Liver Diseases | మన శరీరంలో కాలేయం అనేక విధులను నిర్వర్తిస్తుంది. కాలేయ ఆరోగ్యం దెబ్బతింటే మొత్తం శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. కాలేయం తన విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే మనం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. కనుక కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. కాలేయ ఆరోగ్యం దెబ్బతినడం వల్ల కళ్లు, గోళ్లు పసుపు రంగులోకి మారిపోతాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఇలాంటి స్పష్టమైన లక్షణాలు ఎప్పుడూ కనిపించవు. మనం గుర్తించలేని కొన్ని లక్షణాలను కూడా కాలేయం కనబరుస్తూ ఉంటుంది. ఈ లక్షణాలను గుర్తించడం వల్ల మనం సమస్య మరింత తీవ్రతరం కాకుండా కాపాడుకోవచ్చు. దీంతో కాలేయ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది. కాలేయ సమస్యలను సూచించే కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.
తగినంత విశ్రాంతి తీసుకున్నప్పటికి ఆలసటగా ఉన్నట్లయితే కాలేయం సమస్యలో ఉందని అర్థం చేసుకోవాలి. మన శరీర జీవక్రియలో కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాలేయ ఆరోగ్యం దెబ్బతినడం వల్ల శక్తిని సరిగ్గా నిర్వహించలేదు. దీంతో మనకు ఎల్లప్పుడూ అలసటగా ఉన్నట్టు ఉంటుంది. కాలేయ ఆరోగ్యం దెబ్బతిన్నట్లయితే ఆకలి తగ్గడంతో పాటు శరీర బరువు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ పోషకాలను సరిగ్గా గ్రహించలేకపోతుంది అనడానికి ఇది ఒక సంకేతం. కాలేయ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కాలేయం ఉన్నచోట అనగా ఉదరం కుడి ఎగువ భాగంలో నొప్పి లేదా మంటగా ఉంటుంది, కాలేయం వాపుకు గురి అవుతుంది. కాలేయ ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు అది బిలిరుబిన్ అనే పదార్థాన్ని విచ్చినం చేయలేకపోతుంది. దీంతో చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటి లక్షణాన్ని గుర్తించిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
కాలేయ పనితీరు సరిగ్గా లేనప్పుడు చర్మం దురదగా ఉంటుంది. కాలేయం పనితీరు మందగించడం వల్ల రక్తం ద్వారా విష పదార్థాలు బయటకు తొలగించబడవు. దీంతో చర్మం కింద ఆ విషపదార్థాలు పేరుకుపోయి దురదకు కారణమవుతాయి. కాళ్లు, పొత్తి కడుపులో ద్రవం పేరుకుపోవడం కూడా కాలేయం సరిగ్గా పనిచేయడం లేదని తెలియజేసే ఒక సంకేతమే. అదే విధంగా మలం, మూత్రం రంగుల్లో మార్పు రావడం వంటి లక్షణాలు కాలేయ ఒత్తిడిని తెలియజేస్తాయి. ఈవిధమైన లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకూడదు. వైద్యుడిని సంప్రదించి ఇవి కాలేయం దెబ్బతినడం వల్ల తలెత్తిన సమస్యలా లేదా మరేదైనా అనారోగ్య సమస్యలకు సంకేతాలా అని నిర్దారణ చేసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. సమస్య ఏదైనా త్వరగా గుర్తించినప్పుడే మనం కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు ఇవి ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.