Guava Leaves Tea | రోజూ ఉదయం నిద్ర లేవగానే చాలా మంది తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. ఉదయం టీ లేదా కాఫీ తాగనిదే కొందరికి తృప్తి అనిపించదు. అవి తాగాకే తమ పనులను మొదలు పెడతారు. అయితే ఇలా ఉదయం పరగడుపునే టీ లేదా కాఫీ తాగడం అంత శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. టీ, కాఫీలకు బదులుగా హెర్బల్ టీలను తాగితే మంచిదని వారు సూచిస్తున్నారు. ఇక మనకు అందుబాటులో ఉండే అనేక రకాల హెర్బల్ టీలలో జామ ఆకుల టీ కూడా ఒకటి. చాలా మంది ఇళ్లలో జామ చెట్లు ఉంటాయి. వీటి నుంచి లేత ఆకులను కోసి వాటిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు. లేదా మార్కెట్లో జామ ఆకుల టీ పొడి ప్యాకెట్లు కూడా లభిస్తాయి. వాటితోనూ ఈ టీని తయారు చేసి తాగవచ్చు. ఈ టీని సేవించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ ఆకులతో తయారు చేసే టీని సేవించడం వల్ల మన శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్ నశిస్తాయి. దీంతో కణాలు దెబ్బ తినకుండా ఉంటాయి. ఫలితంగా క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే జామ ఆకుల్లో విటమిన్ సి కూడా అధికంగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మనకు సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. చలికాలంలో జామ ఆకులతో టీ తయారు చేసి తాగడం వల్ల మనకు ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందడమే కాదు, జ్వరం కూడా త్వరగా తగ్గుతుంది.
జామ ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో చర్మంలో కాంతి పెరుగుతుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. చర్మం ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తుంది. జామ ఆకులతో తయారు చేసే టీని సేవించడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ సైతం అదుపులోకి వస్తాయి. దీంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి జామ ఆకులు ఎంతో మేలు చేస్తాయి. దీని వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.
జామ ఆకులతో టీ తయారు చేసి ఉదయం తాగడం వల్ల రోజంతా శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. ఫలితంగా కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్న వారికి జామ ఆకులు ఎంతగానో మేలు చేస్తాయి. జామ ఆకులతో టీ తయారు చేసి తాగడం వల్ల కడుపు ఉబ్బరం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ఇలా జామ ఆకుల టీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఈ టీని రోజుకు ఒక కప్పు తాగినా చాలు ఎన్నో లాభాలను పొందవచ్చు.