Heart Palpitations | కరోనా అనంతరం చాలా మందికి గుండె జబ్బులు వస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ టీకాల వల్లే ఇలా జరుగుతుందని చాలా మంది వాదిస్తున్నా ఇందులో ఇంకా స్పష్టత రాలేదు. అయితే కారణాలు ఏమున్నా ప్రస్తుతం చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చిన్న వయస్సులో ఉన్నవారు కూడా గుండె పోటు బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. చాలా మందికి గుండె పోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తున్నా వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే గుండె పోటు వచ్చే ముందు చాలా మందిలో కనిపించే లక్షణం.. గుండె అసాధారణ రీతిలో కొట్టుకోవడం. దీన్ని చాలా మంది సరిగ్గా గమనించరు. అయితే ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి.
కొందరికి గుండె ఉన్నట్లుండి సడెన్‌గా వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. అసాధారణ రీతిలో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో శరీరం అంతటా చెమటలు పడుతుంటాయి. ఆందోళనగా ఉంటారు. తమ చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాదు. అయోమయానికి గురవుతారు. తల తిరగడం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ కొంత సేపటికి అంతా సెట్ అవుతుంది. దీంతో తరువాత ఈ పరిస్థితి గురించి మరిచిపోతారు. ఇది దీర్ఘకాలంలో గుండె పోటుకు దారి తీస్తుంది. దీంతో ప్రాణాలను కోల్పోతారు. అయితే ఈ పరిస్థితి వచ్చినప్పుడే తగిన జాగ్రత్తలను పాటిస్తే గుండె పోటు రాకుండా చూసుకోవచ్చు. ప్రాణాలను నిలుపుకోవచ్చు.
అయితే ఇలా గుండె కొట్టుకునే వేగం సడెన్‌గా పెరిగేందుకు పలు కారణాలు ఉంటాయి. ఒత్తిడి, ఆందోళన అధికంగా ఉండడం, కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్‌ను మోతాదు మించి అధికంగా తాగడం, మద్యం ఎక్కువగా సేవించడం లేదా పొగ తాగడం, అతిగా వ్యాయామం చేయడం, శారీరక శ్రమ అధికంగా చేయడం, నిద్ర లేకపోవడం వంటి కారణాల వల్ల గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు మందులను వాడుతుంటే వారిలోనూ ఇలా జరుగుతుంది. అలాగే షుగర్ లెవల్స్ తగ్గినా, రక్తహీనత ఉన్నా, జ్వరం వచ్చినా, గుండె సమస్యలు ఉన్నా, దగ్గు లేదా జలుబు మందులను వాడుతున్నా, ఆస్తమా ఉన్నవారిలో, పలు రకాల మందులను వాడే వారిలో ఇలా గుండె కొట్టుకునే వేగం అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుంది.
ఈ లక్షణం కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. దీంతో మీకు గుండె సమస్య ఉన్నదీ లేనిదీ నిర్దారిస్తారు. ఒక వేళ సమస్య ఉంటే చికిత్స తీసుకోవాలి. దీంతో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ సమస్య ఉన్నవారు మెగ్నిషియం, పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తినాలి. ముఖ్యంగా అరటి పండ్లు, అవకాడోలు, ఆకుకూరలు, నట్స్‌ను అధికంగా తినాలి. ఇవి రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రోజూ కనీసం 7 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలను పాటిస్తూ వైద్యులు ఇచ్చే మందులను తీసుకుంటే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించవచ్చు.