిగా మారుతుంది. కనుక పొగ తాగడం కూడా మానేయాల్సి ఉంటుంది. అలాగే చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు తలకు, ముక్కుకు క్యాప్‌లు వంటివి ధరించాలి. చల్లని పదార్థాలను తినకూడదు. పానీయాలను తాగకూడదు. ఈ విధమైన చిట్కాలు, సూచనలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి దీర్ఘకాలం పాటు ఉపశమనం లభిస్తుంది.