Dry Eyes | ఒకప్పుడు ప్రజలు రోజూ శారీరక శ్రమ అధికంగా చేసేవారు. కానీ ఇప్పుడు చాలా మంది కంప్యూటర్ల ఎదుట గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారు. అలాగే స్మార్ట్ ఫోన్లు, టీవీల వాడకం పెరిగింది. దీంతో కళ్లపై ప్రభావం పడుతోంది. ఫలితంగా కళ్లు పొడిబారడం, ఎర్రగా మారి దురద పెట్టడం, కళ్లలో మంటలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాగే పోషకాహార లోపం కూడా చాలా మందిలో ఉంటోంది. దీని కారణంగా కంటి చూపు కూడా మందగిస్తోంది. దీంతో చిన్నారులు ఆ వయస్సు నుంచే కళ్లద్దాలను వాడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కళ్లు పొడిబారడం అంటే కళ్లలో ఉండే తేమ తగ్గిపోవడం అని చెప్పవచ్చు. మన కళ్లను ఎప్పుడూ తేమగా ఉంచేందుకు గాను కళ్లలో కొన్ని ద్రవాలు ఎల్లప్పుడూ స్రవించబడుతూ ఉంటాయి. అందుకనే కళ్లపై భారం పడకుండా ఉంటుంది.
అయితే డిజిటల్ తెరలను అధికంగా చూడడం వల్ల సాధారణంగా కళ్లను ఎక్కువ సేపు తెరిచి ఉంచుతారు. దీంతో కళ్లలో ఉండే ద్రవాలు త్వరగా తగ్గుతాయి. ఈ కారణంగా కళ్లు పొడిబారతాయి. అనంతరం కళ్లు ఎర్రగా మారి దురదలు పెడతాయి. అయితే కళ్లు పొడిబారేందుకు కేవలం డిజిటల్ తెరలు మాత్రమే కాకుండా పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. కళ్లకు సరైన రక్షణ లేకపోవడం, దుమ్ము, ధూళిలో ఎక్కువగా గడపడం వంటి కారణాల వల్ల కూడా కళ్లు పొడిగా మారుతాయి. అయితే కళ్లు పొడిబారే వారిలో కేవలం కళ్లు ఎర్రగా మారడం, దురద పెట్టడం మాత్రమే కాకుండా పలు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. కొందరికి కళ్లు పొడిబారితే తలనొప్పి వస్తుంది. అలాగే కళ్లలో కూడా నొప్పిగా ఉంటుంది. కొందరికి కళ్లు మంటగా అనిపిస్తాయి. మసకగా కూడా కనిపిస్తాయి. అలాగే ఆందోళనగా కూడా ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు. అలాగే కళ్లు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటాయి.
కళ్లు పొడిబారిపోయి చాలా ఇబ్బందిగా ఉంటే కళ్లపై ఆవిరి పట్టడం ద్వారా పొడిబారిన కళ్లు మళ్లీ సాధారణం అవుతాయి. దీంతో కళ్లలో ఉండే ఎరుపుదనం, దురదలు కూడా తగ్గుతాయి. అలాగే గోరు వెచ్చని నీళ్లను వాటర్ బ్యాగ్‌లో పోసి ఆ బ్యాగ్‌ను కళ్లపై ఉంచి మసాజ్ చేసినట్లు రాయాలి. దీంతో కూడా కళ్లు పొడిబారడం తగ్గుతుంది. అదేవిధంగా అవిసె గింజలు, సోయాబీన్, చియా విత్తనాలు, చేపలు, వాల్ నట్స్, కోడిగుడ్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కనుక వీటిని తరచూ తింటుంటే కంటి సమస్యలు తగ్గుతాయి. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక కంప్యూటర్ల ఎదుట ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు 20-20-20 రూల్‌ను పాటించాలి. అంటే.. 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలో ఉండే వస్తువులను చూడాలి. దీంతో కళ్లపై భారం పడకుండా అడ్డుకోవచ్చు. కళ్లు పొడిబారకుండా ఉంటాయి.
ప్రస్తుతం చాలా మంది స్మార్ట్ ఫోన్లను అధికంగా ఉపయోగిస్తున్నారు. అలాగే టీవీల్లో గంటల తరబడి ఓటీటీలను చూస్తూ అదే ప్రపంచంలో మునిగి తేలుతున్నారు. వాస్తవానికి ఇలా గంటల తరబడి డిజిటల్ తెరలను చూడడం కళ్లకు అసలు మంచిది కాదు. దీని వల్ల కళ్లలో ఉండే తేమ చాలా వరకు తగ్గిపోతుంది. ఫలితంగా కళ్లు పొడిబారడం ఎక్కువవుతుంది. అప్పుడది మరింత ఎక్కువ సమస్యను సృష్టిస్తుంది. ఇది దీర్ఘకాలంలో కళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కళ్ల పొరలు దెబ్బ తినేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక వైద్యులు ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలను ఎక్కువ సేపు చూడవద్దని చెబుతారు. అయితే ఇవి లేకుండా ఉండాలంటే ప్రస్తుతం అసాధ్యమనే చెప్పవచ్చు. కానీ వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. దీని వల్ల కళ్లు పొడిబారకుండా సురక్షితంగా ఉండవచ్చు. కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.