Sprouts | మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అనేక బలవర్ధకమైన ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో మొలకలు కూడా ఒకటి. పెసలు, పల్లీలు, శనగలు తదితర గింజలను నీటిలో నానబెట్టి వాటితో మొలకలను తయారు చేస్తారు. మొలకలు చాలా బలవర్ధకమైన ఆహారంగా చెప్పవచ్చు. కానీ చాలా మంది వీటిని తినేందుకు అంతగా ఆసక్తిని చూపించరు. మొలకలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. మొలకలను చాలా మంది సాధారణంగా బయట కొంటుంటారు. కానీ కాస్త శ్రమిస్తే వీటిని ఇంట్లోనే మనం ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. మొలకలను తయారు చేసేందుకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. అన్ని రకాల గింజలను కొంత మోతాదులో తీసుకుని అన్నింటినీ కలిపి చాలా సులభంగా మొలకలను తయారు చేయవచ్చు.
ఆయా గింజలను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని ముందుగా 8 నుంచి 10 గంటల పాటు నీటిలో నానబెట్టాల్సి ఉంటుంది. తరువాత వాటిని నీటి నుంచి తీసి శుభ్రమైన వస్త్రంలో ఉంచి చుట్టాలి. అనంతరం వాటిని ఒక పాత్రలో ఉంచి మీద మూత పెట్టాలి. 24 నుంచి 48 గంటల పాటు వేచి చూస్తే ఆ గింజలకు మొలకలు వస్తాయి. తరువాత వాటిని తీసి మళ్లీ కాస్త కడిగి అనంతరం వాటిని తినవచ్చు. ఇలా ఇంట్లోనే సులభంగా మొలకలను తయారు చేసుకోవచ్చు. అయితే మనం ఎంచుకునే గింజలను బట్టి అవి మొలకలుగా మారేందుకు సమయం పడుతుంది. పల్లీలు, పెసలు, శనగలు దాదాపుగా ఒకే సమయంలో మొలకలుగా మారుతాయి. కనుక వీటిని అన్నింటినీ ఒకేసారి నానబెట్టి ఒకేసారి మొలకలుగా మార్చేందుకు వస్త్రంలో చుట్టి ఉంచవచ్చు. కానీ ఇతర గింజలకు మాత్రం ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది. కనుక అలాంటి గింజలను విడిగా నానబెట్టి మొలకలుగా మార్చాల్సి ఉంటుంది.
మొలకలను నేరుగా తినేందుకు కొందరు ఇష్టపడరు. అలాంటి వారు మొలకలను పెనంపై కాస్త వేయించి ఉప్పు, కారం లేదా మిరియాల పొడి వంటివి చల్లి తినవచ్చు. లేదా సలాడ్ రూపంలో మొలకలను తయారు చేసి తినవచ్చు. అయితే మొలకలను ఎట్టి పరిస్థితిలోనూ శుభ్రంగా కడిగిన తరువాతే తినాల్సి ఉంటుంది. సాధారణంగా మొలకలు బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. కనుక అలాగే తింటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక మొలకలను బాగా కడిగాకే తినాల్సి ఉంటుంది. మొలకలపై మిరియాల పొడి, నిమ్మరసం, నల్ల ఉప్పు వంటివి చల్లి తింటే ఎంతో రుచిగా ఉండడమే కాదు, ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మొలకల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక ఇవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. అందువల్ల వీటిని కేవలం ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలోనే తినాల్సి ఉంటుంది. రాత్రి పూట తినకూడదు. సాయంత్రం వ్యాయామం చేసేవారు వ్యాయామం చేశాక వీటిని తినవచ్చు.
మొలకలను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. భిన్న రకాల గింజలతో మొలకలను తయారు చేసి తింటే ఒకేసారి పెద్ద ఎత్తున పోషకాలను పొందవచ్చు. మొలకలను తింటే ప్రోటీన్లు పెద్ద ఎత్తున లభిస్తాయి. అలాగే ఫోలేట్, మెగ్నిషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, విటమిన్లు సి, కె అధికంగా లభిస్తాయి. మొలకల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు రోజూ మొలకలను తింటుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. మొలకల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గించడంతోపాటు అధిక బరువు తగ్గేలా చేస్తుంది. ఇలా మొలకలను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.