Tea | రోజూ ఉదయాన్నే చాలా మందికి టీ తాగడం అలవాటు ఉంటుంది. ఉదయాన్నే చల్లని వాతావరణంలో వేడిగా గొంతులోకి టీ వెళ్తుంటే వచ్చే మజాయే వేరు. చాలా మంది ఉదయం బెడ్ టీతోనే తమ రోజును ప్రారంభిస్తుంటారు. చాయ్ లవర్స్ చాలా మందే ఉంటారు. వీరు రోజుకు ఐదారు కప్పులను అలవోకగా తాగుతుంటారు. అయితే టీని తయారు చేసేటప్పుడు అందులో ఈ పదార్థాలను కలిపి అనంతరం తయారయ్యే టీని తాగితే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. టీ తయారీలో ఈ ఆహారాలను ఉపయోగించడం వల్ల టీని తాగితే ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఇక ఆ పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు తయారు చేసే టీలో అల్లం కలిపి వాడండి. అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు కూడా అల్లంలో ఉంటాయి. ఈ క్రమంలోనే అల్లం కలిపిన చాయ్‌ని తాగితే జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. గొంతు సమస్యలు తగ్గుతాయి. గొంతులో నొప్పి, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
టీ తయారు చేసేటప్పుడు అందులో కొన్ని యాలకులను కలిపి టీ తయారు చేయండి. ఈ టీలో ఎన్నో ఎసెన్షియల్స్ ఉంటాయి. యాలకుల్లో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా యాలకుల్లో ఉండే రైబోఫ్లేవిన్, నియాసిన్‌లతో నోటి సమస్యలు తగ్గుతాయి. నోట్లో పుండ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ టీ చక్కని వాసనను కలిగి ఉండడమే కాదు జీర్ణశక్తిని సైతం పెంచుతుంది. అలాగే అసిడిటీని కూడా తగ్గిస్తుంది.
టీ తయారు చేసే సమయంలో అందులో దాల్చిన చెక్కను వేసి కూడా టీ పెట్టుకోవచ్చు. దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పనితీరు మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూసుకోవచ్చు. మీరు తయారు చేసే టీ లో తులసి ఆకులను వేసి కూడా టీ పెట్టుకోవచ్చు. తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఈ ఆకుల్లో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. తులసి ఆకులు వేసి తయారు చేసిన టీని తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది.
టీలో పసుపు వేసి టీ తయారు చేసి కూడా తాగవచ్చు. పసుపులో కర్క్యుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు సైతం పసుపులో ఉంటాయి. అందువల్ల పసుపు వేసి టీ తయారు చేసి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. రోగాల నుంచి రక్షణ లభిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే సోంపు గింజలతోనూ మీరు టీ తయారు చేసి తాగవచ్చు. దీని వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా పలు రకాల పదార్థాలను కలిపి టీ తయారు చేసి తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన లాభాలను పొందవచ్చు.