సానుకూల దృక్పథం ఉన్నవారు.. మిగతావారితో పోలిస్తే సంతోషంగా ఉంటా రన్నది తెలిసిన విషయమే. ఆ పాజిటివ్ వ్యక్తుల లోకం మరింత అందంగా ఉంటుందనీ మనకు తెలుసు. కానీ ఇలాంటి దృక్పథం ఉన్నవారు, మరింతకాలం జీవిస్తారని ఊహించగలమా! హార్వర్డ్‌కు చెందిన శాస్త్రవేత్తల ప్రకారం.. సానుకూల దృక్పథం ఉన్నవాళ్లు మరింతకాలం జీవించడమే కాకుండా, 90 ఏండ్లకు మించి బతికే అవకాశం ఉందని తేల్చారు. దీనికోసం వాళ్లు 50-79 వయసు మధ్య ఉన్న దాదాపు 1.60 లక్షలమంది మహిళలను ఎంచుకున్నారు. ఏకంగా వీరిని 26 సంవత్సరాల పాటు గమనించారు. ఈ బృందంలో అన్ని జాతులవారూ ఉండటం విశేషం. ఇతరులతో పోలిస్తే ఆశావాదులు… 5.4 శాతం ఎక్కువకాలం జీవించే అవకాశం ఉందనీ, 90 ఏండ్లను మించి బతికే ఆస్కారం పది శాతానికి మించి ఉందనీ తేల్చారు. మంచి వ్యాయామం, పోషకాహారం ఈ ఫలితాలను ఇంకొంత మెరుగు పరుస్తాయని కూడా నిర్ధారించారు
సూర్యరశ్మి-మెదడు!
డిమెన్షియా… ఒక్కమాటలో చెప్పాలంటే వృద్ధాప్యంలో వచ్చే మతిమరపు. కానీ ఈ స్థితిలో చాలా సమస్యలే ఉంటాయి. విశ్లేషణ శక్తి, మంచిచెడుల విచక్షణ.. అన్నీ క్షీణిస్తూ పోతాయి. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతున్నారని ఓ అంచనా. ఏటా పది లక్షల డిమెన్షియా కేసులు నమోదవుతున్నాయి. ఇక బయటికి రానివీ.. వయసుతో వచ్చే మతిమరపుగా కొట్టిపారేసే కేసులూ ఇంకెన్నో. ఇంత తీవ్రమైన సమస్యకు ఓ సులువైన ఉపాయం ఉందంటున్నారు పరిశోధకులు. విటమిన్-డి తీసుకున్న వారిలో డిమెన్షియా కేసులు ఏకంగా 17 శాతం తగ్గినట్టు అంచనా వేస్తున్నారు. మెదడు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్-డి చాలా ముఖ్యమనీ… అది తగినంత లభించిన రోజున డిమెన్షియాతో పాటు పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా సన్న గిల్లుతాయనీ చెబుతున్నారు.
ఒత్తిడితో కొవిడ్
ఒత్తిడితో మన రోగ నిరోధక శక్తి మరింత తగ్గుతుందని మరో ప్రయోగం నిరూపిస్తున్నది. ఉద్యోగంలో చిరాకు, వివక్ష, మనసును కలచివేసే సంఘటనలు… ఇవన్నీ కూడా మనలో ఒత్తిడిని పెంచేవే. వీటివల్ల క్యాన్సర్, హృద్రోగం లాంటి సమస్యలతో పాటు రోగ నిరోధక శక్తి తగ్గుతుందని సౌత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల కొవిడ్ లాంటి ఇన్ఫెక్షన్లు త్వరగా, తీవ్రంగా మనమీద దాడి చేస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని తేల్చేందుకు వారు 50 ఏండ్లు దాటిన 5,744 మంది రక్తకణాలను పరిశీలించారు. వీరిలో ఒత్తిడి ఉన్నవారిలో… రోగ నిరోధక శక్తిని సూచించే
టి సెల్స్ తగ్గుముఖం పడుతున్నాయని తేలింది.
బీరుతో కడుపు చల్లగా…
గట్ బ్యాక్టీరియా అంటే.. మన జీర్ణాశయంలో ఉండే మంచి సూక్ష్మజీవులే. ఇవి మన ఆరోగ్యానికి కీలకమని చెప్పే పరిశోధనలూ బయటపడుతున్నాయి. గట్ బ్యాక్టీరియా బాగుంటే, మధుమేహం మొదలు హృద్రోగం వరకూ ఎన్నో సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గట్ బ్యాక్టీరియా మెరుగ్గా ఉండటానికి ప్రో బయాటిక్స్ చాలా కీలకం. పులియబెట్టిన పదార్థాల్లో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి (ఉదా: పెరుగు). బీర్ కూడా పులియబెట్టిన పదార్థమే కదా? మరి దానివల్ల గట్ బ్యాక్టీరియాకు ఎంతవరకు మేలు జరుగుతుంది! అనే ఆలోచన వచ్చింది పరిశోధకులకు. ఈ విషయాన్ని నిరూపించేందుకు వారు కొందరికి నెల రోజులు భోజనంతోపాటు బీరు గ్లాసునూ అందించారు. నెల గడిచిన తర్వాత, ఇతరులతో పోలిస్తే వారి గట్ బ్యాక్టీరియా మెరుగుపడటాన్ని గమనించారు. ఈ పరిశోధన చదివాక లొట్టలేసే బీర్బల్లకు ఓ వివరణ! పరిశోధకులు అందించిన బీరు కేవలం పదకొండు ఔన్సులు మాత్రమే! అంటే, సుమారు మన కూల్‌డ్రింక్ బాటిల్ అంతే. మరో విషయం ఏమిటంటే… మద్యంతో ఉన్న బీరువల్ల ఎలాంటి ఉపయోగం ఉందో, మద్యం లేని బీరు (నాన్ ఆల్కహాలిక్ బీర్) వల్ల కూడా ఇంతే ఉపయోగం ఉందని తేలింది.