How To Increase Iron Levels In Body | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అనేక పోషకాలు అవసరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాంటి పోషకాల్లో ఐరన్ కూడా ఒకటి. ఇది చాలా ముఖ్యమైన పోషక పదార్థం. దీని వల్ల శరీరంలో రక్త కణాలు తయారవుతాయి. అయితే శరీరంలో ఐరన్ లోపిస్తే అప్పుడు మనకు శరీరం పలు సంకేతాలను చూపిస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపించడం వల్ల శక్తి స్థాయిలు తగ్గుతాయి. అలాగే చిన్న పని చేసినా చాలు తీవ్రంగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఇలా గనక ఎవరిలో అయినా లక్షణాలు ఉంటే ఐరన్ లోపం ఉన్నట్లు భావించాలి. అయితే కేవలం ఒక్క వారం రోజుల్లోనే మీ శరీరంలోని ఐరన్ లెవల్స్‌ను అమాంతం పెంచుకోవచ్చు. ఇందుకు పలు పనులను చేయాల్సి ఉంటుంది.
అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) చెబుతున్న ప్రకారం 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి రోజుకు 11 మిల్లీగ్రాముల వరకు ఐరన్ అవసరం అవుతుంది. ఇది పురుషులకు మాత్రమే. అదే స్త్రీలకు అయితే 15 మిల్లీగ్రాములు అవసరం అవుతుంది. ఇక 19 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పురుషులకు రోజుకు 8 మిల్లీగ్రాములు, స్త్రీలకు 18 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం. గర్భిణీలకు రోజుకు 27 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం ఉంటుంది.
అయితే శరీరంలో ఐరన్ లెవల్స్ అమాంతం పెరగాలంటే అందుకు పలు రకాల ఫుడ్స్ మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా చికెన్, మటన్ తినడం వల్ల ఐరన్ లెవల్స్‌ను అమాంతం పెంచుకోవచ్చు. నాన్ వెజ్ తినలేమని అనుకునేవారు పాలకూర, పప్పు దినుసులు, నట్స్, విత్తనాలు తినవచ్చు. దీంతో శరీరంలో ఐరన్ పుష్కలంగా పెరుగుతుంది. కేవలం ఒక్క వారం రోజుల్లోనే మీరు తేడాను గమనిస్తారు.
అయితే మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకోవాలంటే అందుకు విటమిన్ సి ఎంతగానో దోహద పడుతుంది. కనుక ఐరన్ ఉండే ఆహారాలతోపాటు విటమిన్ సి ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా శోషించుకుంటుది. మీరు తినే పాలకూర లేదా ఇతర ఆహారాలపై కాస్త నిమ్మరసం పిండి తింటే చాలు, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
అయితే కొన్ని రకాల ఫుడ్స్‌ను తీసుకోవడం వల్ల శరీరం ఐరన్ ను సరిగ్గా శోషించుకోలేదు. ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నవారు కాఫీ లేదా టీ తాగకూడదు. ఈ రెండింటిలోనూ ఉండే కెఫీన్, టానిన్స్ అనే సమ్మేళనాలు శరీరం ఐరన్‌ను శోషించుకోకుండా అడ్డుపడతాయి. కనుక ఈ పానీయాలను తీసుకోరాదు. అలాగే క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలను కూడా ఐరన్ ఆహారాలతో కలిపి ఒకేసారి తినకూడదు. కాస్త విరామం ఇచ్చి తీసుకోవాలి. ఈ సూచనలు పాటించడం వల్ల శరీరం ఐరన్‌ను ఎక్కువగా శోషించుకుంటుంది.
ఇక మనం తినే ఆహారాల వల్ల లభించే ఐరన్ సరిపోకపోతే అప్పుడు డాక్టర్‌ను కలిసి ఐరన్ ట్యాబ్లెట్లను వాడుకోవచ్చు. వీటిని ఎట్టి పరిస్థితిలోనూ సొంతంగా వాడరాదు. లేదంటే సమస్యలు వస్తాయి. మీ ఇంట్లో వంట పాత్రలు నాన్ స్టిక్ కుక్ వేర్ కాకుండా ఐరన్‌తో చేసిన పాత్రలను వాడండి. దీంతో కూడా మనం తినే ఆహారాల్లోకి ఐరన్ చేరుతుంది. అది అక్కడి నుంచి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ విధంగా ఐరన్ లోపం సమస్య నుంచి బయట పడవచ్చు.