మితిమీరి వాడినా, వేళాపాళా లేకుండా మింగినా, గుప్పిళ్లకొద్దీ గుటుక్కుమనిపించినా, షరతులు పాటించకపోయినా, నిపుణుల హెచ్చరికలను నిర్లక్ష్యం చేసినా.. ప్రాణాలను నిలబెట్టాల్సిన మందులే విషంగా మారతాయి. కీలక అవయవాలను దెబ్బతీస్తాయి. జీవితాలను బలితీసుకుంటాయి.
చికిత్సలో ఔషధాలదే కీలక పాత్ర. వ్యాధిని గుర్తించడం, నిర్ధారించడం ఒక ఎత్తయితే.. ఆ రోగం తగ్గడానికి ఔషధాలు తీసుకోవడం మరోఎత్తు. అయితే దేనికైనా ఒక పరిమితి, ఒక పద్ధతి అంటూ ఉండాలి. ఔషధాల వాడకానికి కూడా ఈ నియమం వర్తిస్తుంది. సరైన మోతాదులో, సరైన సమయానికి తీసుకునే ఔషధాలు అమృతంలా పనిచేస్తాయి. ఆయువు పోస్తాయి. అదే ఔషధాలను ఇష్టానుసారంగా వాడితే ప్రాణాల మీదికి వచ్చే ఆస్కారం ఉంది. ఎంత గొప్ప ఔషధం అయినా సరే.. అవసరం ఉంటేనే వాడాలి. అదీ వైద్యుడు సిఫారసు చేసిన మోతాదుకు లోబడే. అప్పుడే, మంచి ఫలితాన్ని ఇస్తుంది. రోగి కూడా వేగంగా కోలుకుంటాడు.
తప్పని దుష్ప్రభావాలు
అలోపతి ఔషధాలకు దుష్ప్రభావాలంటూ ఉంటాయి. అయితే ఇవి అన్ని సందర్భాలలో, అందరికీ వర్తించకపోవచ్చు. ఉదాహరణకు క్యాన్సర్ మందులు, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ మంచితో పాటు చెడూ చేస్తాయి. కొన్ని మందులు సాధారణంగా హానిచేయవు. కానీ ఇష్టానుసారంగా వాడితే మాత్రం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సరైన రీతిలో వాడక పోయినా, మోతాదులో హెచ్చుతగ్గులున్నా, సమయపాలన లేకపోయినా వాటి పనితీరు దెబ్బతింటుంది. అనారోగ్యానికి గురిచేస్తాయి.
యాంటీబయాటిక్స్
వీటిని ఖాళీ కడుపుతో కానీ, తిన్న వెంటనే కానీ తీసుకోరాదు. ఆహారం తీసుకున్న అరగంట తరువాతే వేసుకోవాలి. అంతేకాదు, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లను నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, పాలు, చల్లటి నీటితో వేసుకోకూడదు. మంచినీళ్లే ఉత్తమం. ప్రతి చిన్న సమస్యకూ యాంటీబయాటిక్స్ వాడటం మంచిదికాదు. దీనివల్ల రోగి సహజ ప్రతిరక్షకాల పనితీరు దెబ్బతింటుంది. మోతాదు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. రోగి వయసు, బరువు ఆధారంగానే వైద్యులు డోసేజీ నిర్ణయిస్తారు. ఆ మేరకు మాత్రమే తీసుకోవాలి. వాడకం మితిమీరితే, సమస్యలు తప్పవు. అలా అని, మరీ తక్కువ మోతాదులో తీసుకుంటే రోగం తగ్గదు సరికదా, వ్యాధి ముదిరే ఆస్కారం ఉంది. ఈ విష యంలో వైద్యుడిదే తుది నిర్ణయం.
గర్భ నిరోధక మాత్రలు
గర్భ నిరోధక మాత్రలు నేరుగా హైపోథాల మస్పై ప్రభావం చూపుతాయి. మెదడులో ఓ భాగమైన హైపోథాలమస్.. శరీర ఉష్ణోగ్రత, ఆకలి, మానసిక స్థితి, లైంగిక ఆసక్తిని నియంత్రిస్తుంది. నిద్రను సమతులం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. గర్భ నిరోధక మాత్రలు తరచూ వాడటం వల్ల హైపోథాలమస్ పరిమాణం తగ్గిపోయి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కాబట్టి, పరిమితికి మించి గర్భ నిరోధక మాత్రలు వాడటం మంచిదికాదు.
మధుమేహ మాత్రలు
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇన్సులిన్ తీసుకోవాలి. ఇంజక్షన్ సూది రక్తనాళాలకు తగలకుండా జాగ్రత్తగా పొడుచుకోవాలి. పొట్టకు తీసుకోవడమే సురక్షితం. ఇన్సులిన్ ఎక్కించుకున్న వెంటనే భోజనం చేయాలి. లేకపోతే, షుగర్ స్థాయి నేలచూపులు చూస్తుంది. రోగి మృత్యువాత పడే ప్రమాదమూ ఉంది.
థైరాయిడ్ బిళ్లలు
థైరాయిడ్ మందులను ఖాళీ కడుపుతో తీసుకోవాలి. భోజనానికి గంట ముందు అయితే ఉత్తమం. తిన్న తరువాత తీసుకుంటే మందుల ప్రభావం తగ్గిపోతుంది. సరిగ్గా పనిచేయవు. థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఔషధాలను క్రమం తప్పక తీసుకోవాలి. మాత్ర వేసుకోగానే టీ, కాఫీ తాగకూడదు. మంచినీళ్లే ఉత్తమం. థైరాయిడ్ మాత్రలు వేసుకున్న వెంటనే ఇతర ఔషధాలేవీ తీసుకోరాదు. కనీసం అరగంట వ్యవధి తరువాతే ఏ మందులైనా.
బీపీ మందులు
రక్తపోటు ఉండాల్సిన దానికంటే ఎక్కువైనా, మరీ తక్కువైనా ఆరోగ్యానికి హానికరమే. బీపీ ట్యాబ్లెట్‌కు ప్రత్యేక ఆహార నియమాలంటూ ఏమీ లేవు. కానీ సమయపాలన ముఖ్యం. వేళలు పాటించకపోతే సమర్థంగా పనిచేయవు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు బీపీ ట్యాబ్లెట్లను వాడటం సురక్షితం కాదు. తప్పని సరైతే, అదీ వైద్యుల సూచన మేరకే వాడాలి. కొన్నిరకాల బీపీ మాత్రల వల్ల కొందరికి పాదాలలో వాపు రావచ్చు. మరికొంత మందికి పొడి దగ్గు వస్తుంది. వాడుతున్న బీపీ మాత్రలు మారిస్తే, ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక్కడ కూడా సొంత నిర్ణయాలు పనికిరావు. ఏం చేసినా నిపుణుల సలహాతోనే.
పెయిన్ ‘కిల్లర్స్’
నొప్పి నివారణ మాత్రలను తరచూ వాడటం శ్రేయస్కరం కాదు. ఆ ప్రభావంతో గుండె, మూత్రపిండాలు, కాలేయం దెబ్బతినే అవకాశం ఉంది. కడుపులో అల్సర్స్ ఏర్పడతాయి. పెయిన్ కిల్లర్స్‌ను భోజనం తరువాతే తీసుకోవాలి. తరచూ పారసిటమల్ వాడితే కాలేయం దెబ్బతింటుంది. బ్రూఫిన్ వంటి ఔషధాల ప్రభావం షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులపై తీవ్రంగా ఉంటుంది. ఇరవై వారాలలోపు గర్భిణులు కనుక పెయిన్ కిల్లర్స్ వాడితే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. పాలిచ్చే తల్లులు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే ఆ ప్రభావం పిల్లల ఆరోగ్యం మీద పడుతుంది. అత్యవసరమైతే తప్ప, అదీ వైద్యుల సిఫారసుతోనే వాడాలి. పెయిన్ కిల్లర్స్ వేసుకోవడానికి ముందు కానీ, వేసుకున్న తర్వాత కానీ ఆల్కహాల్ తీసుకోవడం ప్రమాదకరం. దీనివల్ల కాలేయం దెబ్బతింటుంది.
పిల్లల విషయంలో..
చాలామంది తల్లిదండ్రులు శిశువులలో జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలు కనిపించగానే.. ఏదో ఓ సిరప్ వేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. సహజంగానే యాంటీబయాటిక్ మందులు చేదుగా ఉంటాయి. దీంతో, పిల్లలు వాంతి చేసుకునే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరానికి వరుసగా సిరప్లు వేసి.. చివర్లో యాంటిబయాటిక్ సిరప్ వేయడం వల్ల వాంతితో పాటు అన్ని సిరప్లు నేలపాలయ్యే ఆస్కారం ఉంది. వెంటవెంటనే సిరప్లు వేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఆ ద్రవాలు సమర్థంగా పని చేయవు కూడా. అందుకని ఒక సిరప్ వేసిన కనీసం మూడు నుంచి ఐదు నిమిషాల వ్యవధి తరువాతే మరో సిరప్ వేయాలి.
‘నో డ్రైవింగ్’ ప్లీజ్
అన్నం తిన్న పదిహేను నిమిషాల తరువాతే అలర్జీ మందులను తీసుకోవాలి. సాధారణంగా అలర్జీకి సంబంధించిన సిట్రిజన్, ఎవిల్ తదితర మాత్రల వల్ల కొంత మత్తుగా ఉంటుంది. ఖాళీ కడుపుతో వేసుకుంటే ఆ మత్తు పెరిగిపోయే ఆస్కారం ఉంది. ముఖ్యంగా అలర్జీలకు సంబంధించిన మాత్రలు తీసుకున్నప్పుడు వాహనాలు నడపరాదు. ఆ మత్తు రోడ్డు ప్రమాదాలకు కారణం కావచ్చు.
జాగ్రత్త.. జాగ్రత్త
ఇంకా అనేకం..
నిద్ర మాత్రలు, దగ్గు బిళ్లలు, మానసిక రోగులకు వాడే మందులు, అంగ స్తంభన సమస్యను పరిష్కరించే ఔషధాలను కూడా చాలామంది దుర్వినియోగం చేస్తారు. నిద్రపట్టకపోవడానికి అనేకానేక కారణాలు ఉంటాయి. మూలాల్లోకి వెళ్లి ముందు వాటిని పరిష్కరించుకోవాలి. అంతేకానీ, నిద్రమాత్రలకు అలవాటు పడితే.. అదో వ్యసనంగా మారుతుంది. ఆరోగ్య వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. దగ్గు మందులను కొంతమంది మత్తుకోసం ఉపయోగిస్తుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో శ్వాసకోశ రుగ్మతలు చుట్టుముడతాయి. అంగస్తంభన సమస్యకు సెక్సాలజిస్టులు సిఫారసు చేసే ఔషధాలను చాలామంది కృత్రిమ లైంగిక శక్తి కోసం వాడతారు.
ఆ ప్రభావం రక్తపోటు మీద పడుతుంది. అధిక రక్తపోటు ఫలితంగా గుండెపోటు, పక్షవాతం రావచ్చు. నిజానికి అంగస్తంభన సమస్య.. ఓ ప్రమాద హెచ్చరిక. ఇంకేవో రుగ్మతలకు సూచిక. వైద్యుడి దగ్గరికి వెళ్లి గంటల తరబడి ఎదురుచూసే ఓపికలేక కొంతమంది ఏదో సందర్భంలో కుటుంబ సభ్యులకో, స్నేహితులకో డాక్టర్లు సిఫారసు చేసిన మందులను వాడేస్తుంటారు. ఇది మరింత ప్రమాదకరం. మిడిమిడి జ్ఞానంతో మెడికల్ షాపు కౌంటర్లలో అమ్మే మందులు కూడా ప్రాణానికి ఎసరుపెట్టేవే. కాబట్టి, నిపుణులు ఇవ్వని ఏ ఔషధమూ సురక్షితం కాదని గుర్తుంచుకోవాలి. వాడాల్సిన మందులు వాడాల్సిన మోతాదులో, వాడాల్సిన సమయంలో వాడకపోతే.. బతుకు వాడిపోవడం ఖాయం!
…?మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ ఆకుల సంజయ్‌రెడ్డి
ఫార్మకాలజిస్టు
చైర్మన్, తెలంగాణ రాష్ట్ర
ఫార్మసీ కౌన్సిల్