Coconut Water | కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మన శరీరానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ప్రకృతి మనకు సహజసిద్ధంగా అందించిన మధురమైన పానీయం కొబ్బరి నీళ్లు. వీటిని సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే తాగుతుంటారు. కొబ్బరి నీళ్లు మనకు వేసవిలో దాహాన్ని తీర్చడమే కాదు, ఎండ దెబ్బ బారిన పడకుండా చూస్తాయి. కొబ్బరి నీళ్లను వేసవిలో తాగడం వల్ల శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందుతుంది. అలాగే వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే కొబ్బరి నీళ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ వీటిని మోతాదులోనే తాగాల్సి ఉంటుంది. పెద్ద మొత్తంలో కొబ్బరి నీళ్లను తాగితే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలగకపోగా అనారోగ్య సమస్యలు వస్తాయి. కొబ్బరి నీళ్లను రోజూ తాగే వారు కచ్చితంగా జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.
కొబ్బరి నీళ్లను తాగితే మనకు తాజాదనపు అనుభూతి కలుగుతుంది. శరీరానికి కొత్త శక్తి వచ్చినట్లు అయి ఉత్తేజంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. అయితే మెడికల్ మైక్రో బయాలజిస్ట్ డాక్టర్ జమాల్ ఎ.ఖాన్ చెబుతున్న ప్రకారం.. కొబ్బరి నీళ్లను రోజూ మోతాదుకు మించి తాగితే అందులో ఉండే పొటాషియం గుండెకు హాని చేస్తుందని అంటున్నారు. కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ వాటిల్లో పొటాషియం, సోడియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. కనుక కొబ్బరి నీళ్లను మోతాదుకు మించి తాగితే ఆరోగ్యానికి హాని కలుగుతుందని అంటున్నారు. కొబ్బరి నీళ్లను ఎవరైనా సరే మోతాదులోనే తాగాల్సి ఉంటుంది. కొబ్బరి నీళ్లను అధికంగా తాగడం వల్ల శరీరంలో పొటాషియం లెవల్స్ పెరిగిపోయి హైపర్ కలేమియా అనే సమస్య వస్తుందని అంటున్నారు. దీని వల్ల గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది. కొందరికి ప్రాణాంతక పరిస్థితులు సంభవించే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. కిడ్నీ సంబంధ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగకపోవడమే మంచిది. లేదంటే కొబ్బరి నీళ్ల కారణంగా శరీరంలో చేరే పొటాషియంను కిడ్నీలు బయటకు పంపించలేకపోతే అప్పుడు కిడ్నీలపై భారం పడుతుంది. కనుక ఈ సమస్య ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగకూడదు. అలాగే శస్త్ర చికిత్స చేయించుకుంటానికి 2 వారాల ముందు కానీ 2 వారాల తరువాత కానీ కొబ్బరి నీళ్లను తాగవద్దని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే వీటిల్లో ఉండే పొటాషియం కారణంగా రక్తపోటు నియంత్రణలో ఉండదు. దీని వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
కిడ్నీ వ్యాధులు లేదా హైబీపీ మందులను వాడేవారు డాక్టర్ సలహా మేరకు కొబ్బరి నీళ్లను తాగవచ్చు. లేదంటే మెడిసిన్ల ప్రభావం మరీ ఎక్కువయ్యే లేదా తక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లను తాగకపోవడమే మంచిది. కొబ్బరి నీళ్లను ఎవరైనా సరే రోజుకు 1 గ్లాస్ మోతాదులో తాగవచ్చు. వేసవిలో రెండు సార్లు ఇలా రోజుకు తాగవచ్చు. కానీ మోతాదుకు మించితే శరీరంలో పొటాషియం స్థాయిలు ఎక్కువై అది రక్తపోటుపై ప్రభావం చూపిస్తుంది. దీంతో గుండెకు హాని కలుగుతుంది. కనుక అధికంగా కొబ్బరి నీళ్లను తాగుతున్న వారు ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.