Legumes | శాకాహారులు ప్రోటీన్ల కోసం ఎక్కువగా పప్పు దినుసులపై ఆధారపడతారు. అయితే శాకాహార ప్రోటీన్లు తిన్న తర్వాత కొందరికి జీర్ణ సమస్యలు ఎదురవుతుంటాయి. దీనికి కారణం ప్రోటీన్ కాదు, వాటిని సరిగ్గా సిద్ధం చేయకపోవడమేనని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బీన్స్, పప్పులు, శనగలు వంటి దినుసులను వండే ముందు కొన్ని గంటలు లేదా రాత్రంతా నానబెట్టడం చాలా ముఖ్యమని వారు సూచిస్తున్నారు. శాకాహార ప్రోటీన్లు సాధారణంగా ఫైబర్ ఎక్కువగా ఉండటం, సంక్లిష్ట నిర్మాణం కలిగి ఉండటం వల్ల జీర్ణం కావడానికి కొంచెం సమయం పడుతుంది. వీటిలో ఉండే ఫైటేట్స్ (Phytates), ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అనే పదార్థాలు జీర్ణ ప్రక్రియను మందగింపజేస్తాయి. అందుకే సరైన విధంగా సిద్ధం చేయకపోతే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
ఇక ఈ సమస్యకు సులభమైన పరిష్కారం నానబెట్టడమే. పప్పు దినుసులను నీటిలో నానబెట్టినప్పుడు వాటిలోని ఫైటేట్స్ క్రమంగా తగ్గుతాయి. అలాగే ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతూ జీర్ణానికి సహాయపడతాయి. దీంతో వండిన తర్వాత అవి తేలికగా జీర్ణమవుతాయి. శరీరానికి అవసరమైన పోషకాలు సులభంగా గ్రహించబడతాయి. జీర్ణ సమస్యలకు అసలు కారణం శాకాహార ప్రోటీన్లు కావు, వాటిని నానబెట్టకపోవడమే అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి బీన్స్, పప్పులు, శనగలు వండే ముందు తప్పనిసరిగా కొన్ని గంటలు నానబెట్టడం అలవాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక నువ్వుల గింజలను (Sesame seeds) రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ల వంటి కీలక పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచడమే కాకుండా, మెదడు ఆరోగ్యం, గుండె ఆరోగ్యం మెరుగుపడటానికి కూడా సహాయపడతాయి. సరైన విధంగా ఆహారాన్ని సిద్ధం చేసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలను నివారించవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.