Fainting | అప్పటి వరకు కొందరు బాగానే ఉంటారు. కానీ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోతుంటారు. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఎవరైన సరే స్ఫృహ తప్పి పడిపోయేందుకు అనేక కారణాలు ఉంటాయి. ఎక్కువ సమయం పాటు నిలబడి ఉన్నా, తీవ్రమైన ఒత్తిడి బారిన పడినా, రక్తం చూసినా, ఎక్కువ వేడికి గురైనా, డీహైడ్రేషన్ బారిన పడినా లేదా తీవ్రమైన వ్యాయామం, శారీరక శ్రమ చేసినా స్పృహ తప్పి పడిపోతుంటారు. దగ్గు వచ్చినప్పుడు, తుమ్మినప్పుడు, నవ్వినప్పుడు, ఏదైనా మింగినప్పుడు, మూత్ర విసర్జన చేసినప్పుడు కూడా కొందరు ఉన్నట్లుండి షాక్‌కు గురవుతారు. దీంతో స్పృహ తప్పి పడిపోతారు. మెడపై ఉండే కెరోటిడ్ అనే రక్తనాళంపై ఒత్తిడి కలిగించినా కూడా స్పృహ తప్పుతారు. సాధారణంగా ఈ సమస్య ఆ భాగంపై గట్టిగా దెబ్బ తగలడం లేదా మెడ బిగుతుగా ఉండే దుస్తులను ధరించడం వల్ల వస్తుంది.
కొందరు ఎక్కువ సమయం పాటు నిలబడి ఉంటే వారి బీపీ లెవల్స్ పడిపోతాయి. దీంతో ఆటోమేటిగ్గా వారు స్పృహ తప్పి పడిపోతారు. ఎండ వేడి కారణంగా చాలా మందికి ఒంట్లోని నీరు త్వరగా ఆవిరైపోతుంది. దీన్నే డీహైడ్రేషన్ అని కూడా అంటారు. ఇలాంటి స్థితిలో నీళ్లను లేదా శరీరానికి ద్రవాలను అందించే ఆహారాలను తీసుకోవాలి. లేదంటే డీహైడ్రేషన్ అధికమై స్పృహ తప్పి పడిపోతారు. అలాగే డైయురెటిక్స్, బీపీ మందులు, షుగర్ మందులు, యాంటీ డిప్రెసెంట్ మందులను వాడే వారిలో కూడా తరచూ స్పృహ తప్పిపోవడం కనిపిస్తుంది. గుండె రక్తాన్ని వేగంగా పంప్ చేసినా కూడా ఈ సమస్య వస్తుంది. నాడీ సంబంధ వ్యాధులు ఉన్నవారిలో కూడా స్పృహ తప్పి పడిపోవడం అనే సమస్య కనిపిస్తుంది. డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు ఉండడం, ఎక్కువ సమయం పాటు అతిగా నిద్రించడం, వయస్సు మీద పడడం వంటివి కూడా స్పృహ తప్పడానికి కారణం అవుతుంటాయి.
స్పృహ తప్పి పడిపోవడం అన్నది సాధారణ సమస్యే అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకం అవుతుంది. స్ఫృహ తప్పి పడిపోయే వారు ఇతర ఎలాంటి లక్షణాలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. కాసేపటికి అంతా సర్దుకుంటుంది. కానీ దీంతోపాటు పలు లక్షణాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ముఖ్యంగా ఇలాంటి స్థితిలో తల తిరగడం లేదా వాంతికి వచ్చినట్లు ఉండడం, వికారం, చెమటలు బాగా పట్టడం, చర్మం పాలిపోయినట్లు తెల్లగా మారడం, నీరసంగా ఉండడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటే అప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్‌ను కలవాలి. అలాగే తరచూ స్పృహ తప్పి పడిపోతున్నా, గుండె సంబంధిత సమస్యలు ఉన్నా, ఛాతిలో నొప్పి రావడం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం, వ్యాయామం చేసేటప్పుడు పడిపోవడం, కుటుంబంలో అంతకు ముందు ఎవరైనా సడెన్‌గా స్ట్రోక్ తో చనిపోవడం జరిగినా.. కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి.
స్పృహ తప్పి పడిపోయిన వారు వెంటనే నీళ్లను తాగితే శరీరంలోకి ద్రవాలు చేరుతాయి. దీంతో ఈ సమస్య నుంచి తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది. అందుకనే స్పృహ తప్పిన వారిపై నీళ్లను చల్లుతారు. ఇది ఒక షాక్ లాంటి ఎఫెక్ట్‌ను ఇస్తుంది. దీంతో స్పృహ తప్పిన వారు వెంటనే లేస్తారు. అలాగే ఈ సమస్య ఉన్నవారు భోజనాన్ని మానేయడం మంచిది కాదు. కొందరు ఉదయం లేదా రాత్రి భోజనం చేయడం మానేస్తుంటారు. ఇలా తరచూ చేస్తుంటే స్పృహ తప్పి పోవడం అనే సమస్య వస్తుంది. కాబట్టి భోజనాన్ని మానేయడం మంచిది కాదు. అలాగే అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తినాలి. షుగర్, హైబీపీ, థైరాయిడ్ ఉన్నవారు అయితే ఆయా సమస్యలు కంట్రోల్లో ఉన్నాయా, లేదా అని తరచూ పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా మందులను వాడాలి. డైట్‌ను పాటించాలి. మరీ అతిగా వ్యాయామం లేదా శారీరక శ్రమ చేయకూడదు. ఇలా కొన్ని సూచనలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.