Foods For Kids Memory | ప్రస్తుతం ఏ రంగంలో చూసినా పోటీతత్వం విపరీతంగా పెరిగిపోయింది. అన్ని రంగాల్లోనూ అవకాశాల కోసం చాలా మంది పోటీ పడుతున్నారు. కానీ కేవలం ప్రతిభ ఉన్నవారికే అవకాశాలు వస్తున్నాయి. అయితే ప్రతిభ ఉండాలన్నా, చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నా మెదడు వికసించాలి. చిన్నతనం నుంచే అలా జరిగితే పెద్దయ్యాక కచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. అయితే పిల్లలకు మెదడు వికసించాలంటే అందుకు వారికి తగిన ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. వారి మెదడు పనితీరును మెరుగు పరచాలంటే పలు ఆహారాలు దోహదం చేస్తాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారాలను వారికి ఇస్తుంటే వారి మెదడు అభివృద్ధి చెందుతుంది. యాక్టివ్ గా ఉంటారు. చదువుల్లో రాణిస్తారు. అయితే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అంటే కేవలం చేపల్లోనే కాదు, పలు వృక్ష సంబంధ పదార్థాల్లోనూ ఉంటాయి. వాటిని కూడా పిల్లలకు ఇవ్వవచ్చు. దీంతో వారి ప్రతిభా పాటవాలు పెరిగి చదువుల్లో అందరికన్నా ముందే ఉంటారు. ఇక ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాల్ నట్స్ గురించి అందరికీ తెలిసిందే. ఇవి అచ్చం మనిషి మెదడు ఆకారంలో ఉంటాయి. వీటిని బ్రెయిన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. వాల్ నట్స్‌లో ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల జాబితాకు చెందుతుంది. కనుక వాల్ నట్స్‌ను పిల్లలకు రోజూ ఇస్తే వారి మెదడు వికసిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పాఠ్యాంశాలను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే వెజిటేరియన్ ఆహారాల్లో అవిసె గింజలు కూడా ఒకటి. వీటిని కూడా పిల్లలకు రోజూ ఇవ్వవచ్చు. అవిసె గింజలను పొడిగా చేసి చపాతీ పిండిలో కలిపి దాంతో చపాతీలను తయారు చేసి పిల్లలకు పెట్టవచ్చు. స్మూతీలలో కలిపి ఇవ్వవచ్చు. అవిసె గింజలతో లడ్డూలను తయారు చేసి కూడా పిల్లలకు ఇవ్వవచ్చు. వీటి ద్వారా కూడా పిల్లల మెదడు పనితీరు మెరుగు పడుతుంది.
చియా విత్తనాల్లో ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఈ విత్తనాలను రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పిల్లలకు ఇవ్వాలి. నేరుగా తినకపోతే మిల్క్ షేక్స్, పాలు, ఇతర పానీయాల్లో కలిపి ఇవ్వవచ్చు. చియా విత్తనాల్లో ఉండే పోషకాలు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. మెదడు యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. దీంతో వారు చదువుల్లో రాణిస్తారు. మార్కెట్లో మనకు హెంప్ విత్తనాలు కూడా లభిస్తాయి. వీటిని కూడా పిల్లలకు ఇవ్వవచ్చు. ఈ విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందువల్ల వీటిని ఇస్తే పిల్లల తెలివి తేటలు పెరుగుతాయి. సలాడ్స్, తృణ ధాన్యాలు, బ్రేక్ ఫాస్ట్, ఎనర్జీ బార్స్ వంటి వాటిపై ఈ విత్తనాలను చల్లి ఇవ్వవచ్చు. దీంతో పిల్లల ఆరోగ్యం మెరుగు పడుతుంది.
ఆల్గే నుంచి తయారు చేసే ఆల్గాల్ ఆయిల్ అనే నూనెను కూడా పిల్లలకు ఇవ్వవచ్చు. ఇది పూర్తిగా శాకాహారం. ఇందులో డీహెచ్ఏ ఉంటుంది. ఇది కూడా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల జాబితాకు చెందుతుంది. ఇది మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. పిల్లలకు ఈ నూనెను ఇవ్వడం వల్ల వారి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. చదువుల్లో యాక్టివ్‌గా ఉంటారు. సోయా టోఫు, సోయా పాలలోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అలాగే ప్రోటీన్లు కూడా లభిస్తాయి. వీటిని పిల్లలకు తరచూ ఇస్తున్నా కూడా వారి మెదడు వికసిస్తుంది. తెలివితేటలు పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు. పిల్లల ఆరోగ్యానికి గుమ్మడికాయ విత్తనాలు కూడా పనిచేస్తాయి. వీటిల్లోనూ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. అలాగే జింక్, మెగ్నిషియం కూడా అధికంగా లభిస్తాయి. గుమ్మడికాయ విత్తనాలను పిల్లలకు ఇవ్వడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరిగి చదువుల్లో యాక్టివ్‌గా ఉంటారు. ఇలా ఆయా ఆహారాలను పిల్లలకు ఇస్తుంటే వారిలో తెలివితేటలు పెరిగి అన్నింట్లోనూ ముందుంటారు. పెద్దయ్యాక ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.