Protein Supplements | ప్రోటీన్ శరీరానికి అత్యంత అవసరమైన పోషకాలలో ఒకటి. ఇది కండరాల సంరక్షణ, కణజాలాల పునరుద్ధరణ, రోగనిరోధక శక్తి మెరుగుదల వంటి అనేక ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై అవగాహన పెరగడంతో చాలామంది ప్రోటీన్ సప్లిమెంట్లను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా శాకాహారులు తమ రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడానికి వీటిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే ప్రోటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం ప్రారంభించే ముందు శరీరం అదనపు ప్రోటీన్‌ను జీర్ణించుకుని వినియోగించగల స్థితిలో ఉందా లేదా అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రోటీన్ సప్లిమెంట్ ప్రారంభించే ముందు గట్ హెల్త్ (జీర్ణాశయ ఆరోగ్యం)ను పరిశీలించుకోవాలి. ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారం సులభంగా జీర్ణమవుతోందా, మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు ఉన్నాయా అనేది గమనించాలి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తేనే అదనపు ప్రోటీన్‌ను శరీరం సమర్థంగా వినియోగించుకుంటుంది.
కిడ్నీల ఆరోగ్యం కూడా ఎంతో కీలకం. ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నప్పుడు దాని ఉప ఉత్పత్తులను తొలగించేందుకు మూత్రపిండాలు అదనపు పని చేయాల్సి ఉంటుంది. కిడ్నీ రాళ్లు, కిడ్నీ పనితీరు తగ్గడం వంటి సమస్యల చరిత్ర ఉన్నవారు లేదా ఇటీవల కిడ్నీ ఫంక్షన్ పరీక్షలు చేయించుకోనివారు ముందుగా వైద్యుల సలహా తీసుకోవడం అవసరం. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే అధిక ప్రోటీన్ తీసుకోవడం సురక్షితం. కాలేయం ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రోటీన్ జీర్ణమైన తర్వాత ఏర్పడే అమినో ఆమ్లాలను ప్రాసెస్ చేయడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఫ్యాటీ లివర్, లివర్ ఎంజైమ్‌లు పెరగడం లేదా ఇతర కాలేయ సమస్యలు ఉన్నవారు ముందుగా వాటిని నియంత్రించుకోవాలి. లేనిపక్షంలో అధిక ప్రోటీన్ ఆహారం లేదా సప్లిమెంట్లు కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగించే ప్రమాదం ఉంటుంది.
ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకునే సమయంలో తగినంత నీరు తాగడం అత్యంత ముఖ్యమైన విషయం. ప్రోటీన్ జీవక్రియ సమయంలో యూరియా రూపంలో వ్యర్థాలు బయటకు వెళ్లేందుకు శరీరానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. నీటి వినియోగాన్ని పెంచకుండా ప్రోటీన్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్, కిడ్నీలపై ఒత్తిడి, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ప్రోటీన్ సప్లిమెంట్లను ఉపయోగించే వారు రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. చాలామంది ముందుగా ప్రోటీన్ సప్లిమెంట్ ప్రారంభించి, తర్వాత సమస్యలు ఎదురైనప్పుడు కారణాలు వెతుకుతుంటారు. అయితే గట్, కిడ్నీ, కాలేయ ఆరోగ్యం, నీటి వినియోగం వంటి అంశాలను ముందుగానే పరిశీలించుకుంటే మంచి ఫలితాలను పొందడంతోపాటు అనవసర ఆరోగ్య సమస్యలను కూడా నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.