గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్లే వెన్నునొప్పి వస్తుందనుకుంటున్నారా? అది పూర్తిగా నిజం కాదు. మీ మెదడులో ఉండే ఒత్తిడి వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. అవును.. మీ ఆలోచనలు, మానసిక ఒత్తిడి కూడా వెన్నునొప్పికి, వెన్నెముక సమస్యలకు దారి తీయవచ్చు. దీన్నే స్పైన్ స్ట్రెస్ అంటున్నారు వైద్యులు. మనం సాధారణంగా భౌతికమైన వాటిపైనే దృష్టి పెడతాం. కానీ, మానసిక ఆరోగ్యం కూడా శారీరక సమస్యలకు దారి తీస్తుందని ఊహించం. వెన్నునొప్పితో సతమతం అవుతున్న వారంతా.. కేవలం వర్క్స్టైల్ బాధితులు మాత్రమే కాదనీ, ఒత్తిడికి గురవుతున్నవారూ ఇందులో ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

వెన్నునొప్పికి ఒత్తిడి ఎలా కారణం అవుతుంది? ఎందుకంటే, మన నాడీ వ్యవస్థకు, భావోద్వేగాలకు చాలా సంబంధం ఉంది. మనిషి సైకాలజీ, కండరాల ఆరోగ్యం బలంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మనిషి ఒత్తిడి లేదా ఆందోళనలో ఉన్నప్పుడు, శరీరంలో కార్టిసోల్ లాంటి ఒత్తిడి హార్మోన్లు విడుదల అవుతాయి. మెడ, భుజాలు, వెన్నులో ఉండే కండరాలు నిరంతరం ఒత్తిడిలో ఉంటాయి. దీనివల్ల వెన్నెముక స్థిరత్వం తగ్గి, నొప్పి, బిగుతు వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో శరీరం విశ్రాంతి తీసుకోకపోతే… ఇది దీర్ఘకాలిక మెడ, వెన్నునొప్పికి దారి తీస్తుంది.

ఉన్నప్పుడు, శరీరం ముందుకు వంగిపోవడం (HunchBack) సహజం. ఈ భంగిమ మెదడుకు నెగెటివ్ సంకేతాలు పంపిస్తుంది. దీనిద్వారా మూడ్ పూర్తిగా మారిపోతుంది. దీంతో వెన్నుపై దుష్ప్రభావం పడుతుంది. ఇలా వంగిపోవడం వల్ల ఛాతీ కండరాలు కుచించుకుపోతాయి. దీంతో శ్వాస తీసుకోవడం తగ్గుతుంది. మెదడుకు ఆక్సిజన్ తక్కువగా చేరుతుంది. ఫలితంగా కండరాలు త్వరగా అలసటకు గురవుతాయి.
ఒత్తిడి వల్ల వచ్చే శారీరక నొప్పికి, సాధారణ కండరాల నొప్పికి తేడా ఉంటుంది.
కండరాల నొప్పి: ఏదైనా నిర్దుష్ట కదలిక లేదా భంగిమతో ముడిపడి ఉంటుంది.
ఒత్తిడి నొప్పి: ఇది ఎక్కడా ఒకే చోట కాకుండా, విస్తృతంగా ఉంటుంది. ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయాల్లో నొప్పి పెరుగుతుంది.
సంకేతాలు: ఈ నొప్పి మొదలయ్యే ముందు.. జీర్ణ సమస్యలు, తలనొప్పి, నిద్రలేమి రావచ్చు. కొన్నిసార్లు, ఎటువంటి గాయం లేకుండా కూడా వెన్నునొప్పి రావచ్చు. ఇలాంటివి ఎదురైనప్పుడు మీ వెన్ను సాయం అపేక్షిస్తుందని అర్థం చేసుకోండి.
చిన్నపాటి కదలికలు: చిన్న కదలికలు, సాధారణ వ్యాయామం, సరైన కుర్చీ వాడటం వెన్నెముకను బ్యాలెన్స్ చేయడానికి సాయం చేస్తాయి.
శారీరక, మానసిక బంధం: కొందరికి కౌన్సెలింగ్, ఫిజియోథెరపీ కూడా అవసరం కావచ్చు. ఇది ఆలోచన, భంగిమ మధ్య ఉన్న బంధాన్ని సరిచేస్తుంది.
30 సెకన్ల బ్రేక్: రోజులో కొన్నిసార్లు ‘postural reset’ తీసుకోండి. 30 సెకన్లు కేటాయించి నిటారుగా కూర్చోండి లేదా నిలబడండి. భుజాలను వెనక్కి, కిందికి తిప్పండి. మూడు సార్లు లోతైన శ్వాస తీసుకోండి. ఈ పద్ధతులు ఆందోళనను, నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది.