Chukka Kura | ఆకుకూరలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిల్లో అనేక రకాలు ఉంటాయి. ఒక్కో ఆకుకూర మనకు భిన్న రకాల లాభాలను అందిస్తుంది. అందుకనే వైద్యులు, పోషకాహార నిపుణులు కూడా తరచూ ఆకుకూరలను తినాలని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ఎవరైనా తమ అభిరుచి, ఇష్టానికి అనుగుణంగా భిన్న రకాల ఆకుకూరలను తింటుంటారు. ఆకుకూరలతో పచ్చడి లేదా పప్పు చేసుకుని తినవచ్చు. లేదంటే వాటిని టమాటాలతో కలిపి వండుకుని తినవచ్చు. కొందరు ఆకుకూరలను నేరుగా జ్యూస్ చేసుకుని ఉదయం తాగుతుంటారు. ఇక ఆకుకూరల్లో చుక్క కూర కూడా ఒకటి. అన్న ఆకుకూరలకు వివిధ రకాల ప్రత్యేకతలు ఉన్నట్లే చుక్క కూర కూడా అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొందవచ్చు.
చుక్కకూరను తింటే అనేక పోషకాలు లభిస్తాయి. పలు రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చుక్క కూరలో ఉంటాయి. ఇవి మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. చుక్క కూరలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కనుకనే ఈ ఆకులు రుచికి పుల్లగా ఉంటాయి. విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. దీని వల్ల చర్మం తన సహజసిద్ధమైన సాగే గుణాన్ని పొందుతుంది. దీంతో ముఖంపై ఉండే ముడతలు తొలగిపోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి, యవ్వనంగా కనిపిస్తారు. చుక్కకూరలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. చర్మ సంరక్షణకు సహాయం చేస్తుంది.
చుక్కకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. దీని వల్ల రక్తంలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. దీంతో అలసట, నీరసం తగ్గుతాయి. అలాగే రక్తం వృద్ధి చెందుతుంది. రక్తహీనత తగ్గుతుంది. చుక్కకూరలో మెగ్నిషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి బీపీని నియంత్రణలో ఉంచుతాయి. హైబీపీ ఉన్నవారికి మేలు చేస్తాయి. కండరాలు, నాడులు సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. ముఖ్యంగా రాత్రి పూట కాలి పిక్కలు పట్టుకుపోకుండా ఉంటాయి. అలాగే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. చుక్కకూరలో క్యాల్షియం సైతం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఆకుల్లో పాలిఫినోలిక్ యాసిడ్లు, ఫ్లేవనాయిడ్స్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో అంతర్గతంగా ఉండే వాపులను తగ్గేలా చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి సురక్షితంగా ఉండవచ్చు.
చుక్క కూరలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఆకులను రోజూ జ్యూస్‌లా తయారు చేసి కూడా తాగవచ్చు. దీని వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు పోతాయి. శరీరం డిటాక్స్ అవుతుంది. రోగాలు రాకుండా చూసుకోవచ్చు. అయితే చుక్కకూరలో ఆగ్జాలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్లను కలగజేస్తుంది. కనుక కిడ్నీ స్టోన్లు ఉన్నవారు చుక్క కూరను తినకపోవడమే మంచిది. ఇక చుక్క కూరను వండే ముందు బాగా శుభ్రం చేయాలి. దీని వల్ల అందులో ఉండే ఆగ్జాలిక్ యాసిడ్ కొంత వరకు తగ్గుతుంది. దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడే ముప్పు కాస్త తగ్గుతుంది. అయితే చుక్క కూరను మోతాదులోనే తినాలి. మరీ అధికంగా తినడం కూడా మంచిది కాదు. దీని వల్ల మనం తిన్న ఆహారంలో ఉండే క్యాల్షియం, ఐరన్‌ను శరీరం శోషించుకోదు. ఫలితంగా ఈ మినరల్స్ లోపం ఏర్పడుతుంది. కనుక చుక్క కూరను మోతాదులో తింటేనే అనేక లాభాలను పొందవచ్చు.