Bad Breath | నోటి దుర్వాసన సమస్య అనేది సహజంగానే చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. నోటి దుర్వాసన సమస్య ఉంటే నలుగురిలో మాట్లాడేందుకు వెనుకాడుతుంటారు. దీర్ఘకాలికంగా జీర్ణ సమస్యలు ఉన్నా, పలు రకాల మెడిసిన్లను వాడుతున్నా, నోట్లో ఆహార పదార్థాలు ఇరుక్కుపోయినా, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నా నోరు దుర్వాసనగా ఉంటుంది. అయితే నోటి దుర్వాసనను తగ్గించుకునేందుకు ఇంగ్లిష్ మెడిసిన్లను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే పలు పదార్థాలతోనే సహజసిద్ధంగా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. దీంతో నోట్లోని బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇక నోటి దుర్వాసనను తగ్గించే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
నోరు దుర్వాసన ఉన్నవారు ఎల్లప్పుడూ నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దంతాల మధ్య ఎలాంటి ఆహారాలు చిక్కుకుపోకుండా చూసుకోవాలి. రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలి. దంతాల మధ్య ఉన్న ఆహారాలను తొలగించాలి. అలాగే నాలుకను సైతం శుభ్రం చేసుకోవాలి. నీళ్లను తగిన మోతాదులో తాగాలి. చక్కెర ఉండే పదార్థాలు లేదా పానీయాలను తీసుకోవడం తగ్గించాలి. లేదా పూర్తిగా మానేస్తే మంచిది. ఉప్పు నీటితో తరచూ నోటిని పుక్కిలిస్తుండాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తున్నా కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులను నోట్లో వేసుకుని నమిలి తింటుండాలి. దీని వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది. భోజనం చేసిన అనంతరం సోంపు గింజలను తింటున్నా కూడా ఫలితం ఉంటుంది.
పుదీనా ఆకులను నోట్లో వేసుకుని నమిలి తింటున్నా కూడా నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ ఆకుల్లో క్లోరోఫిల్ ఉంటుంది. ఇది సహజసిద్ధమైన డియోడరైజర్‌గా పనిచేస్తుంది. దీని వల్ల నోటి దుర్వాసన తగ్గిపోతుంది. అల్లంతో తయారు చేసిన హెర్బల్ టీని సేవిస్తుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. అల్లంలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు నోరు, దంతాలు, చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. పెప్పర్ మింట్ టీని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోట్లోని బ్యాక్టీరియాను తొలగిస్తాయి. దీంతో సమస్య తగ్గుతుంది. రోజూ 15 నిమిషాల పాటు ఉదయం పరగడుపునే ఆయిల్ పుల్లింగ్ చేసేవారికి నోటి దుర్వాసన ఉండదు. ఇందుకు గాను ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెను తీసుకుని నోట్లో పోసి 15 నిమిషాల పాటు నోరు అంతా ఆ నూనెను తిప్పుతూ బాగా పుక్కిలించాలి. అనంతరం కడిగేయాలి. దీని వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది.
యాపిల్ పండ్లను లేదా క్యారెట్లను రోజూ తినేవారికి దంతాలు, నోరు, చిగుళ్ల సమస్యలు ఉండవు. నోటి దుర్వాసన ఉన్నవారు పలు ఆహారాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఆహారాలను తినకూడదు. నోటి దుర్వాసన ఉందంటే కొన్ని సార్లు అది వేరే ఏదైనా వ్యాధికి సూచనగా కూడా భావించాలి. సాధారణంగా పలు రకాల దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కూడా నోటి దుర్వాసన అంత సులభంగా తగ్గదు. చిగుళ్ల వ్యాధులు, తీవ్రమైన గ్యాస్ ట్రబుల్, టాన్సిల్స్, సైనస్ ఇన్ఫెక్షన్లు, డయాబెటిస్, కిడ్నీలు, లివర్ వ్యాధులు ఉన్నా కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది. కనుక ఏ చిట్కాలను పాటించినా సమస్య తగ్గడం లేదు అంటే ఏదైనా వ్యాధి ఉందేమోనని భావించాలి. అప్పుడు వైద్యులను కలిసి అవసరం అయిన మేరకు పరీక్షలు చేయించుకుని, అనంతరం చికిత్స తీసుకోవాలి. దీంతో వ్యాధి తగ్గడమే కాక నోటి దుర్వాసన కూడా దానంతట అదే తొలగిపోతుంది.