మోకాళ్ల నొప్పులు వృద్ధాప్య సమస్యల్లో ఒకటిగా చెప్పుకొనేవారు. అదంతా ఒకప్పుడు. ఇప్పుడు నలభై ఏళ్లకే మోకాళ్లే కాదు ఇతర కీళ్లలోనూ నొప్పులతో తిప్పలు పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ సమస్యకు సకాలంలో చికిత్స చేయకపోతే శస్త్ర చికిత్స చేయాల్సిందే. ప్రారంభంలోనే పీఆర్పీ థెరపీతో కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ కీళ్ల నొప్పులకు కారణాలు ఏమిటి? నొప్పికి ముందే వాటిని ఎలా గుర్తించాలి? ఆపరేషన్ లేకుండానే పీఆర్పీ థెరపీతో ఎలా నివారించవచ్చో నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులు వయసుతో సంబంధం ఉన్న వ్యాధుల్లో ఒకటిగా వైద్యులు గుర్తించారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులతో కీళ్ల నొప్పులకూ వయోసడలింపు వచ్చేసింది. అరవైకి ఇరవై ఏళ్ల ముందే మోకాళ్ల నొప్పులు బాధిస్తున్నవారు నానాటికీ పెరుగుతున్నారు. మోకీళ్లే కాదు భుజం నొప్పి, వెన్ను నొప్పి, తుంటి నొప్పి… ఇలా శరీరంలోని కీళ్ల నొప్పులతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. కీళ్ల నొప్పులకు జీవన శైలి, ఆహారమే కాదు నిర్లక్ష్యమూ ఓ కారణమే.
కొందరిలో మోకాలి కీలులోని కార్టిలేజ్ అరుగుతుంది. దీని వల్ల కీళ్లలోని ఎముకల మధ్య రాపిడి జరుగుతుంది. అప్పుడు కీలులో నొప్పి కలుగుతుంది. ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. ఈ నొప్పి వల్ల రోగి లేవడం, నడవడం కష్టంగా ఉంటుంది. వయసు రీత్యా వచ్చే ఈ సమస్యను ప్రారంభదశలోనే గుర్తించి, పీఆర్పీ థెరపీ చేస్తే.. సర్జరీ అవసరమే ఉండదు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే, రోగం ముదిరిన తర్వాత చికిత్స చేయాలంటే శస్త్ర చికిత్స ద్వారా కీలు మార్పిడి చేయడమే పరిష్కారం.
భుజాల్లోని టెండాన్ (ఎముకను అతుక్కుని ఉండే కండరాల అంచు)కు పగుళ్లు రావడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. అంటే ఎముకను అతుక్కునే కండరం చివరి భాగం దెబ్బతిని, ఎర్రగా మారుతుంది. అందువల్ల భుజంలో నొప్పి కలుగుతుంది. చేతిని అటూ, ఇటూ, పైకి, కిందికి కదిలించేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. సమస్య తీవ్రంగా ఉంటే చేయి కదిలించడం కష్టం. చేతిని కదల్చలేని ‘ఫ్రొజన్ షోల్డర్’ అంటారు. ఈ సమస్యను సకాలంలో గుర్తిస్తే పీఆర్పీ థెరపీతో నివారించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే సర్జరీ తప్పదు.
కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ వినియోగించడం వల్ల ఈ సమస్యతో బాధపడే రోగుల సంఖ్య కోవిడ్ తర్వాత పెరిగింది. స్టెరాయిడ్స్ వాడితే తుంటిలోని కీళ్లలో రక్త ప్రసరణ తగ్గుతుంది. తుంటిలోని ఎముక కుళ్లుతుంది. నొప్పి తీవ్రంగా బాధిస్తుంది. తుంటిని కదిలించలేరు. ఈ సమస్య చిన్న వయసులో వస్తే వారికి పీఆర్పీ చికిత్స ఉత్తమమైన పద్ధతి.
మోచేతిలోని ఒక చిన్న ఎముకతో ఐదు కండరాలు అనుసంధానమవుతాయి. ఈ కండరాలను ‘కామన్ ఎక్స్టెన్షన్ టెండాన్’ అంటారు. ఆటలు ఆడినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ కండరాలు ఎముకతో అనుసంధానమైన చోట పగుళ్లు ఏర్పడతాయి. అందువల్ల తీవ్రమైన నొప్పి కలుగుతుంది. ఆటలు ఆడలేరు. అలాంటి వారికి శస్త్ర చికిత్స అందుబాటులో లేదు. వారికి పీఆర్పీ థెరపీతో ఉపశమనం ఉంటుంది.
అరికాళ్లలో నొప్పి (మడమ నొప్పి)ని ‘ప్లాంటార్ ఫేషి ఐటీస్’ అంటారు. ఎక్కువగా నడవడం వల్ల, చెప్పులు లేకుండా పనిచేయడం వల్ల, గరుకు ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవడటం వల్ల మడమలో ప్లాంటర్ పొర తెగుతుంది. అప్పుడు మడమ (అరికాళ్ల)లో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. నడవడం కష్టమవుతుంది. ఈ సమస్యకు కూడా సర్జరీ లేదు. పీఆర్పీ థెరపీ చక్కటి పరిష్కారం.
కొంతమంది 30 నుంచి 40 ఏళ్ళ మధ్య వయసులో జాయింట్ పెయిన్స్ వస్తే.. అవగాహన లేక పట్టించుకోరు. ఉపశమనం కోసం ఆయింట్మెంట్లు రాసుకుంటారు. నూనెలతో మర్దనా చేసుకుంటారు. కొంతమంది నొప్పుల మాత్రలు వాడతారు. ఇవి వాడటం వల్ల తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. కొన్నిరోజుల తర్వాత సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. ఇంకొందరు కొన్ని ప్రత్యేక వ్యాయామాల ద్వారా తగ్గించుకోవచ్చని ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాయామాలతో కీళ్ల నొప్పులు తగ్గకపోవడమే కాకుండా తీవ్రమవుతాయి. అందుకని తరచూ నొప్పులు వచ్చినా లేక దీర్ఘకాలంగా నొప్పులు బాధిస్తున్నా వైద్యులను సంప్రదించాలి. ఎక్స్‌రే లేదా స్కానింగ్ తీయించుకోవాలి. ఇబ్బందిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పీఆర్పీ థెరపీతో ఆదిలోనే సమస్యకు అడ్డుకట్ట వేయవచ్చు.
‘ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా’ థెరపీని ‘పీఆర్పీ థెరపీ’ అంటారు. ఇది పాత చికిత్సా పద్ధతే! కొన్ని కారణాల వల్ల ఈ పద్ధతి ప్రాచుర్యంలో లేదు. ఐదారేళ్ల నుంచి ఈ చికిత్సా విధానానికి ఆదరణ పెరుగుతున్నది. ఈ థెరపీ గురించి అనేక పరిశోధనలు జరిగాయి. మెరుగైన ఫలితాలు గుర్తించడంతో దీనికి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ పీఆర్పీ చికిత్సా పద్ధతిలో రోగి నుంచి 20 మిల్లీ లీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. ఆ రక్తాన్ని ఒక టెస్ట్ ట్యూబ్‌లో నింపిన తర్వాత పీఆర్పీ సెంట్రిఫ్యూజ్ మెషిన్లో తిప్పుతారు. రక్తం నుంచి ‘గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్’ వేరవుతాయి. ఈ సెల్స్‌ను దెబ్బతిన్న కీలు భాగంలోకి ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. కార్టిలేజ్ దెబ్బతిన్న భాగంలోకి గ్రోత్ ఫ్యాక్టర్ సెల్స్’ని పంపడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. కార్టిలేజ్ రీ మోడలింగ్ (పునరుత్పత్తి) జరుగుతుంది.
ఈ విధంగా సమస్య తీవ్రతను బట్టి రెండు లేదా మూడు సార్లు పీఆర్పీ థెరపీ చేయాల్సిన అవసరం ఉంటుంది. థెరపీ అనంతరం మూడు నుంచి నాలుగు నెలలపాటు వైద్యుల పరిశీలన (ఫాలో అప్) అవసరం. థెరపీ అనంతరం కొన్ని జాగ్రత్తలు, ఆహార నియమాలు పాటించాలి. వైద్యులు సూచించిన వ్యాయామాలు చేయాలి. క్రీడల్లో గాయపడ్డవారికి కూడా పీఆర్పీ థెరపీ మంచి ఫలితాలు ఇస్తుంది.