Sandalwood | గంధం.. దీన్నే చందనం అని కూడా అంటారు. పూజల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే అనేక సౌందర్య సాధన ఉత్పత్తులు, సబ్బులు, పెర్ఫ్యూమ్స్ వంటి వాటి తయారీలోనూ చందనాన్ని వాడుతారు. ఇది పూజా ద్రవ్యంగానే కాక అందాన్ని ఇచ్చే సువాసనా ద్రవ్యంగా కూడా వాడబడుతోంది. చందనం మనకు మార్కెట్లో పలు రూపాల్లో లభిస్తుంది. చందనానికి చెందిన చిన్న పాటి కర్రలను మార్కెట్లో విక్రయిస్తారు. చందనం పొడి అలాగే నూనె కూడా మనకు అందుబటులో ఉన్నాయి. ఇవన్నీ మనకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందం కోసం కూడా పనిచేస్తాయి. చందనం మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మేథస్సును పెంచే గుణం దీనికి ఉంది. చందనపు చెక్క నుంచి తీసిన తైలాన్ని వాసన పీలిస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మైండ్ రిలాక్స్ అవుతుంది. మానసిక ప్రశాంతత లభించి నిద్ర చక్కగా పడుతుంది. నిద్ర లేమి నుంచి బయట పడవచ్చు.
చందన తైలాన్ని అనేక ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, మూత్రాశయం వంటి భాగాలకు చెందిన వ్యాధులకు ఇచ్చే మందుల తయారీలో ఈ నూనెను ఉపయోగిస్తారు. కొందరు చందనాన్ని నుదుటన సింధూరంలా పెట్టుకుంటారు. దీంతో శరీరానికి చలువ చేస్తుంది. శరీరంలోని వేడి పోతుంది. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మ వ్యాధులను తగ్గించడంలోనూ చందనం అద్భుతంగా పనిచేస్తుంది. చందనాన్ని శరీరానికి లేపనంగా రాసి కాసేపు అయ్యాక స్నానం చేస్తే సమస్త చర్మ వ్యాధులు నయమవుతాయి. శరీరం సువాసనా భరితంగా కూడా మారుతుంది.
చందనం, ముల్తాని మట్టి, అత్తరు కలిపి పేస్ట్‌లా చేసి ముఖం, మెడ మీద రాయాలి. కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే నలుపుదనం తగ్గిపోతుంది. చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తుంది. చర్మానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. స్నానం చేసే నీటిలో కొన్ని చుక్కల చందనం తైలాన్ని కలిపి స్నానం చేయాలి. దీంతో శరీరం నుంచి అధికంగా వచ్చే చెమట తగ్గుతుంది. శరీరం దుర్వాసన రాకుండా ఉంటుంది. చర్మంపై ఉండే మృత కణాలు, దుమ్ము, ధూళి పోయి చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. చందనం పొడిని కాస్త తీసుకుని నీటిలో కలిపి ముఖానికి రాయాలి. కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తే ఎండ వల్ల కందిపోయిన చర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. చర్మానికి చల్లదనం లభించడమే కాదు, నిగారింపు కూడా వస్తుంది.
చందనం పొడి, రోజ్ వాటర్ కలిపి ఫేస్ ప్యాక్‌లా చేసి కూడా ఉపయోగించవచ్చు. ఇది కూడా చర్మానికి మెరుపు తెస్తుంది. ముఖం కాంతివంతంగా యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. చందనంతో రోజూ బొట్టు పెట్టుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా చందనానికి ప్రత్యేక స్థానం కల్పించారు. ఆధ్యాత్మిక పరంగా చందనాన్ని ఉపయోగిస్తే శరీరానికి కొత్త శక్తి వస్తుంది. చందనంతో తయారు చేసిన కాటుకను పెట్టుకుంటే కళ్లకు చలువ కలుగుతుంది. కళ్ల మంటలు, దురద, ఎరుపెక్కడం వంటి సమస్యలు తగ్గుతాయి. రాత్రి పూట కాస్త చందన తైలాన్ని మీరు పడుకునే బెడ్‌పై లేదా దిండుపై చల్లితే ఆ వాసనకు హాయి కలుగుతుంది. మైండ్ ప్రశాంతంగా మారి నిద్ర చక్కగా పడుతుంది. ఇలా చందనం లేదా చందనం నూనెతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు.