ఎండల్లో హాయ్ హాయ్ అంటూ కేరింతలు కొడుతూ పిల్లలు స్విమ్మింగ్ పూల్స్‌కి వెళ్తున్నారు. స్విమ్మింగ్ సంతోషమే కాదు ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కాపాడుకునే నైపుణ్యం కూడా. కాబట్టి పిల్లలకు స్విమ్మింగ్ నేర్పించాలి. పట్టణాల్లో చాలాచోట్ల స్విమ్మింగ్ నేర్పించే బోర్డులు కనిపిస్తున్నాయి. పల్లెల్లో చెరువులు, బావుల్లో ఈత కొట్టేందుకు పిల్లలు ఇష్టపడుతుంటారు. పిల్లలకు స్విమ్మింగ్ మనోల్లాసంతోపాటు శరీర దారుఢ్యాన్నీ పెంచుతుంది. అయితే ఈ సందర్భంలోనూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు కొందరు. కాబట్టి తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలకు కొన్ని మెలకువలు నేర్పాలి. అప్పుడే ప్రమాదాలు జరగవు, అనారోగ్య సమస్యలు రావు.
బాల్యంలో ఎక్కువమంది ఎదుర్కొనే ప్రమాదాల్లో ఊపిరితిత్తుల్లోకి నీళ్లు పోవడం ఒకటి. చిన్న పిల్లలు టబ్బుల్లో, స్విమ్మింగ్ పూల్‌లో ఒక్కోసారి మునిగిపోతారు. ఆ సందర్భంలో లైఫ్ రిస్క్‌ని ఎదుర్కొంటారు. పిల్లలు ఎదుర్కొనే ప్రాణాంతకమైన సమస్యల్లో ఇదీ ఒకటి. కాబట్టి పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలను స్విమ్మింగ్‌కి అనుమతించొద్దు. పిల్లలు ఈదుతున్నంత సేపూ పెద్దవాళ్లు గమనిస్తూనే ఉండాలి. కొంత సమయం ఈదగలుగుతున్నారని వారిని ఒంటరిగా వదలిపెట్టొద్దు. స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వయో పరిమితి ఉంది. మూడు నుంచి నాలుగు ఏళ్ల వయసు పిల్లలు ఈత నేర్చుకోవచ్చు. అంతకంటే చిన్న వయసు పిల్లలకు చెప్పినా ఈదడం నేర్చుకోలేరు. కాబట్టి ప్రమాదాల బారినపడతారు.
పిల్లలు పొరపాటున నీళ్లలో మునిగితే.. వాళ్లకు తక్షణ సాయం అందించాలి. సీపీఆర్ చేయడం వచ్చిన వాళ్లు అందుబాటులో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోనే ఈతకు పంపాలి. కొత్తగా నేర్చుకునే పిల్లలకు ఫ్లోటర్ సపోర్ట్ ఉంటే మంచిది. ‘ఫ్లోటర్ సపోర్ట్ ఉంది కదా’ అని వాళ్లను వదిలేయొద్దు. అయినా సరే పెద్దల పర్యవేక్షణ అవసరం. నియాన్ కలర్ దుస్తులు, క్యాప్ ఉంటే ప్రమాదవశాత్తు పిల్లలు నీళ్లలో మునిగితే త్వరగా వాళ్లను గుర్తించవచ్చు. జలుబు,దగ్గు, జ్వరం, వాపులు ఉంటే పిల్లలను స్విమ్మింగ్‌కి పంపకూడదు.
సాధారణంగా ఈత కొలనులో ఎక్కువ సేపు గడపడం వల్ల పిల్లలకు గ్యాస్ట్రో ఎంటరైటిస్, ఎడినోవైరస్ ఇన్ఫెక్షన్, గొంతు నొప్పి, గొంతు వాపు, చెవి ఇన్ఫెక్షన్ తలెత్తవచ్చు. క్లోరిన్ కలిసిన నీళ్లలో ఈదడం వల్ల చర్మంపై అలర్జీ వల్ల దద్దుర్లు వస్తాయి. ఇతర స్విమ్మర్ల నుంచి కూడా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకవచ్చు. ఈదేప్పుడు నీళ్లు ముక్కులోకి పోతే నిమోనియా రావొచ్చు.
స్విమ్మింగ్‌కి వెళ్లేముందు, అయ్యాక స్నానం చేయడం మర్చిపోవద్దు. స్విమ్మింగ్ అయిపోయిన తర్వాత చెవుల్లోని తేమ త్వరగా ఆరేలా చూసుకోవాలి. ఎక్కువసేపు తేమ ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈత వల్ల శరీరం నీటిని కోల్పోతుంది. కాబట్టి తగినన్ని నీళ్లు తాగాలి.
– డాక్టర్ అనుపమ వై.
సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్