Health Tips | సీజన్ మారుతున్నకొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. వాతావరణం మారినప్పుడు ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికంగా వేధిస్తాయి. చలికాలంలో దగ్గు, జలుబు వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు. పైగా ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. దీనివల్ల ఏ పని మీద ఫోకస్ చేయలేం. ఇంగ్లీష్ మందులు వాడినా కూడా ఇవి అంత తొందరగా తగ్గవు. దీర్ఘకాలం వేధిస్తూనే ఉంటాయి. కాకపోతే వంటింట్లో దొరికే కొన్ని వస్తువులతో దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
అల్లం
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి దగ్గు నివారణకు అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసిన రోజూ ఒక గంట పాటు తినడం వల్ల కూడా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
తేనె
వంటింటి ఔషధాల్లో తేనే ఒకటి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఉంటాయి. అలాగే నియాసిన్, రైబోఫ్లోవిన్ వంటి మూలకాలను కలిగి ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా తేనె కలిపి తాగడం ద్వారా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
బెల్లం
బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి కీలకమైనరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శ్వాస సమస్యలను దూరం చేస్తాయి. పొడి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
తులసి – తమలపాకు
తమలపాకులో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దగ్గును రాకుండా చేయడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట తులసి ఆకులను నమలాలి. అవసరమైతే తులసిని నీళ్లలో వేసి మరగించి కషాయంలా కూడా తీసుకోవచ్చు.
పసుపు
దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు తగ్గించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్, యాంటీవైరల్ లక్షణాలు కఫాన్ని తగ్గిస్తాయి.
సిట్రస్ పండ్లు
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు రావడం తగ్గుతాయి.
వాము
రాత్రిపూట పొడిదగ్గు తీవ్ర ఇబ్బంది పెడుతుంది. నిద్రపట్టకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాబట్టి పడుకోవడానికి ముందు చిటికెడు వామును చేతిలో నలిపి.. దవడకు పెట్టుకుని కాసేపు చప్పరించాలి. దీనివల్ల దగ్గు అదుపులోకి వస్తుంది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కలో వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్‌ను ఎదుర్కొనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. ఇవి జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్క పొడిలో తేనే కలిపి.. రోజుకు రెండు మూడుసార్లు చప్పరిస్తే మంచి ఫలితం ఉంటుంది.
మరిన్ని చిట్కాలు
› ఆవాల నూనెను వాసన చూడండి. ముక్కు పట్టేసినట్టు ఉన్నచోట ఆవాల నూనెతో మర్దనా చేస్తే.. ఆ ఘాటుకు ముక్కులోని శ్లేష్మం బయటికి వస్తుంది.
› జీలకర్రను వేయించి, బాగా వేడిగా ఉన్నప్పుడే ఓ గుడ్డలో కట్టాలి. ఆ ఆవిరిని ముక్కుతో పీల్చుకుంటే శ్లేష్మం కరిగిపోతుంది.
› యూకలిప్టస్ పూలను వేడినీటిలో వేసి, ఆవిరి పడితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. యూకలిప్టస్ నూనె కూడా బాగానే పనిచేస్తుంది.
› ముక్కు రంధ్రాలు మూసుకుపోయినప్పుడు ఉల్లిపాయను దంచి వాసన చూడండి. ఆ ఘాటుకు కూడా శ్లేష్మం వదిలిపోతుందంటారు గృహ వైద్యులు.