Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
భారత్‌లో పండుగల సమయంలో ఆనందోత్సాహాలతోపాటు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే కొన్ని అంశాలు కూడా పెరుగుతాయి. నిద్ర వేళల్లో మార్పులు, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహారం తినడం, వేడుకల్లో శారీరక శ్రమ పెరగడం, భావోద్వేగ ఒత్తిడి వంటివి గుండెపై అదనపు భారాన్ని మోపుతాయి.
Heart Diseases | భారత్‌లో పండుగల సమయంలో ఆనందోత్సాహాలతోపాటు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే కొన్ని అంశాలు కూడా పెరుగుతాయి. నిద్ర వేళల్లో మార్పులు, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు, చక్కెర అధికంగా ఉండే ఆహారం తినడం, వేడుకల్లో శారీరక శ్రమ పెరగడం, భావోద్వేగ ఒత్తిడి వంటివి గుండెపై అదనపు భారాన్ని మోపుతాయి. ఈ కారణాల వల్ల పండుగల సమయంలో గుండెపోటు ముప్పు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే గుండెపోటు వచ్చినప్పుడు ఛాతిలో తీవ్రమైన నొప్పి మాత్రమే వస్తుందని భావించడం పొరపాటు. ముఖ్యంగా మహిళలు, మధుమేహం ఉన్నవారిలో కొన్ని సందర్భాల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తాయి. దవడలో నొప్పి లేదా బిగుతుగా అనిపించడం, ఎడమ చేయి లేదా రెండు భుజాల వైపు నొప్పి వ్యాపించడం, కారణం లేకుండా వికారం, వాంతులు రావడం, శ్రమ చేయకుండానే తీవ్రమైన అలసట కలగడం, చల్లని చెమటలు పట్టడం, తల తిరగడం వంటి లక్షణాలు కూడా గుండెపోటుకు సంకేతాలుగా మారే అవకాశం ఉంటుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి..
గుండెపోటు లక్షణాలను అజీర్ణం లేదా ఇతర సాధారణ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ముఖ్యంగా పండుగల సమయంలో భారీగా భోజనం చేసిన తర్వాత ఛాతి లేదా పొత్తికడుపు పైభాగంలో మంట, అసౌకర్యం కలిగితే చాలామంది దాన్ని గ్యాస్, ఎసిడిటీగా భావిస్తారు. సాధారణంగా భోజనం తర్వాత ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. పడుకున్నప్పుడు అసౌకర్యం ఎక్కువై, యాంటాసిడ్స్ వాడితే ఉపశమనం కలుగుతుంది. కానీ గుండె సంబంధిత నొప్పి దవడ, చేయి, వీపు లేదా మెడ వరకు వ్యాపిస్తుంది. యాంటాసిడ్స్ తీసుకున్నా తగ్గకపోవడంతోపాటు వికారం, చెమటలు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఛాతీ లేదా పొత్తికడుపు పైభాగంలో అసౌకర్యంతోపాటు విపరీతంగా చెమటలు పడితే వెంటనే వైద్య సహాయం పొందాలి. లక్షణాలు తగ్గుతాయేమోనని వేచి చూడకుండా గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం.
పండుగ సమయంలో ఆహారపు అలవాట్లు..
పండుగల సమయంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో వచ్చే మార్పులు కూడా గుండెపై ప్రభావం చూపుతాయి. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండి రక్తపోటు పెరుగుతుంది. మద్యం సేవించడం వల్ల గుండె వేగం, రక్తపోటు పెరగడంతోపాటు కొన్ని గుండె మందుల పనితీరుపై ప్రభావం పడుతుంది. నిద్ర సరిగా లేకపోవడం వల్ల రక్తపోటు నియంత్రణ, శరీరంలోని వాపు ప్రక్రియల్లో మార్పులు వస్తాయి. వేడుకల్లో ఎక్కువసేపు నృత్యం చేయడం, బరువులు మోయడం, నిలబడడం వంటి శారీరక శ్రమ వల్ల గుండెపై ఒక్కసారిగా భారం పెరుగుతుంది. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు లేదా అధిక రక్తపోటు ఉన్నవారిలో ఈ అంశాలన్నీ కలిసినప్పుడు గుండెపోటు ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
మందులను క్రమం తప్పకుండా వాడాలి..
అధిక రక్తపోటు, మధుమేహం లేదా గతంలో గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు పండుగల సమయంలోనూ తమ మందులను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా తీసుకోవాలి. మందుల వాడకంలో ఎలాంటి విరామం ఇవ్వకూడదు. ఈ సమయంలో రక్తపోటును తరచూ పరీక్షించుకోవడం మంచిది. ఆహారాన్ని మితంగా తీసుకోవడం, నూనె పదార్థాలు, ఉప్పు అధికంగా ఉండే వంటకాలను తగ్గించడం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు పాటించాలి. గుండెపోటును సూచించే లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉన్న ఆసుపత్రికి వెళ్లాలి. లక్షణాలు తగ్గుతాయేమోనని ఇంట్లోనే ఉండిపోవడం లేదా ఎసిడిటీ మందులు వేసుకుని వేచి చూడడం ప్రాణాపాయానికి దారితీస్తాయి. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళంలో అడ్డంకి ఏర్పడితే, సకాలంలో చికిత్స అందించడం ద్వారా దాన్ని తొలగించి గుండె కండరాలకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. అందువల్ల పండుగల ఆనందంలో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ప్రమాద సంకేతాలను గుర్తించి వెంటనే స్పందించడం అవసరమని నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Diseases | పండుగ సమయంలో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ.. హృదయ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..
Two students die | ప్రాణాలు తీసిన సెలవుల సరదా.. క్వారీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
డిండి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయాలి : జూలకంటి రంగారెడ్డి
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

