Aloe Vera For Beauty | చాలా మంది ఇళ్లలో కలబందను పెంచుకుంటారు. ఆయుర్వేద ప్రకారం కలబంద ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని పలు ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. అలాగే సౌందర్య సాధన ఉత్పత్తుల్లోనూ కలబందను వాడుతారు. కలబందలో ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు. ఇది చర్మ కణాలను అభివృద్ధి చేస్తుంది. ఉన్న కణాలకు మరమ్మత్తులు చేస్తుంది. గాయాలు, పుండ్లను మానేలా చేయడంలో ఎంతగానో సహాయం చేస్తుంది. కలబందలో సహజసిద్ధమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. కనుక చర్మానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ, బి12 ఉంటాయి. అనేక మినరల్స్, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా కలబందలో అధికంగా ఉంటాయి. ఇవన్నీ చర్మాన్ని సంరక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
కలబంద గుజ్జులో సహజసిద్ధమైన హైడ్రేటింగ్ గుణాలు, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి చల్లదనాన్ని ఇస్తాయి. అందువల్ల అన్ని రకాల చర్మాలకు కలబంద ఎంతగానో పనిచేస్తుంది. ముఖ్యంగా సున్నితమైన లేదా ఇర్రిటేషన్ ఉన్న, ఎండ వల్ల కందిపోయిన చర్మాన్ని తిరిగి పూర్వ రూపం వచ్చేలా చేస్తుంది. కొద్దిగా కలబంద గుజ్జును ఆకుల్లోంచి సేకరించాలి. దీన్ని మీ ముఖంపై నేరుగా అప్లై చేయాలి. మెడపై కూడా రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు వేచి ఉండాలి. లేదా రాత్రి పూట రాసి ఉదయం కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. మెడపై ఉండే నల్లదనం తగ్గుతుంది.
కలబందలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు, నీరు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి చల్లదనాన్ని ఇస్తాయి. అందువల్ల ఎండ కారణంగా కందిపోయిన చర్మానికి హాయి లభిస్తుంది. చర్మం త్వరగా మరమ్మత్తులకు గురవుతుంది. దీంతో ఎరుపుదనం తగ్గిపోతుంది. ఎండ వల్ల కందిపోయిన చర్మంపై నేరుగా కలబంద గుజ్జును రాయాలి. కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా రోజులో 2 నుంచి 3 సార్లు చేస్తుంటే చర్మం తిరిగి పూర్వ రూపాన్ని పొందుతుంది. మొటిమలను తగ్గించడంలోనూ కలబంద బాగానే పనిచేస్తుంది. ఇందుకు గాను 1 టేబుల్ స్పూన్ కలబంద రసంలో 2 నుంచి 3 చుక్కుల నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని మొటిమలు లేదా మచ్చలపై రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మొటిమలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
కలబందను వాడడం వల్ల చర్మం తన సహజసిద్ధమైన సాగే గుణాన్ని అలాగే ఉండేలా చేస్తుంది. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. కలబంద గుజ్జులో కొన్ని చుక్కల విటమిన్ ఇ ఆయిల్‌ను కలిపి ముఖానికి మాస్క్ లా వేస్తుండాలి. దీంతో యవ్వనంగా కనిపిస్తారు. ముఖం కాంతివంతంగా మారుతుంది. కలబందను ఉపయోగించి ఫేస్ మాస్క్‌ను కూడా తయారు చేయవచ్చు. ఇందుకు గాను 1 టేబుల్ స్పూన్ కలబంద గుజ్జులో కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పెరుగు లేదా పాలు కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేయాలి. దీన్ని ముఖానికి రాసి 10 నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఈ ప్యాక్ వల్ల ముఖంపై ఉండే మృత కణాలు పోతాయి. ముఖానికి సహజసిద్ధమైన నిగారింపు వస్తుంది. ఇలా కలబందను ఉపయోగించి అందాన్ని మరింత మెరుగు పరుచుకోవచ్చు.