Cashew Milk | జీడిపప్పును మనం తరచూ తింటూనే ఉంటాం. వీటిని తీపి పదార్థాల తయారీలో వాడుతారు. మసాలా వంటకాల్లోనూ జీడిపప్పును వేస్తుంటారు. దీని వల్ల వంటకాలకు చక్కని రంగు, రుచి వస్తాయి. జీడిపప్పును నేరుగా లేదా వేయించుకుని కూడా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అయితే ఈ పప్పును తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. కనుక రోజూ ఈ పప్పును గుప్పెడు మోతాదులో తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తుంటారు. అయితే జీడిపప్పును నేరుగా కాకుండా వీటితో పాలను తయారు చేసి కూడా తీసుకోవచ్చు. జీడిపప్పు పాలు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. అనేక పోషకాలను అందిస్తాయి. జీడిపప్పు పాలను రోజూ ఒక కప్పు మోతాదులో ఉదయం తాగుతుంటే ఎంతో మేలు జరుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జీడిపప్పును రోజూ నేరుగా తినలేమని అనుకునేవారు వీటితో పాలను తయారు చేసి రోజూ తాగితే ఎంతో లాభం ఉంటుందని అంటున్నారు.
జీడిపప్పుల్లో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. కనుక జీడిపప్పు పాలను రోజూ సేవిస్తుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పులో మెగ్నిషియం, పొటాషియం అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి బీపీని నియంత్రిస్తాయి. కనుక ఈ పాలను రోజూ తాగుతుంటే హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. జీడిపప్పులో మెగ్నిషియం, కాపర్, విటమిన్ కె, క్యాల్షియం, విటమిన్ డి అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. కనుక ఈ పాలను రోజూ తాగుతుంటే ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
జీడిపప్పులో లుటీన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటిలోని రెటీనాను రక్షిస్తాయి. దీని వల్ల కళ్లలోని కణాలకు జరిగే నష్టం నివారించబడుతుంది. దీంతో వృద్ధాప్యంలో కళ్లలో శుక్లాలు రాకుండా చూసుకోవచ్చు. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. జీడిపప్పు పాలలో కాపర్ అధిక మొత్తంలో లభిస్తుంది. ఇది మన శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. జీడిపప్పు పాలలో జింక్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీని వల్ల సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వ్యాధులు, ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. జీడిపప్పు పాలలో అధికంగా ఉండే ఐరన్, కాపర్ ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందేలా చేస్తాయి. దీంతో రక్తహీనత తగ్గుతుంది.
ఇక జీడిపప్పు పాలను ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట మార్కెట్లో లభించే జీడిపప్పు పాలను తాగాల్సిన పనిలేదు. జీడిపప్పు పాలను తయారు చేసేందుకు గాను 1 కప్పు జీడిపప్పు, 4 కప్పుల నీళ్లు, పప్పును నానబెట్టేందుకు మరి కొన్ని నీళ్లు, చిటికెడు సముద్రపు ఉప్పు, ఒక టీస్పూన్ తేనె (రుచి కోసం) తీసుకోవాలి. ముందుగా జీడిపప్పును నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. లేదా కనీసం 4 గంటలపాటు అయినా నానబెట్టాలి. తరువాత వాటిని తీసి 4 కప్పుల నీళ్లను పోసి అందులోనే ఉప్పు, తేనె వేసి కలిపి ఆ మిశ్రమాన్ని బ్లెండర్లో వేసి మెత్తగా పట్టుకోవాలి. దీంతో క్రీమ్ లాంటి మెత్తని పేస్ట్ లా ఉండే పాలు రెడీ అవుతాయి. అవసరం అనుకుంటే ఇంకొన్ని నీళ్లను కలుపుకోవచ్చు. ఇలా జీడిపప్పు పాలను తయారు చేసి గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పాలను తాగవచ్చు. ఈ పాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనంతరం సేవిస్తే ఎంతో ఫలితం ఉంటుంది. ఇలా జీడిపప్పు పాలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.