Pineapple | పైనాపిల్ పండ్లు మనకు దాదాపుగా ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉంటాయి. ఈ పండ్లను నేరుగా తినలేరు. కానీ జ్యూస్ చేసుకుని మాత్రం తాగుతారు. అయితే పైనాపిల్ పండ్లను నేరుగా తింటే నాలుక పగిలినట్లు అవుతుంది. అందుకనే ఈ పండ్లను నేరుగా తినేందుకు ఇష్టపడరు. పైనాపిల్ పండ్లలో బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. అందుకనే ఈ పండ్లను తింటే నాలుక పగిలినట్లు అవుతుంది. అయితే ఇలా జరగకుండా ఉండాలంటే ఈ పండ్ల ముక్కలపై కాస్త ఉప్పు చల్లి తినాలి. లేదా పైనాపిల్ ముక్కలను పెనంపై కాస్త వేయించి రోస్ట్‌లా చేసి తినాలి. దీంతో బ్రొమెలెయిన్ ప్రభావం తగ్గుతుంది. నాలుక పగలదు. ఇక పైనాపిల్ పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. దీంతో అనేక లాభాలు కలుగుతాయని అంటున్నారు.
పైనాపిల్ పండ్లలో ఉండే బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు సహాయం చేస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్లను త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. అందువల్ల నాన్ వెజ్ వంటి ఆహారాలను తింటే సులభంగా జీర్ణం అయ్యేందుకు గాను పైనాపిల్ ముక్కలను తినాలి. ఈ పండ్లను తింటే అజీర్తి తగ్గుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. అలాగే గ్యాస్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. పైనాపిల్ పండ్లను రోజుకు ఒక కప్పు మోతాదులో తింటే మనకు రోజుకు కావల్సిన విటమిన్ సిలో 100 శాతం లభిస్తుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
పైనాపిల్ పండ్లలో ఉండే బ్రొమెలెయిన్ అనే ఎంజైమ్ యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటుంది. అందువల్ల ఈ పండ్లను తింటే శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవాలంటే పైనాపిల్ పండ్లను రోజూ తింటుండాలి. దీంతో ఎంతో మేలు జరుగుతుంది. పైనాపిల్ పండ్లలో మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది ఎముకల నిర్మాణానికి దోహదం చేస్తుంది. ఎముకలు దృఢంగా మారేలా చూస్తుంది. పైనాపిల్ పండ్లను రోజూ ఒక కప్పు మోతాదులో తింటే చాలు మనకు రోజుకు కావల్సిన మాంగనీస్ లభిస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లలో విటమిన్ సితోపాటు ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి కణాలను రక్షిస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులు తగ్గుతాయి. దీని వల్ల గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు.
పైనాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. శ్వాస నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి గాలి సరిగ్గా లభిస్తుంది. అయితే పైనాపిల్ పండ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ రోజుకు ఒక కప్పుకు మించి తినరాదు. తింటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పొట్టలో అసౌకర్యం ఏర్పడుతుంది. కొందరికి పైనాపిల్ పండ్లలో ఉండే బ్రొమెలెయిన్ పడదు. వికారం, వాంతులను కలగజేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారు కూడా ఈ పండ్లను తినకూడదు.