Facial Fat | అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి అతి పెద్ద సమస్యగా మారింది. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కానీ అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు మాత్రం చాలా కష్టపడాల్సి వస్తోంది. అయితే కొందరికి శరీరం అంతా బాగానే ఉంటుంది, అన్ని భాగాలు సన్నగా సరిగ్గానే ఉంటాయి, కానీ ముఖం మాత్రం కొవ్వుతో ఉంటుంది. దీన్నే ఫేషియల్ ఫ్యాట్ అంటారు. బరువు అధికంగా ఉన్నవారికి కూడా ఈ సమస్య ఉంటుంది. ఫేషియల్ ఫ్యాట్ వచ్చేందుకు పలు కారణాలు ఉంటాయి. అధికంగా బరువు ఉన్నవారిలో సహజంగానే ముఖంలో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో ఫేషియల్ ఫ్యాట్ సమస్య వస్తుంది. ముఖం నిండా చర్మం కింద కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కొందరికి శరీరంలో ద్రవాల శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల ముఖం ఉబ్బిపోయి కనిపిస్తుంది. దీన్ని కూడా ఫేషియల్ ఫ్యాట్ సమస్యగానే భావించాలి. ఉప్పును అధికంగా తీసుకున్నా, నీళ్లను సరిగ్గా తాగకపోయినా ఇలా జరుగుతుంది.
కొందరికి వంశ పారంపర్య కారణాల వల్ల కూడా ముఖంలో కొవ్వు చేరుతుంది. పుట్టుకతోనే కొందరికి ఈ సమస్య వస్తే, కొందరికి వయస్సు మీద పడ్డాక వస్తుంది. ముఖ్యంగా ముఖంలో ఉండే ఎముకల నిర్మాణం వల్ల కూడా ఇలా జరుగుతుంది. దవడ ఎముక ఇందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీని నిర్మాణం సరిగ్గా లేకున్నా కూడా ముఖంలో కొవ్వు పేరుకుపోతుంది. వయస్సు మీద పడడం వల్ల కండరాల శాతం తగ్గి కొవ్వు చేరుతుంది. దీని వల్ల కూడా ముఖంలో కొవ్వు చేరుతుంది. హైపోథైరాయిడ్ సమస్య ఉన్నవారిలో, హార్మోన్ సమస్యలతో బాధపడుతున్న మహిళల్లో ఇలా ముఖం వాపులకు గురై కనిపిస్తుంది. నిద్రలేమి సమస్య వల్ల కూడా ఇలా జరుగుతుంది. రోజూ తగినన్ని గంటలపాటు నిద్రించకపోతే శరీరంలో కార్టిసాల్ లెవల్స్ పెరిగిపోతాయి. దీని వల్ల బరువు పెరుగుతారు. ఫలితంగా ఫేషియల్ ఫ్యాట్ సైతం వస్తుంది. మద్యం ఎక్కువగా సేవించే వారిలో క్యాలరీలు అధికంగా చేరుతాయి. డీహైడ్రేషన్ బారిన పడతారు. దీని వల్ల శరీరంలో ద్రవాల శాతం పెరిగిపోతుంది. ఫలితంగా ముఖం వాపులకు గురై కనిపిస్తుంది. దీన్ని కూడా ఫేషియల్ ఫ్యాట్ అనే అంటారు.
ఫేషియల్ ఫ్యాట్ వచ్చిన వారు ముఖానికి సంబంధించిన వ్యాయామాలను చేస్తుండాలి. శారీరక వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గుతారు. దీంతో ఆటోమేటిగ్గా ముఖంలో ఉండే కొవ్వు కూడా కరిగిపోతుంది. ముఖం మళ్లీ సాధారణ రూపానికి వస్తుంది. అలాగే పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను తింటుంటే ముఖంలో ఉండే కొవ్వు సులభంగా కరిగిపోతుంది. యాపిల్స్, బెర్రీలు, నారింజ, పాలకూర, క్యారెట్లు, ఓట్స్, కినోవా, బ్రౌన్ రైస్, బీన్స్, పప్పు దినుసులు, శనగలు, స్కిన్ లెస్ చికెన్, చేపలు, కోడిగుడ్లు, సోయా టోఫు, ఇతర సోయా ఆహారాలు, అవకాడో, గింజలు, విత్తనాలు, ఆలివ్ ఆయిల్, కీరదోస, పుచ్చకాయ వంటివి శరీరంలోని కొవ్వును కరిగించేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. కనుక ఈ ఆహారాలను రోజూ తింటే మేలు జరుగుతుంది.
ముఖంలో కొవ్వు అనేది సాధారణ సమస్యే. అధికంగా బరువు ఉన్నవారు బరువును తగ్గించుకుంటే ఈ సమస్య కూడా దానంతట అదే తగ్గిపోతుంది. కానీ అధిక బరువు లేనప్పటికీ ఈ సమస్య ఉందంటే అందుకు కారణం ఏమిటో ముందుగా గుర్తించాలి. దానికి తగినట్లుగా ఆహారం, వ్యాయామం విషయాల్లో మార్పులు చేసుకోవాలి. దీంతో ఫేషియల్ ఫ్యాట్‌ను తొలగించుకోవచ్చు. ఈ సమస్య ఉన్నవారు రోజూ తీసుకునే క్యాలరీల కన్నా కాస్త తగ్గించి తింటుంటే మేలు జరుగుతుంది. రోజూ కార్డియో, ఎరోబిక్ వ్యాయామాలను చేస్తుంటే ఫలితం త్వరగా కనిపిస్తుంది. నీళ్లను అధికంగా తాగుతుండాలి. డీహైడ్రేషన్ వల్ల కూడా ఫేషియల్ ఫ్యాట్ వస్తుంది కనుక రోజూ తగినంత మోతదులో నీళ్లను తాగాల్సి ఉంటుంది. ఉప్పును తీసుకోవడం తగ్గించాలి. మద్యం సేవించడం తగ్గించాలి లేదా పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. అలాగే ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకుని తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇలా అన్ని జాగ్రత్తలను పాటిస్తే ఫేషియల్ ఫ్యాట్‌ను చాలా సులభంగా కరిగించుకోవచ్చు. ముఖం అందంగా కనిపిస్తుంది.