Health Tips | మా అమ్మాయి వయసు ఇరవై ఒకటి. కడుపులో కణుతులున్నాయనీ, వెంటనే ఆపరేషన్ చేయాలనీ డాక్టర్లు చెప్పారు. కానీ సర్జరీలో ఒక ఓవరీ కూడా తీసేశారు. దీనివల్ల, మా అమ్మాయి గర్భం ధరించే అవకాశం ఉందా? వరుడికి ఈ విషయం చెప్పాలా, వద్దా?
మీ అమ్మాయికి ఆపరేషన్ తర్వాత.. నెలసరి సక్రమంగా వస్తున్నదా? వస్తున్నట్టుఅయితే.. భయపడాల్సిన పన్లేదు. అయితే గర్భం విషయంలో స్పష్టత రావాలంటే, ముందు మరో అండాశయం పరిస్థితి ఏమిటన్నది పరిశీలించాలి. ఆ ఓవరీలో ఎన్ని గుడ్లు ఉన్నాయి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాయనేది పరీక్షించి చూడాలి. వాటి సంఖ్య, నాణ్యతను బట్టి గర్భధారణ అవకాశాలను నిర్ధారిస్తారు. మరో అండాశయం ఆరోగ్యంగా ఉంటే సాధారణంగానే గర్భం ధరించవచ్చు. కాబట్టి, రిపోర్టులు తీసుకుని మంచి గైనకాలజిస్టుని సంప్రదించండి. ఇక, పెండ్లి విషయానికి వస్తే.. ఆపరేషన్ సంగతి ముందుగానే చెప్పండి. తప్పక అర్థం చేసుకుంటారు.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్