Edible Camphor | హిందువులు పూజలు చేసేటప్పుడు పచ్చ కర్పూరాన్ని వాడుతుంటారు. వాస్తవానికి కర్పూరంలో రెండు రకాలు ఉంటాయి. దేవుడికి హారతి ఇచ్చే కర్పూరం వేరు. పచ్చ కర్పూరం వేరు. దీన్ని తినే కర్పూరం అని కూడా అంటారు. పూజల్లో పచ్చ కర్పూరానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి పూజలో పచ్చ కర్పూరాన్ని ఉపయోగిస్తారు. ఆయుర్వేద పరంగా కూడా పచ్చ కర్పూరం ఎన్నో లాభాలను అందిస్తుంది. ఇందులో అనేక ఔషధ విలువలు ఉంటాయి. పలు ఔషధాల తయారీలోనూ దీన్ని ఉపయోగిస్తారు. పచ్చ కర్పూరాన్ని బెల్లంతో కలిపి శనగ గింజలంత మాత్రలు చేసి తింటుంటే ఉబ్బసం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తమా ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
పచ్చ కర్పూరాన్ని మూత్ర మార్గం లోపలికి ప్రవేశపెడితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది. వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇలా చేయాలి. పచ్చ కర్పూరం పొడిని మర్రి పాలతో కలిపి కళ్లకు కాటుక మాదిరిగా పెట్టుకోవచ్చు. దీంతో కళ్లపై ఏర్పడే శుక్లాలు తగ్గిపోతాయి. కంటి చూపు మెరుగు పడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. పచ్చ కర్పూరాన్ని ఆవు నెయ్యితో కలిపి గాయమైన చోట, పుండు ఉన్న చోట రాసి కట్టు కడుతుంటే అవి త్వరగా మానుతాయి. చీము, వాపు, ఇన్ఫెక్షన్ అవకుండా ఉంటాయి. చెవి తమ్మెలకు సంబంధించిన వ్యాధులు, సమస్యలు ఉంటే ముందుగా ఆవు పిడకలను నిప్పుల మీద వేసి ధూపం వచ్చేలా చేసి చెవి తమ్మెలకు తగలనివ్వాలి. తరువాత కర్పూరాన్ని మేక మూత్రంతో కలిపి బాహ్యంగా చెవి తమ్మె మీద ప్రయోగించాలి. దీంతో సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
పచ్చ కర్పూరాన్ని పొడి చేసి నోట్లో ఉంచుకుని లాలాజలాన్ని మింగుతుంటే అతి దాహం తగ్గిపోతుంది. కర్పూరం నూనెలో దూదిని తడిపి కుష్టు వ్యాధి వల్ల ఏర్పడిన గాయం మీద రాస్తుంటే త్వరగా మానుతుంది. ఒక పెద్ద టీస్పూన్ ఆవ నూనెను వేడి చేయాలి. చిన్న ముక్క కర్పూరం, పావు టీస్పూన్ చందనం పొడిని కలిపి పొత్తి కడుపు మీద మర్దనా చేస్తుంటే కడుపులో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక పెద్ద టీస్పూన్ కర్పూరం పొడిని అర కప్పు కొబ్బరినూనెలో కలిపి ఛాతి మీద రాసి మర్దనా చేస్తుంటే ఉబ్బసం, ఆయాసం తగ్గుతాయి. ఒక పెద్ద టీస్పూన్ కర్పూరాన్ని అర కప్పు ఆలివ్ నూనెలో కలిపి వేడి చేసి అవసరమైన భాగంలో రాయాలి. దీంతో పుండ్లు ఏర్పడకుండా ఉంటాయి.
బ్రాంకైటిస్, జలుబు, జ్వరం, తలనొప్పి సమస్యలు ఉన్నవారు బాగా మరుగుతున్న నీటిలో కర్సూరం కలిపి ఆవిరి పడుతుండాలి. దీంతో ఆయా సమస్యల నుంచి త్వరగా కోలుకుంటారు. చిగుళ్ల వాపు, నోటి దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం లేదా చీము కారడం వంటి సమస్యలు ఉన్నవారు వేప చెట్టు పట్ట, లవంగాలు, కరక్కాయ పెచ్చుల చూర్ణం, మర్రిచెట్టు లేత ఊడలు, కర్పూరంను 1:1:3:6 నిష్పత్తిలో తీసుకోవాలి. వీటిని బాగా నూరి పొడిచేసి గాలి చొరబడని సీసాలో నిల్వయాలి. దీంతో దంతాలను రోజూ తోముకుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. ముక్కునుంచి రక్తం కారటం తగ్గాలంటే చిటికెడు కర్పూరం పొడిని చెంచాడు కొత్తిమీర రసానికి కలపాలి. చిన్న దూది ఉండను దీనిలో ముంచి రెండు ముక్కు రంధ్రాల్లోనూ బిందువులుగా వేసుకోవాలి. దీంతో సమస్య తగ్గుతుంది. ఇలా పచ్చ కర్పూరంతో అనేక ఇంటి చిట్కాలను పాటించవచ్చు. అయితే వైద్యుల సలహా మేరకు దీన్ని వాడుకోవడం మంచిది.