డయాబెటిస్… దాదాపు ప్రతి ఇంట్లో వినిపించే జీవనశైలి ప్రధానమైన జబ్బు. ఇది ఒక్కసారి వస్తే జీవితాంతం వదలదు. బతికినంత కాలం మందులు వాడాల్సిందే. అయితే, ఇది నిన్నటి మాట. వచ్చిన రోగాన్ని తిరిగి వెనక్కి పంపించవచ్చనేది నేటి భరోసా! అవును ఇది అక్షరాల నిజమే. డయాబెటిస్‌ను నియంత్రించడమే కాకుండా వ్యాధిని వెనక్కి తిప్పి కొట్టవచ్చంటున్నారు వైద్యరంగ నిపుణులు. దీనికి కొన్ని నియమ నిబంధనలు, వయసు పరిమితి, వ్యాధి వచ్చిన కాలపరిమితి లాంటివి కీలకం అని చెబుతున్నారు. ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత రివర్సల్ డయాబెటిస్ ఎలా సాధ్యం, అందుకు పాటించాల్సిన ఆరోగ్య నియమాలు, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
డయాబెటిస్ అంటే రక్తంలో చక్కెర (బ్లడ్ గ్లూకోజ్) స్థాయులు పెరగడం. 80వ దశకానికి ముందు డయాబెటిస్ అనే సమస్య ఒకటి ఉందనే విషయం చాలామందికి తెలియదు. కాలక్రమేణా ఈ సమస్య 60 ఏండ్లు పైబడిన వారికి, బాగా డబ్బున్నవాళ్లలో మాత్రమే ఎక్కువగా కనిపించేది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఉరుకులు పరుగుల ఉద్యోగాలు తదితర కారణాలతో ప్రస్తుతం ఈ వ్యాధి వయసు, ఆర్థిక స్థాయి, లింగ భేదంతో సంబంధం లేకుండా అందరిలోనూ వస్తున్నది. పిల్లల్లో జువైనల్ డయాబెటిస్‌గా లేదా టైప్-1 డయాబెటిస్గాను, పెద్దల్లో ఎక్కువ శాతం టైప్-2 డయాబెటిస్ రూపంలో దాడి చేస్తుంది.
శాస్త్రీయంగా చూస్తే డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణం క్లోమగ్రంథిలోని బీటా కణాలు అవసరమైనంత మోతాదులో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడం. లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం. వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించిన కారణం వల్ల చిన్నారుల్లో కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. బీటా కణాలు పనిచేయకపోవడం పిల్లల్లో అసలు ఇన్సులిన్ తయారు కాదు. అందువల్ల వీళ్లకు తప్పనిసరిగా ఇన్సులిన్ ఇంజెక్షన్లు అవసరం అవుతాయి. పెద్దవారిలో సర్వసాధారణంగా కనిపించేది రెండో రకం డయాబెటిస్. 90 శాతం మంది మధుమేహులు టైప్-2 ఉన్నవారే. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల దీన్ని నియంత్రించవచ్చు. స్థూలకాయం ఉన్న కొందరు మహిళల్లో గర్భిణిగా ఉన్నప్పుడు కనిపించేది జెస్టేషనల్ డయాబెటిస్. ఇది తాత్కాలికమే అయినప్పటికీ దీర్ఘకాలంలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ.
టైప్-2 డయాబెటిస్ ఉన్న రోగుల్లో మాత్రమే రివర్సల్ డయాబెటిస్ సాధ్యపడుతుంది. అంటే వ్యాధిని వెనక్కి పంపవచ్చు. టైప్-1 వారిలో రివర్సల్ డయాబెటిస్ సాధ్యపడదు.
షుగర్ వ్యాధి వచ్చిన రెండు సంవత్సరాల్లోపు, లేదా ప్రీ డయాబెటిస్ దశలో రివర్సల్ డయాబెటిస్ సాధ్యమవుతుంది. అంటే వచ్చిన రోగాన్ని వెనక్కి పంపవచ్చు. ఈ రివర్సల్ డయాబెటిస్ అనేది గతంలో కూడా ఉన్నది. కాకపోతే అప్పుడు అందుబాటులో ఉన్న మందులతో అది పెద్దగా సాధ్యపడలేదు. ప్రాచుర్యంలోకి కూడా రాలేదు. గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ రివర్సల్ డయాబెటిస్‌పై దృష్టి పెట్టారు. వైద్యరంగంలో వస్తున్న మార్పుల్లో భాగంగా ప్రస్తుతం ఊబకాయం కోసం కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి సాయంతో రివర్సల్ డయాబెటిస్ మంచి ఫలితాలు ఇస్తున్నది. జీవనశైలిలో మార్పులతోపాటు కొన్ని రకాల మందులతో రివర్సల్ డయాబెటిస్ సాధ్యపడుతుంది.
పరగడుపున (అల్పహారానికి ముందు) ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ స్థాయులు 100 ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా ఉండాలి.
భోజనం చేసిన రెండు గంటల్లోపు పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ స్థాయులు 140ఎంజీ/డీఎల్‌గా ఉండాలి.
షుగర్ వ్యాధి వచ్చి, మందులు వాడుతున్న వారికి లేదా ప్రీ-డయాబెటిస్ రోగులకు రివర్సల్ డయాబెటిస్ చికిత్స అందించవచ్చు. అయితే ఇది అందరికీ సాధ్యపడదు. వ్యాధి వచ్చిన రెండేండ్ల లోపు వారిలో మాత్రమే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇక చికిత్స విధానంలోకి వెళ్తే షుగర్ వ్యాధిగ్రస్తులు డయాబెటిస్ మందులు వాడుతూనే వైద్యుల సూచన మేరకు ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు కూడా చేసుకోవాలి. అంతేకాకుండా వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. దీనివల్ల నెమ్మదిగా షుగర్ అదుపులోకి వస్తుంది. మొదటి నెలలోనే ఫలితాలు కనిపించడం మొదలవుతుంది. వీరికి మొదటి మూడు నెలల వరకు ప్రతినెలా షుగర్ పరీక్షలు చేస్తూ పర్యవేక్షించాలి. ఆ తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ టెస్టు చేయాల్సి ఉంటుంది. అయితే వ్యాధి నియంత్రణలోకి వచ్చిన తర్వాత క్రమంగా మందుల మోతాదును తగ్గిస్తూ పోతారు. ఫాస్టింగ్ (పరగడుపున) బ్లడ్ గ్లూకోజ్ స్థాయులు 100ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా, పోస్ట్ ప్రాండియల్ (తిన్న రెండు గంటల తర్వాత) బ్లడ్ గ్లూకోజ్ స్థాయులు 140ఎంజీ/డీఎల్, హెచ్‌బీఏ-1సి శాతం 5.7కంటే తక్కువగా వచ్చిన తర్వాత డయాబెటిస్ మందులను పూర్తిగా నిలిపివేస్తారు.
డయాబెటిస్ మందులు మానేసిన 3 నెలల తర్వాత కూడా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ స్థాయులు 100ఎంజీ/డీఎల్ కంటే తక్కువగా, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ 140ఎంజీ/డీఎల్గాను, హెచ్‌బీఏ 1సి 5.7 శాతం కంటే తక్కువగా ఉంటే అప్పుడు రోగిని రివర్సల్ డయాబెటిస్ కింద పరిగణిస్తారు. అంటే షుగర్ వ్యాధి తగ్గినట్టుగా భావించవచ్చు. ప్రస్తుతం 10 మంది డయాబెటిస్ రోగులకు రివర్సల్ చికిత్స అందిస్తే అందులో ఆరుగురిలో వ్యాధి నియంత్రణలోకి రాగా ఇద్దరిలో రివర్సల్ డయాబెటిస్ ఫలితాలు వస్తున్నాయి. డైట్, బరువు, ఆహారపు అలవాట్లు మార్చుకుని, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రివర్సల్ డయాబెటిస్ సాధ్యమే! అంటే తాత్కాలికంగా షుగర్ తగ్గవచ్చు. ఈ సమయంలో షుగర్‌ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. అయితే, మందులు వాడాల్సిన అవసరం లేదు. పాంక్రియా (క్లోమగ్రంథి) సామర్థ్యం అధికంగా ఉండటం వల్ల షుగర్ స్థాయులు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఒక్కసారి వచ్చి, తగ్గిపోయిన తర్వాత మళ్లీ వచ్చే డయాబెటిస్‌ను రీ-రివర్స్ డయాబెటిస్ అంటారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లు సరిగ్గా పాటించకపోతే అప్పుడు మళ్లీ డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే రివర్సల్ డయాబెటిస్ ఫలించిన కొందరు రోగుల్లో ఆరు నెలలకే మళ్లీ రీ-రివర్స్ డయాబెటిస్ రావచ్చు. ఆరోగ్య నియమాలు తు.చ. తప్పకుండా పాటించే వారిలో కొన్ని సంవత్సరాల వరకు కూడా మళ్లీ డయాబెటిస్ రాకపోవచ్చు.
కుటుంబ నేపథ్యంలో డయాబెటిస్ బాధితులు ఉన్నవారు పై నియమాలు కచ్చితంగా పాటించాలి. ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలు లేదా వారంలో 150 నిమిషాలు వాకింగ్ లేదా రన్నింగ్ వంటివి చేయాలి. తల్లిదండ్రులకు షుగర్ ఉంటే వారి పిల్లలు తమ బరువును అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా డైట్‌ను కంట్రోల్ చేస్తే షుగర్ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు.
జీఎల్పి-1 ఎనలాక్ మందులు సిమాగ్నోగ్లుటైడ్, నీరాగ్లుటైడ్ తదితర మాలిక్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటివల్ల షుగర్ నియంత్రణలోకి వచ్చి ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. దీంతో బరువు తగ్గడమే కాకుండా షుగర్ కూడా నియంత్రణలోకి వస్తుంది. చివరగా వ్యాధి రివర్సల్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
– మహేశ్వర్‌రావు బండారి
– డాక్టర్ రాకేష్ బొప్పన ఎంబీబీఎస్, ఎండీ, డీఎం, ఎండోక్రైనాలజీ
డా.రాకేష్ ఎండోక్రైన్ &
డయాబెట్స్ సెంటర్
మణికొండ, హైదరాబాద్