Liver Diseases Effect On Skin | సాధారణంగా కాలేయ వ్యాధులు చాలా నిశ్శబ్దంగా అభివృద్ది చెందుతాయి. సమస్య మొదలయ్యే ముందు సంకేతాలు తక్కువగా ఉండడం లేదా అస్సలు ఉండకపోవడం జరుగుతుంది. దీంతో లక్షణాలను గుర్తించలేక చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. కానీ మన చర్మం కాలేయ వ్యాధి లక్షణాలను చూపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ లక్షణాలు చాలా సూక్ష్మమైనవే అయినప్పటికీ తీవ్రమైన కాలేయ సమస్యలను సూచిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. చర్మం పసుపు రంగులోకి మారడం, దురద వంటి లక్షణాలు హెపటైటిస్ వంటి తీవ్రమైన సమస్యలను సూచిస్తాయి. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాం. కాలేయ సమస్యలను తెలియజేసే, విస్మరించకూడని చర్మ సంబంధిత లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాలేయ పనితీరు దెబ్బతినడం వల్ల కనిపించే సాధారణ లక్షణాల్లో కామెర్లు ఒకటి. ఎర్ర రక్తకణాల విచ్చిన్నం ఫలితంగా ఏర్పడే బైలిరుబిన్ ను కాలేయం ప్రాసెస్ చేయలేదు. దీంతో పసుపు రంగులో ఉండే బైలిరుబిన్ రక్తం, కణజాలాలలో పేరుకుపోతుంది. దీనివల్ల చర్మం పసుపు రంగులోకి మారుతుంది. కామెర్లు తీవ్రమైన కాలేయ అనారోగ్యానికి సంకేతం కనుక ఈ లక్షణం కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మన శరీరంలో ముఖం, మెడ, చేతులు, ఛాతిపై ఎరుపు రంగులో వెబ్ ఆకారంలో రక్తనాళాలు విస్తరించి కనిపిస్తాయి. కాలేయం ఈస్ట్రోజన్ హార్మోన్ ను సరిగ్గా జీవక్రియ చేయలేనప్పుడు ఇలా జరుగుతుంది. ఇది దీర్ఘకాలంగా కాలేయం పనిచేయకపోవడాన్ని సూచిస్తుంది. ఆల్కహాల్ లేదా బలహీనమైన కాలేయ పనితీరు ఉన్న వ్యక్తుల్లో చర్మంపై సాలీడు (వెబ్) లాంటి రక్తనాళాలు ఎక్కువగా కనిపిస్తాయి. గర్భిణీ స్త్రీలల్లో కూడా ఇవి కనిపిస్తాయి. అయితే అకస్మాత్తుగా ప్రారంభమైతే మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
అరచేతిలో అలాగే బొటనవేలు, చిటికిన వేలు బేస్ వద్ద నిరంతరం ఎరుపుగా ఉంటుంది. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి కారణంగా రక్తప్రవాహంలో, హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్ తో పాటు ఆటోఇమ్యూన్ హైపటైటిస్, కాలేయ ఒత్తిడి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారిలో ఎక్కువగా ఈ లక్షణం కనిపిస్తుంది. ఇటువంటి కాలేయ సమస్యలు కూడా తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తాయి కనుక నిర్లక్ష్యం చేయకూడదు. కాలేయం పనిచేయకపోవడం వల్ల రక్తంలో పిత్త ఆమ్లాలు పేరుకుపోతాయి. దీంతో తీవ్రమైన దురద వస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో దురద ఎక్కువగా ఉంటుంది. చేతులు, కాళ్లు, అవయవాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. కొలెస్టాసిస్ లేదా ప్రైమరీ బిలియరీ కోలాంగైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారిలో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలం పాటు భరించలేని దురద ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
చర్మం నల్లగా మారడంతో పాటు కళ్లు, నోరు, చంకల చుట్టూ కూడా చర్మం నల్లగా మారుతుంది. దీర్ఘకాలిక కాలేయం వ్యాధితో బాధపడే వారిలో ఇలా జరుగుతుంది. హార్మోన్ల అసమతుల్యత, ఇన్సులిన్ నిరోధకత కారణంగా, కాలేయం పనిచేయకపోవడం వల్ల శరీరంలో మెలనిన్ పెరగడం వల్ల ఇలా జరుగుతుంది. హిమోక్రోమాటోసిస్, ఆటో ఇమ్యూన్ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ స్టీటోహెపటైసిస్ వంటి సమస్యలతో బాధపడే వారిలో హైపర్ పిగ్మెంటేషన్ కలుగుతుందని అధ్యయనాల ద్వారా కనుగొన్నారు.
ఇక లక్షణాలు మొదట్లో చిన్నగా ఉన్నప్పటికీ కాలేయ వ్యాధిని గుర్తించడంలో కీలకంగా పనిచేస్తాయి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయడం, మద్యపానం మానేయడం, క్రమంగా తప్పకుండా కాలేయ సంబంధిత పరీక్షలు చేయించుకవడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముందుగా గుర్తించడం వల్ల కాలేయ నష్టాన్ని తగ్గించడంతో పాటు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చని వైద్యులు చెబుతున్నారు.